స్వల్పకాలిక విద్యుత్‌ రేట్లు తగ్గింపు

Short-term reduction of electricity rates in AP - Sakshi

ల్యాంకో, స్పెక్ట్రం ధర తగ్గింపు

యూనిట్‌కు 60 పైసలు కోత

అనవసర భారం నుంచి ప్రజలకు విముక్తి

డిస్కమ్‌లకు రూ.60 కోట్లు ఆదా

ఏపీఈఆర్‌సీ కీలక ఆదేశాలు

సాక్షి, అమరావతి: విద్యుత్‌ వినియోగదారులపై అదనపు భారం లేకుండా చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. రెండు స్వల్పకాలిక విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను పునః సమీక్షించింది. మార్కెట్‌ రేట్లకు అనుగుణంగా వాటి ధరలను తగ్గించింది. ఫలితంగా డిస్కమ్‌లకు రూ.60 కోట్ల మేర ఆదా అవుతుందని ఏపీఈఆర్‌సీ చైర్మన్‌ జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డి తెలిపారు. ఈ మేరకు కమిషన్‌ ఆదేశాలు ఇచ్చిందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులకు వివరించారు. 

► గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు ల్యాంకో, స్పెక్ట్రంతో ఏపీ డిస్కమ్‌లకు ఉన్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం 2016తోనే ముగిసింది. అయినప్పటికీ పాత ప్రభుత్వం గడచిన మూడేళ్లుగా పాత ధరలతోనే విద్యుత్‌ కొనుగోలు చేస్తోంది. ల్యాంకోకు యూనిట్‌కు రూ.3.29, స్పెక్ట్రంకు యూనిట్‌కు రూ.3.31 చొప్పున డిస్కమ్‌లు చెల్లిస్తున్నాయి. 
► అయితే, ఈ ఏడాది రెండు విద్యుత్‌ సంస్థల నుంచి విద్యుత్‌ కొనుగోలుకు కమిషన్‌ అనుమతించలేదు. రాష్ట్రంలో మిగులు విద్యుత్‌ ఉండటం, ఆ రెండు సంస్థల కన్నా మార్కెట్లో తక్కువకే విద్యుత్‌ లభిస్తుండటమే కారణంగా ఏపీఈఆర్‌సీ స్పష్టం చేసింది. 
► లాక్‌డౌన్‌ కాలంలో బొగ్గు సమస్య రావచ్చని భావించిన డిస్కమ్‌లు గ్యాస్‌ విద్యుత్‌ను తీసుకోవాలని కోరడంతో ఏప్రిల్, మే నెలలకు కమిషన్‌ అనుమతించింది. అయితే వారం రోజుల్లోనే ప్రపంచ మార్కెట్లో గ్యాస్‌ రేట్లు తగ్గాయి. దీంతో జూన్‌ నుంచి విద్యుత్‌ తీసుకోవాల్సిన అవసరం లేదని కమిషన్‌ అభిప్రాయపడింది. ఒకవేళ తీసుకుంటే, స్పెక్ట్రంకు యూనిట్‌కు రూ.3.31కి బదులు రూ. 2.71, ల్యాంకోకు రూ.3.29కి బదులు యూనిట్‌కు రూ.2.69 చొప్పున చెల్లించాలని డిస్కమ్‌లను ఆదేశిస్తూ టారిఫ్‌ ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ వరకే అనుమతించింది.
► అక్టోబర్, నవంబర్‌ నెలల్లో తదుపరి సంవత్సరానికి అవసరమైన వార్షిక, ఆదాయ అవసర నివేదికలను డిస్కమ్‌లు రూపొందిస్తాయి. అప్పుడు ఈ రెండు సంస్థల నుంచి విద్యుత్‌ తీసుకోవాలా? వద్దా? అనేది నిర్ణయిస్తాయి.
► సెప్టెంబర్‌ వరకూ తీసుకునే ఈ విద్యుత్‌ దాదాపు వెయ్యి మిలియన్‌ యూనిట్లు ఉంటుందని విద్యుత్‌ సంస్థలు అంచనా వేశాయి. కమిషన్‌ తగ్గించిన రేట్ల వల్ల విద్యుత్‌ సంస్థలకు యూనిట్‌కు 60 పైసల చొప్పున, మొత్తం రూ.60 కోట్లు ఆదా అవుతుందని కమిషన్‌ వర్గాలు తెలిపాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top