‘సాక్షి’.. నా ప్రాణం నిలిపింది

Sakshi was given me life

     4 నెలలుగా విధులకు దూరమైన ‘ఉపాధి’ ఈసీ శ్రీనివాసరావు

     ఆత్మహత్యే శరణ్యమంటూ సాక్షిని ఆశ్రయించిన వైనం

     ‘సాక్షి’ కథనంతో దిగివచ్చి ఉద్యోగమిచ్చిన అధికారులు

సాక్షి ప్రతినిధి, విజయనగరం: నాలుగు నెలలుగా విధుల్లోకి తీసుకోకుండా.. జీతం ఇవ్వకుండా వేధింపులకు గురవుతున్న ఉపాధి హామీ పథకం ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్‌(ఈసీ) సీహెచ్‌ శ్రీనివాసరావుకు విజయనగరం అధికారులు ఎట్టకేలకు పోస్టింగ్‌ ఇచ్చారు. తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ శ్రీనివాసరావు ‘సాక్షి’ని ఆశ్రయించారు. దీంతో ‘చావే శరణ్యం’ శీర్షికతో ఈ నెల 15న సాక్షి ప్రధాన సంచికలో కథనం ప్రచురితమైంది. వెంటనే దిగివచ్చిన అధికారులు, నాలుగు నెలల కిందట శ్రీనివాసరావుకు ఎక్కడైతే పోస్టింగ్‌ ఇవ్వకుండా వేధించారో.. అదే కొత్తవలస మండలంలో తిరిగి ఆయన్ని విధుల్లోకి తీసుకున్నారు.

ఈ మేరకు డ్వామా పీడీ కోరాడ రామచంద్రరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ వెంటనే శ్రీనివాసరావు విధుల్లో చేరారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అధికారుల వేధింపులతో అప్పుల పాలై, కుటుంబం గడవడమే కష్టమైన తరుణంలో ‘సాక్షి’ ఆదుకుందని చెప్పారు. ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదనుకున్న తనకు ‘సాక్షి’ ప్రాణం పోసిందని కృతజ్ఞతలు తెలియజేశారు. ఉద్యోగం తిరిగి రావడానికి కారణమైన సాక్షికి జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top