ఇసుక వేట.. అవినీతి మేట

Sand Mafia Using Dredgers In Repalle Guntur - Sakshi

పెనుమూడి రేవులో అక్రమ ఇసుక తవ్వకాలు

అనుమతులు లేకుండా డ్రెడ్జర్ల వినియోగం

రోజుకు మూడు వందలకుపైగా లారీలతో రవాణా

రోజుకు రూ.9 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు దోపిడీ

ఇసుకాసురులు.. అక్రమ సంపాదన కోసం మత్స్యకారులు పోరాడి సాధించుకున్న జీవన భృతినీ వదలడం లేదు. ఇసుక తవ్వకానికి యంత్రమే వద్దన్న చోటికి ఏకంగా డ్రెడ్జర్లు తెచ్చి దోచుకుంటున్నారు. కార్మికులకు రావాల్సిన కూలిని సైతం అడ్డంగా బొక్కేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే అధికారం అండతో అడ్డగోలు బెదిరింపులకు     పాల్పడుతున్నారు. రేపల్లె సమీపంలోని పెనుమూడి రేవులో అడ్డూఅదుపూ లేకుండా అక్రమాలకు తెగబడు తున్నారు. ఇవన్నీ తెలిసినా అధికారుల నోళ్లకు మామూళ్ల తాళాలు వేసుకుని మౌనం వహిస్తున్నారు.

రేపల్లె: ఇసుక రుచి మరిగిన పాలకపక్ష నేతలు సహజ వనరులను యథేచ్ఛగా దోచుకుంటున్నారు. పెనుమూడి రేవులో మత్స్యకారులు చేసుకున్న విన్నపాన్ని కలెక్టర్‌ పరిశీలించి వారి భృతికి అవకాశం కల్పిస్తూ ఇసుకను తరలించుకునేందుకు గత ఏడాది అనుమతి ఇచ్చారు. యంత్రాల సహాయం తీసుకోకుండా ఇసుకను నదిలో తోడుకోవచ్చని చెప్పారు. కలెక్టర్‌ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసేందుకు స్థానిక నేతలు అంగీకరించకపోవటంతో దాదాపుగా 10 నెలలుగా తవ్వకాలు నిలిచిపోయాయి. దీంతో కార్మికులు పోరాటాలు చేయాల్సి వచ్చింది. అనంతరం ఇసుకను తరలించుకునేందుకు స్థానిక రెవెన్యూ అధికారులు ఈ ఏడాది జనవరి నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వటంతో పనులు ప్రారంభమయ్యాయి. మళ్లీ స్థానిక పాలకపక్ష నేతలు రంగంలోకి దిగారు. తమ మాట వినకపోతే రేవును ఆపేస్తామని కార్మికులను బెదిరించి డ్రెడ్జర్ల సాయంతో ఇసుకను తవ్వేస్తున్నారు. రేవు సమీపంలో పెద్ద పెద్ద అగాధాలు పెడుతున్నారు. కొన్ని నెలలుగా రేయింబవళ్లు అక్రమ దందాను కొనసాగిస్తున్నారు.

కూలీల వద్దా దండుకుంటున్న నేతలు  ప్రభుత్వ నిబంధనల ప్రకారం యూనిట్‌కు రూ.400 వసూలు చేయాలి.పడవల నిర్వాహకదారులు ఇసుకను నది మధ్యలో నుంచి యంత్రాల సహాయం లేకుండా తీసుకొచ్చి ట్రాక్టర్‌కు లోడు చేస్తే యూనిట్‌ ఇసుక రూ.400 తీసుకోవాలి. పాలకపక్ష నేతలు మాత్రం ట్రాక్టర్‌ నుంచి సుమారు రూ.500 వరకు వసూలు చేస్తూ కార్మికులకు మాత్రం రూ.400 ఇస్తున్నారు. కొంత కాలంగా రోజుకు సుమారు 250 నుంచి 300 ట్రాక్టర్‌ల వరకు ఇసుక తరలిస్తున్నారు. కార్మికుల కష్టాన్ని రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ప్రతి రోజూ దోచుకుంటున్నారు.

అనుమతులు లేకున్నా డ్రెడ్జర్లు
నదిలో నుంచి ఇసుకను బయటికి తీసుకురావాలంటే యంత్రాలు ఉపయోగించకూడదని కలెక్టర్‌ స్పష్టం చేశారు. కానీ నది గర్భంలో నుంచి ఇసుకను తవ్వేందుకు అధికార పార్టీ నేతలు ఏకంగా డ్రెడ్జర్లను ఉపయోగిస్తున్నారు. దీనికిగాను యూనిట్‌ ఇసుక రూ.600 చొప్పున వసూలు చేస్తున్నారు. రోజుకు సుమారు 1500 నుంచి 2 వేల యూనిట్ల వరకు ఇసుకను తరలిస్తున్నారు. ఇలా రూ.9 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు దండుకుంటున్నారు. నెలకు రూ.3.50 కోట్ల వరకు అక్రమంగా సంపాదిస్తున్నారు.

పట్టించుకోని అధికార గణం
ఇసుక అక్రమ తవ్వకాలపై అధికారులకు తెలిసినా నోరు మెదపడం లేదు. ఆరు నెలలుగా ఈ దందా కొనసాగుతున్నప్పటికీ ఒక్కసారి కూడా దాడులు చేసింది లేదు. అధికారులకూ అక్రమ సంపాదనలో కొంత వాటాలు వెళుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరో వైపు అధికార పార్టీ నేతలకు బెదిరింపులకు తలొగ్గి పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.

 చట్టపరమైన చర్యలు తీసుకుంటాం
పెనుమూడి రేవులో ఇసుకను తరలించుకునేందుకు పడవ నిర్వాహకులకు మాత్రమే అనుమతి ఉంది. ఇసుకను ఒడ్డుకు చేర్చడానికి ఎటువంటి యంత్రాలు ఉపయోగించకూడదు. డ్రెడ్జర్ల సహాయంతో ఇసుకను తోడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ట్రాక్టర్‌కు రూ.400 మాత్రమే వసూలు చేయాలి. అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతాం. ఎస్వీ రమణకుమారి, తహసీల్దార్, రేపల్లె

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top