అధికారం అండగా.. ఇసుక దందా

sand danda in west godavari - Sakshi

కొవ్వూరు: తివిరి ఇసుమున దైలంబు దీయవచ్చు... అని భర్తృహరి తన సుభాషితాల్లో చెప్పినదానికి టీడీపీ నాయకులు కొత్త అర్థం చెప్తున్నారు. తివిరి ఇసుక నుంచి ధనమును తీయవచ్చు అని రుజువు చేస్తున్నారు. ఇసుక ర్యాంపులను టీడీపీ నేతలు తమ అధీనంలో పెట్టుకుని జనాన్ని నిలువు దోపిడీ చేస్తూ రూ. కోట్లు దండుకుంటున్నారు. అడ్డు అదుపు లేకుండా ఇష్టారాజ్యంగా ఇసుకను రెట్టింపు ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ అక్రమ సంపాదనలో కొందరు ఎమ్మెల్యేలకు, మంత్రులకు వాటాలు అందుతున్నట్లు తెలుస్తోంది.

మంత్రుల ఇలాకాలో చుక్కల్లో ఇసుక ధరలు
జిల్లాలో ఇద్దరు మంత్రుల ఇలాకాలో ఇసుక ధరలు చుక్కలనంటాయి. కొవ్వూరులో ఏకంగా యూనిట్‌ రూ. 3 వేలు చొప్పున విక్రయిస్తున్నారు. ప్రస్తుతం కొవ్వూరు, వాడపల్లి, ఔరంగబాద్‌ ర్యాంపులు మూత పడడం, తాడిపూడి ర్యాంపుని చింతలపూడి ఎత్తిపోతల పథకానికి కేటాయించడంతో ఇసుకకి డిమాండ్‌ ఏర్పడింది. ప్రస్తుతం కొవ్వూరు నియోజకవర్గంలో వేగేశ్వరపురం, ప్రక్కిలంక ర్యాంపులు మాత్రమే నడుస్తున్నాయి. రెండు చోట్ల అధికార పార్టీకి చెందిన నాయకులే వీటిని నడుపుతున్నారు. బోట్స్‌మెన్‌ సొసైటీ ముసుగులో అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు ఇక్కడ పడవలు నడుపుతున్నారు. జిల్లా శాండ్‌ మైనింగ్‌ కమిటీ నిర్ణయించిన ప్రకారం యూనిట్‌ ఇసుక లోడింగ్‌తో కలిపి రూ.850కి విక్రయించాల్సి ఉండగా ఇక్కడ ఏకంగా రూ.1,600 వసూలు చేస్తున్నారు. అవకాశాన్ని బట్టి మార్కెట్‌ లారీలSకు అయితే ఏకంగా రూ.2 వేలు వరకు తీసుకుంటున్నారు. రోజుకి 400  యూనిట్లు వరకు ఇసుక సేకరిస్తున్నారు. యూనిట్‌ రూ.100 చొప్పున ఓ ప్రజాప్రతినిధికి ముట్టజెప్పుతున్నట్టు చెబుతున్నారు. మండలానికి చెంది న ఇద్దరు ప్రజా ప్రతినిధుల భర్తలతో పాటు కొందరు టీడీపీ నాయకులు ఈ ర్యాంపులను నడుపుతున్నారు.

కోడేరులోనూ అదే తీరు
ఆచంట మండలం కోడేరు ఇసుక ర్యాంపులో కూడా ఉచిత ఇసుక పేరుతో యథేశ్చగా దోపీడీ సాగుతోంది. యూనిట్‌ ఇసుక రూ.750 చొప్పున అమ్మకాలు చేస్తూ టీడీపీ నేతలు జేబులు నింపుకుంటున్నారు. ఓ మంత్రి అండదండలతో అధికార పార్టీ నేతలు సిండికేట్‌గా ఏర్పడి దోచేస్తున్నారు. వసూలు చేస్తున్న సొమ్ములో కూలీలకు రూ. 400 చెల్లిస్తూ మిగిలిన మొత్తం కొట్టేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకూ ఇక్కడి నుంచి సుమారు 30 వేల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను తరలించేశారు. దాదాపుగా రూ. 30 లక్షల మేర కొల్లగొట్టేసినట్లు సమాచారం. నిబంధనలకు వ్యతిరేకంగా అమ్మకాలు సాగుతున్నా మామూళ్ల మత్తులో అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడటం లేదు. బహిరంగ దోపీడికీ పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

అన్ని ర్యాంపుల్లో అధికార పార్టీ నేతల దోపిడీ
పోలవరం, గుటాల ర్యాంపుల్లో ఓ ఎమ్మెల్యే అనుచరులు చక్రం తిప్పుతున్నారు. గుటాలలో డ్రెడ్జింగ్‌ కూడా చేస్తున్నారు. గతంలో యంత్రాలను సీజ్‌ చేసినప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉంది. పోలవరం మండలానికి చెందిన టీడీపీ నాయకుడు ఇక్కడి వ్యవహారాలు చూసుకుంటున్నారు. యూనిట్‌ రూ.1,500 లకు పైబడి వసూలు చేస్తున్నారు. నిడదవోలు మండలం పందలపర్రు, పెండ్యాల గ్రామాల్లో ఇసుక ర్యాంపులు ఉన్నాయి. యూనిట్‌ ఇసుక లోడ్‌ చేసేందుకు యూనిట్‌కు కూలీలకు రూ.175లు వసూలు చేయాల్సివుండగా స్థానిక టీడీపీ నాయకులు రూ.300 నుంచి రూ.500 వరకు వసూలు చేస్తున్నారు. వాహనాలు వెళ్లేందుకు బాట ఏర్పాటుకు యూనిట్‌కు రూ.100 అదనంగా వసూలు చేశారు. ఫిర్యాదులు రావడంతో సమిశ్రగూడెం పోలీసులు జనవరి 11వ తేదీన పందలపర్రులో ఇసుక ర్యాంపుపై దాడిచేసి నదిలో నుంచి ఇసుక తరలిస్తున్న 16 లారీలు, 10 ట్రాక్టర్లపై చర్యలు తీసుకు న్నారు. దీంతో ఈ రెండు ర్యాంపులు తాత్కాలికంగా మూతపడ్డాయి. పందలపర్రు, పెండ్యాల ర్యాంపులతో పాటు రావివారిపాలెంలో అక్రమంగా ఇసుక తరలించేందుకు టీడీపీ నాయకులు రోడ్లు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఓ ఎమ్మెల్యే సహకారంతో స్ధానిక టీడీపీ నాయకులు ఇక్కడ వ్యవహారాలు చక్కబెడుతున్నారు.

ఎనిమిది ర్యాంపులే నడుస్తున్నాయి
జిల్లాలో అధికారికంగా 18 ర్యాంపులకు అనుమతులుంటే ప్రస్తుతం వీటిలో ఎనిమిది మాత్రమే నడుస్తున్నాయి. తాడిపూడి ర్యాంపుని చింతలపూడి ఎత్తిపోతల పథకానికి కేటాయిస్తే, ఖండవల్లి ర్యాంపును అర్భన్‌ హౌసింగ్, భీమవరం హైవే పనులతో పాటు ఇతర ప్రభుత్వ పనుల కోసం కేటాయించారు. ఖండవల్లి ర్యాంపు కూడా మూతపడి నెలరోజులు కావస్తోంది. అఖండ గోదావరి తీరంలో పోలవరం, గుటాల, ప్రక్కిలంక, వేగేశ్వరపురం ర్యాంపులు నడుస్తున్నాయి. వశిష్ట గోదావరి తీరంలో ఆచంట మండలం కోడేరు, యలమంచిలి మండలంలో చించినాడ, యలమంచిలి లంక, దొడ్డిపట్ల నడుస్తున్నాయి. వాస్తవంగా సముద్ర తీరానికి దగ్గరగా ఉండడంతో కోడేరుతో పాటు యలమంచిలి మండలం ర్యాంపుల్లో ఇసుకలో ఉప్పుశాతం అధికంగా ఉంటుంది. వీటిని శ్లాబులకు వినియోగిస్తే ఐరన్‌ తుప్పుపడుతుంది. అందువల్ల నిర్మాణ పనులకు మాత్రమే వాడతారు.

ఇళ్ల నిర్మాణ వ్యయం పెరిగింది
స్థానికంగా ఉన్న ర్యాంపులు మూతబడటంతో ఇసుక కావాలంటే అక్రమ నిల్వదారులు యూనిట్‌ రూ.1000 వరకు తీసుకుంటున్నారు. దీంతో ఇళ్ల నిర్మాణ వ్యయం బాగా పెరిగింది. ఉచిత ఇసుక అని ప్రభుత్వం ప్రకటించడం తప్ప ఆచరణలో లేదు. పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక కోసమే రూ.50 వేలు పైనే ఖర్చుచేయాల్సి వస్తోంది. పెరిగిన గృహనిర్మాణ సామాగ్రి ధరలతో ఇల్లు కట్టాలంటే భయంగా ఉంది.
– కొండపల్లి శ్రీనివాసరావు, కంసాలిపాలెం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top