ముప్పు ముంగిట ఓడలరేవు

sea 50 meters comes forward - Sakshi

ఉప్పొంగుతున్న సముద్రం ఐదు రోజులుగా ఎగసిపడుతున్న అలలు

50 మీటర్లు ముందుకొచ్చిన సముద్రం

లోతట్టు ప్రాంతాలు జలమయం

టెర్మినల్‌కు పొంచి ఉన్న ప్రమాదం

ఓఎన్‌జీసీ కార్యకలాపాలే ఇందుకు కారణం

రక్షణ గోడ హామీ ఏమైంది?  

అల్లవరం (అమలాపురం): తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు వద్ద ఎగసిపడుతున్న అలల తాకిడికి సముద్రం 50 మీటర్లు ముందుకు చొచ్చుకొచ్చింది. బుధవారం ప్రారంభమైన అలలు క్రమేపీ పెరుగుతూ సోమవారం నాటికి ఉగ్రరూపం దాల్చాయి. తీరానికి ఆనుకుని ఉన్న సరుగుడు తోటలు, ఆక్వా చెరువులు, పల్లపు ప్రాంతాలు సముద్రం నీటితో నిండిపోయాయి. సముద్ర రిసార్ట్స్‌ నుంచి నదీ సంగమం వరకూ తీరం కోతకు గురైంది.

మునుపెన్నడూ లేని విధంగా కెరటాలు ఎగసిపడుతున్నాయి. పెద్ద పెద్ద వృక్షాలు నెలకొరుగుతున్నాయి. కెరటాల ఉధృతికి సరుగుడు తోటల్లో ఇసుక మేటలు వేసింది. అలల ఎగసిపడుతుండటంతో ఓడలరేవుకు పర్యాటకులు రావడానికే భయపడుతున్నారు. తీరం వెంబడి సముద్రంలో చమురు నిక్షేపాల ఆన్వేషణకు చమురు సంస్థలు చేస్తున్న కార్యకలాపాలతో తీర గ్రామాలకు ముప్పు పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఓఎన్‌జీసీ కార్యకలాపాలతో సముద్రగర్భం విధ్వంసం
ఓడలరేవు సముద్ర లోతు జలాల్లో లభ్యమవుతున్న చమురును పైపుల ద్వారా తరలించి సొమ్ము చేసుకుంటున్న ఓఎన్‌జీసీ ఆయా ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తోందనేది నగ్నసత్యం. చమురు అన్వేషణకు సిస్మిక్‌ సర్వేలో విధ్వంసకర బాంబులను భూమిలోకి పంపి బాంబింగ్‌ చేయడం వల్ల భూమి కుంగిపోతోంది. రెండు దశాబ్దాలకు ముందు, ఇప్పటి ఓడలరేవుకి ఎంతో తేడా కనిపిస్తోంది. 20 ఏళ్లలో సముద్రం 150 మీటర్ల పొడవున ముందుకు చొచ్చుకొచ్చిందంటే ఏ స్థాయిలో తీరం కోతకు గురవుతుందో అర్థమవుతోంది.

తీరంలో ఓఎన్‌జీసీ బావులే అందుకు సాక్ష్యం. 2004లో సునామీ రాక ముందు ఓఎన్‌జీసీ బావులకు కనీసం 100 మీటర్ల దూరంలో సముద్రం ఉండేది. 2004లో సునామీ రాకతో తీరంలో చమురు అన్వేషణకు ఓఎన్‌జీసీ తవ్విన బావులు వరకూ కోతకు గురయింది. తుపాన్లప్పుడు మినహా సుమారు 18 ఏళ్లపాటు ఓఎన్‌జీసీ బావులను దాటి రాని సముద్రం ఇప్పుడు బీభత్సం సృష్టిస్తోంది.

ఆ హామీ ఏమైంది?
సునామీ వచ్చాక ఓఎన్‌జీసీ టెర్మినల్‌కు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని గ్రహించిన ఓఎన్‌జీసీ అధికారులు కొమరగిరిపట్నం ఏడ్ల రేవు నుంచి ఓడలరేవు నదీ సంగమం వరకూ రూ.100 కోట్లతో రక్షణ గోడ నిర్మాణానికి చర్యలు చేపడతామని 2011లో ప్రతిపాదనలు చేశారు. తర్వాత వశిష్ట టెర్మినల్‌లో విస్తరణలో భాగంగా 2014 ఆగస్టులో మంత్రి రాజప్ప, ఎమ్మెల్యే ఆనందరావు, అప్పటి ఆర్డీవో సమక్షంలో గ్రామస్థులతో చేసుకున్న ఒప్పంద సమయంలో రక్షణ గోడ తెరపైకొచ్చింది.

టెర్మినల్‌ రక్షణకు నాలుగు కిలోమీటర్ల పొడవునా తీరం వెంబడి గోడ నిర్మాణానికి ఓఎన్‌జీసీ హామీ ఇచ్చింది గానీ అది ఇంతవరక కార్యరూపం దాల్చలేదు. తీరంలో దట్టంగా ఉండే సరుగుడు తోటలను దాటుకుని రైతుల భూములకు హద్దులుగా ఉండే తాటిచెట్లను సైతం సముద్రం నేడు తనలో కలుపుకొంటోంది. ఐదు రోజులుగా సాగుతున్న కెరటాల ఉధృతికి మెరక ప్రాంతాల్లో 50 మీటర్లు, పల్లపు ప్రాంతాల్లో 70 మీటర్ల పొడవునా సముద్రం ముందుకొచ్చింది. అలల ఉధృతి ఇలాగే కొనసాగితే తీరానికి 100 మీటర్ల దూరంలో ఉన్న ఓఎన్‌జీసీ టెర్మినల్‌కు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.

రక్షణగోడ ఎప్పుడు నిర్మిస్తారో తెలియదు
తీరంలో 150 మీటర్ల పొడవునా సరుగుడు తోటలుండేవి. అటవీ భూములు అన్యాక్రాంతమవడంతో సరుగుడు తోటలను నరికేశారు. రక్షణ గోడను ఎప్పడు నిర్మిస్తారో కూడా తెలియడం లేదు. సముద్రం ఉధృతి చూశాకైనా ప్రభుత్వం స్పందించాలి. – సోమాని వెంకటరమణ, ఓడలరేవు, అల్లవరం మండలం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top