‘శాంపిల్స్’ మాఫియా | samples medicines medical shop provideing | Sakshi
Sakshi News home page

‘శాంపిల్స్’ మాఫియా

Apr 23 2014 3:16 AM | Updated on Oct 9 2018 7:52 PM

మందుల సరఫరా, విక్రయాలపై అధికారుల పర్యవేక్షణ కొరవవడంతో జనం జేబులకు చిల్లు పడుతున్నాయి. ఉన్నత స్థాయిలో కొందరు ముఠాగా ఏర్పడి శాంపిల్ మందుల విక్రయాలతో చేతి నిండా సంపాదిస్తున్నారు.

ముత్తుకూరు మండలానికి చెందిన కార్మికుడు వెంకన్న ఒంట్లో నలతగా ఉండడంతో సమీపంలోని ఓ ఆర్‌ఎంపీ వద్దకు వెళ్లాడు. ఆయన రాసిచ్చిన మందుల చీటీతో ఆ ప్రాంతంలోని మెడికల్ షాపుకెళ్లాడు. ఆ మందులు లేవని దుకాణ నిర్వాహకుడు చెప్పడంతో వెంకన్న మళ్లీ ఆర్‌ఎంపీ వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. సరే నేను చెప్పిన షాపుకెళ్లని ఓ అడ్రస్ చెప్పాడు. ఆ షాప్‌కు వెళ్లి చీటీ ఇవ్వగానే సదరు మందులు ఇచ్చి రూ.1,500 వసూలు చేశారు. ఇంటికొచ్చిన తర్వాత తెలిసిన వాళ్లకి ఆ మందులు చూపించగా అన్ని శాంపిల్స్ అని తేలింది. మోసపోయానని తెలుసుకున్నా ఏమీ చేయాలో తెలియక సర్దుకుపోయాడు. ఈ పరిస్థితి వెంకన్న ఒక్కరిదే కాదు. అధికారుల పర్యవేక్షణా లోపం కారణంగా ఇలా జిల్లాలో నిరంతరం ఎందరో మోసపోతున్నారు.
 
 నెల్లూరు(బారకాసు), న్యూస్‌లైన్: మందుల సరఫరా, విక్రయాలపై అధికారుల పర్యవేక్షణ కొరవవడంతో జనం జేబులకు చిల్లు పడుతున్నాయి. ఉన్నత స్థాయిలో కొందరు ముఠాగా ఏర్పడి శాంపిల్ మందుల విక్రయాలతో చేతి నిండా సంపాదిస్తున్నారు. దేశంలో 75 వేలకు పైగా మందుల కంపెనీలు ఉండగా ఆంధ్రప్రదే శ్‌లోనే 150 నుంచి 200 వరకు ఉన్నాయి. హిమాచల్‌ప్రదేశ్ కేంద్రంగా దేశంలోనే అత్యధికంగా సుమారు ఐదు వేల కంపెనీలు నడుస్తున్నాయి. ఆయా కంపెనీలు తమ ఉత్పాద నలను మార్కెటింగ్ కోసం ప్రతినిధుల(మెడికల్ రెప్రజెంటేటివ్స్) ద్వారా డాక్టర్లు, మందుల షాపులకు శాంపిల్స్ పంపుతారు. వీటిని విక్రయించకూడదని సంబంధిత ప్యాకెట్లపై ముద్రించి ఉంటుంది. ఉచితంగా వస్తున్న ఈ మందులను సొమ్ము చేసుకోవాలని కొందరు ముఠాగా ఏర్పడ్డారు. ఆయా కంపెనీల ప్రతినిధుల్లోని కొందరితో డీల్ కుదుర్చుకుని కమీషన్లు సమర్పిస్తూ, భారీఎత్తున శాంపిల్స్ సేకరించారు. వీటిని చెన్నైలోని ఓ రహస్య ప్రదేశంలో నిల్వ చేస్తున్నారు. అనంతరం ఆర్‌ఎంపీ, పీఎంపీలతో కమీషన్ ఒప్పందం కుదుర్చుకుని శాంపిల్స్‌ను రహస్యంగా వారికి చేరవేస్తున్నారు.
 
 కొన్ని చోట్లయితే ఆర్‌ఎంపీలు, పీఎంపీల సహకారంతో ఎంపిక చేసుకున్న మందుల దుకాణాల ద్వారా విక్రయాలు సాగిస్తున్నారు. జిల్లాలో పరిశ్రమలు ఎక్కువగా ఉన్న  కృష్ణపట్నం, మేనకూరు, చిల్లకూరు, సూళ్లూరుపేట, తడ తదితర ప్రాంతాలతో పాటు పల్లెలపై ఆ ముఠా దృష్టిపెట్టింది. పారిశ్రామిక ప్రాంతాలకు ఇతర రాష్ట్రాలకు చెందిన నిరక్షరాస్యులు భారీ సంఖ్యలో వలసవ చ్చి వివిధ పనులు చేసుకుంటున్నారు. వారు పనిచేసి న ప్రదేశాల్లో పరిస్థితులను బట్టి తరచూ అస్వస్థతకు గురవుతుంటారు. పెద్దడాక్టర్ల వద్దకు వెళ్లే స్తోమత లేక సమీపంలోని ఆర్‌ఎంపీలు, పీఎంపీలను ఆశ్రయిస్తున్నారు. వీరిని టార్గెట్ చేసుకున్న శాంపిల్  మందుల మాఫియా తన వ్యాపారాన్ని జోరుగా విస్తరిస్తున్నట్లు సమాచారం
 
 ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తాం:
 శాంపిల్ మందులు ఎక్కడా కూడా విక్రయించకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న మందుల దుకాణాలపై చర్యలు తీసుకున్నాం. జిల్లాలో మా సిబ్బందితో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి శాంపిల్ మందులు విక్రయాలు జరిపే దుకాణాలపై దాడులు నిర్వహిస్తాం.
 శ్రీరామ్మూర్తి, ఏడీ, డ్రగ్ కంట్రోలర్ డిపార్ట్‌మెంట్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement