ఆశయం మంచిదే...ఆచరణ ఏదీ?

School management committees Delayed Government Schools Guntur - Sakshi

నామమాత్రంగా పాఠశాల యాజమాన్య కమిటీల పనితీరు

ప్రభుత్వ బడుల్లో లోపిస్తున్న జవాబుదారీతనం

విద్యావిధానంలో మార్పులు తీసుకువచ్చేందుకు, ప్రభుత్వ పాఠశాలల్లో పనితీరు మెరుగుపర్చేందుకు ప్రభుత్వం విద్యార్థుల తల్లిదండ్రులతో పాఠశాల యాజమాన్య కమిటీలను ఏర్పాటు చేసింది. రాజకీయ నిరుద్యోగులుగా ఉన్న టీడీపీ కార్యకర్తలను కమిటీ చైర్మన్లుగా ఎంపిక చేసి సంబరాలు జరుపుకొన్నారు. పాఠశాల అభివృద్ధి, పనితీరు విద్యాప్రమాణాలు పెంపు, మౌలిక వసతి సదుపాయాలు కల్పనకు కృషి చేయాల్సి ఉన్న కమిటీలు వాటిని గూర్చి ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఆశయం మంచిదే అయినా ఆచరణ శూన్యమని విమర్శలు వినిపిస్తున్నాయి.

మాచవరం(గురజాల):  పాఠశాల అభివృద్ధికి కృషి చేయాల్సిన పాఠశాల యాజమాన్య కమిటీలు ఉనికిని కోల్పోతున్నాయి. ప్రజల భాగస్వామ్యంతో  సమష్టి కృషితో పాఠశాల విద్యను బలోపేతం చేసేందుకు పాఠశాల యాజమాన్య కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అభివృద్ధిలో విద్యార్థుల తల్లిదండ్రులను భాగస్వాములు చేస్తూ  కమిటీలను ఎంపిక చేశారు. కమిటీలను సమన్వయం చేసుకుంటూ సర్వశిక్షా అభియాన్‌ ద్వారా ఆయా పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాల్సి ఉంది. పాఠశాల పనితీరు విద్యాభివృద్ధి  తదితర అంశాలపై చర్చిస్తూ, తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఉంది. కానీ క్షేత్రస్థాయిలో ఎస్‌ఎంసీ కమిటీల పనితీరు ప్రశ్నార్థకంగా మారాయి. జిల్లాలో మొత్తం 4300  పాఠశాలలు ఉన్నాయి.

వాటిలో 1050 ప్రాథమికోన్నత, 3250 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. గతేడాది సుమారు 18.80 లక్షల మంది విద్యార్థులు విభ్యనభ్యసించారు. పాఠశాలల పనితీరును పర్యవేక్షిస్తూ, విద్యాభివృద్ధికి కమిటీ సభ్యులు నిరంతరం తనిఖీలు చేస్తూ విద్యార్థుల ఇబ్బందులను కమిటీ సమావేశంలో చర్చించాలి. అయితే ఎక్కడా అలాంటి సమావేశాలు నిర్వహించిన దాఖలాలు లేవు. మెరుగైన విద్యకోసం తనిఖీలు,అభివృద్ధి పథకాలు, నిధుల ఖర్చులు పలు అంశాలపై కమిటీ సభ్యులకు అవగాహన కలిగిఉండాలి. సిబ్బంది నియామకం, మౌలిక సదుపాయాల కల్పన, వసతులు, మధ్యాహ్న భోజనం, తరగతి గదులు నిర్వహణ, పిల్లల హాజరుశాతం సమగ్ర సమాచారం అందుబాటులో ఉండే విధంగా చూడాలి. ప్రతి నెల మూడో శనివారం విధిగా  సమావేశం నిర్వహించాలి. పాఠశాలల అభివృద్ధికి సంబందించిన అంశాలపై తీర్మానించాలి.

శిక్షణ ఏదీ?
ఎస్‌ఎంసీలను నియమించిన ప్రభుత్వం సభ్యులకు శిక్షణ ఇవ్వడం విస్మరించింది. నేటికీ సభ్యులకు పూర్తి స్థాయి అవగాహన లేదు. సభ్యుల బాధ్యతలు ఎవరికీ తెలియదు. ప్రతి తరగతి నుంచి ముగ్గురు విద్యార్థుల తల్లిదండ్రులను సంరక్షకులుగా ఎన్నుకోవాలి. ప్రతి సమావేశానికి గ్రామ సర్పంచ్, ఎంపీపీ, మున్సిపల్‌ చైర్మన్లు తప్పనిసరిగా హాజరవ్వాలి. కానీ ఎవరూ హాజరు కాకుండానే  సమావేశాలు జరిగినట్టు రికార్డులు చూపించి సరిపెడుతున్నారు.

ప్రయోజనాలు
ఎస్‌ఎంసీ కమిటీ పనితీరు వలన ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య అందుతుంది. ఉపాధ్యాయుల్లోనూ, హెచ్‌ఎంల్లోనూ జవాబుదారీతనం పెరుగుతుంది. నిధుల వినియోగం సక్రమంగా జరుగుతుంది. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ కూడా సక్రమంగా జరుగుతుంది. ఉపాధ్యాయుల పనితీరు మెరుగుపడుతుంది. గ్రామస్తుల్లో ప్రభుత్వ బడుల పట్ల నమ్మకం ఏర్పడుతుంది. హాజరుశాతం పెరుగుతుంది.   

సమావేశాలు నిర్వహించేలాచర్యలు తీసుకుంటాం
అన్ని పాఠశాలల్లో ఈఏడాది తప్పనిసరిగా ఎస్‌ఎంసీ సమావేశాలు  నిర్వహించేలా చర్యలు తీసుకుంటాం. పాఠశాలల స్థితిగతులుపై చర్చించి  వాటి అభివృద్ధికి, పిల్లల విద్యాభివృద్ధికి కృషి చేస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లో  మెరుగైన విద్యను అందించి, హాజరుశాతం పెంచేందుకు కృషి చేస్తాం.–ఎస్‌.గోపాలరావు, ఎంఈవో 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top