ఆర్టీసీ విలీనం..విలువైన నిర్ణయం..

Rtc Merged In Government - Sakshi

సాక్షి, రాజమహేంద్రవరం సిటీ: ప్రజారంజక పాలనకు.. రాజన్న రాజ్యం స్థాపనకు వస్తున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రోడ్‌ రవాణా సంస్థ కార్మికులకు ఊరట కల్పించేలా చేసిన ప్రకటనతో ఆ వర్గాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. పాలన చేపట్టిన వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానంటూ చేసిన ప్రకటనను యూనియన్లకు అతీతంగా స్వాగతిస్తున్నారు. నిత్యం లక్షలాది మంది ప్రయాణకులను గమ్యస్థానాలను చేర్చే మా జీవితాల్లో వెలుగులు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూస్తున్న ఆర్టీసీ కార్మికుల చిరకాల స్వప్నాన్ని నిజం చేసేందుకు  రానున్న జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన సంక్షేమ కార్యక్రమాలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

తూర్పు గోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, తుని, రాజోలు, రామచంద్రపురం, రావులపాలెం, ఏలేశ్వరం, గోకవరం డిపోలు ఉన్నాయి. వీటిలో 1550 మంది డ్రైవర్లు, 1180 మంది కండక్టర్లతో కలిసి మిగిలిన సిబ్బంది మొత్తం 4300 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. అయితే 1952లో ప్రారంభమైన ఆర్టీసీ నేటి వరకూ అనేక కష్ట నష్టాలతో నెట్టుకువస్తోంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ జీవితాల్లో వెలుగు రావడం లేదని కార్మికులు గగ్గోలు పెడుతున్నారు. పాలకులు ఎందరు మారినా సంస్థను, దాని బాగును విస్మరించిన నేపథ్యంలో పాదయాత్ర సందర్భంగా వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానన్న ప్రకటనను వారు స్వాగతిస్తున్నారు. 

జగన్‌ ఇచ్చిన మాట తప్పరు
ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేది విలీన విధానం. జగన్‌ అధికారంలోనికి వచ్చిన వెంటనే కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారనే నమ్మకం ప్రతీ కార్మికునికి ఉంది. ఏళ్ల తరబడి కార్మికులు విలీనం కోసం డిమాండ్‌ చేస్తూనే ఉన్నారు. ఇన్నాళ్లకు కార్మికుల కల నిజం కానుంది.
–ఎంఎన్‌ రావు, జాయింట్‌ సెక్రటరీ, ఈయూ

ఇక జీవితం బంగారమే..
జగన్‌ పాలనలో ఆర్టీసీ కార్మికుల జీవితం స్వర్ణమయం కానుంది. కార్మికులు నిత్యం పడుతున్న కష్టాలు తీరనున్నాయి. కార్మికుల జీవన విధానంలో మార్పులు రానున్నాయి.
– జి.అప్పారావు,డిపో కార్యదర్శి, ఈయూ

మహిళా సంక్షేమం సాధ్యమౌతుంది
సంస్థలో పనిచేసే ఉద్యోగులు  ప్రభుత్వ ఉద్యోగులుగా మారితే వచ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. మహిళలకు మరింత సంక్షేమ ఫలాలు అందుతాయి జగన్‌ ప్రకటించిన విలీన విధానం ప్రతి కార్మికుడు స్వాగతించాల్సిందే
    – ఆర్‌ఆర్‌ కుమారి, కండక్టర్‌

కార్మికులకు బహుళ ప్రయోజనాలు
విలీనం జరిగితే కార్మికులకు బహుళ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. కార్మికుల డిమాండ్‌ను నెరవేర్చేందుకు జగన్‌ పాలన రానున్నదనే నమ్మకం కనిపిస్తున్నది.
– టీఆర్‌ బాబు, కార్మికుడు

విలీన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
కార్మికులకు ప్రయోజనం కలిగించే అంశం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం. ఇది అందరూ స్వాగతించాల్సిన అంశం. జగన్‌ తీసుకున్న నిర్ణయం ఎందరో కార్మికుల దశాబ్దాల పోరాటం లక్ష్యం. ఎందరో జీవితాలకు భరోసా. 
– ఆర్‌ రాజు, డ్రైవర్‌ 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top