సర్పంచ్ రివాల్వర్ మిస్‌ఫైర్ | Sakshi
Sakshi News home page

సర్పంచ్ రివాల్వర్ మిస్‌ఫైర్

Published Fri, May 20 2016 5:15 AM

సర్పంచ్ రివాల్వర్ మిస్‌ఫైర్

గన్‌మన్‌కు  తీవ్ర గాయం
 
బండి ఆత్మకూరు: బోధనం గ్రామ సర్పంచ్ మల్లేశ్వర రెడ్డి రివాల్వర్ మిస్‌ఫైర్ కావడంతో ఆయన వెంట ఉన్న గన్‌మెన్ సుబ్రమణ్యం కాలుకు తీవ్రగాయమైంది. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సాయినాథ్ సంఘటన స్థలానికి చేరుకొని సర్పంచ్‌కు చెందిన రివాల్వర్‌ను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.  2012 అక్టోబర్ 14వ తేదీ రాత్రి ప్రత్యర్థులు జరిపిన దాడిలో సర్పంచ్ మల్లేశ్వర రెడ్డి తృటిలో తప్పించుకోగా అదే గ్రామానికి చెందిన రామేశ్వర్‌రెడ్డి, శివరామిరెడ్డి హతమయ్యారు. ఈ కేసులో ఇదే గ్రామానికి చెందిన ఏడుగురిపై కేసు నమోదైంది. ఈ క్రమంలో ప్రధాన సాక్షిగా ఉన్న మల్లేశ్వర రెడ్డికి ప్రత్యర్థుల నుంచి ముప్పు పొంచి ఉండడంతో తనకు రివాల్వర్ కావాలని పోలీసు ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఆయనకు ప్రభుత్వం రివాల్వర్‌కు అనుమతి ఇచ్చింది.

అంతేగాక 1ప్లస్1 చొప్పున గన్‌మెన్‌లను రక్షణగా కేటాయించింది. గురువారం బోధనం సమీపంలో జరుగుతున్న వంతెన పనులను మల్లేశ్వరరెడ్డి పరిశీలించేందుకు వెళ్లారు. అక్కడ కాసేపు రివాల్వర్‌ను తనవద్దే ఉంచుకొని కూర్చున్నారు. అకస్మాత్తుగా పైకి లేవడంతో రివాల్వర్ కింద పడి మిస్ ఫైర్ అయింది. పక్కనే ఉన్న గన్‌మన్ సుబ్రమణ్యం కాలులోకి బుల్లెట్ చొచ్చుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన ఆయనను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు.

Advertisement
Advertisement