పుష్కర స్నానానికి వెళుతుండగా విషాదం | road accidents in Anantapalli | Sakshi
Sakshi News home page

పుష్కర స్నానానికి వెళుతుండగా విషాదం

Jul 16 2015 1:58 AM | Updated on Aug 30 2018 3:56 PM

పుష్కర పుణ్య స్నానానికి బయలుదేరిన ఆ కుటుంబాన్ని మృత్యువు వెంటాడింది. బస్సు రూపంలో కుటుంబ పెద్దతోపాటు చిన్నారిని కబళించింది.

అనంతపల్లి (నల్లజర్ల రూరల్) : పుష్కర పుణ్య స్నానానికి బయలుదేరిన ఆ కుటుంబాన్ని మృత్యువు వెంటాడింది. బస్సు రూపంలో కుటుంబ పెద్దతోపాటు చిన్నారిని కబళించింది. నలజర్ల మండలం అనంతపల్లిలో ఎర్రకాలువ బ్రిడ్జిపై బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు అక్కడికక్కడే మరణించగా, తల్లీకూతుళ్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వివరాలు ఇవి.. భీమడోలు మండలం సాయన్నపాలెంకు చెందిన గొలుగూరి హరినారాయణ రెడ్డి(32) జట్టు కూలీగా పనిచేస్తూ ప్రస్తుతం పెంటపాడులో నివాసం ఉంటున్నాడు. ఇతనికి భార్య రాధ, మూడేళ్ల వయసు కుమార్తె తులసీలక్ష్మి, కుమారుడు శ్యాంమనోజ్‌రెడ్డి(ఏడాదిన్నర) ఉన్నారు.
 
  పుష్కర సాన్నాలకుగాను బైక్‌పై బుధవారం ఉదయం నలుగురూ కొవ్వూరు బయలుదేరారు. రాధ పుట్టిల్లు దేవరపల్లి మండలం కృష్ణంపాలెం కావటంతో పనిలో పనిగా అక్కడకు వెళ్లొచ్చని నల్లజర్ల మీదుగా వెళుతున్నారు. అనంతపల్లి ఎర్రకాలువ బ్రిడ్జిపైకి చేరుకున్న వీరు ఎదురుగా దూసుకువస్తున్న వాహనాలను చూసి బ్రిడ్జి రెయిలింగ్ పక్కగా ఆగారు. వెనుక వైపు నుంచి దూసుకువచ్చిన  ఏలూరు డిపో బస్సు బైక్‌ను ఢీకొట్టి కొంత దూరం ఈడ్చుకెళ్లిపోయింది. బైక్ కుడి వైపుకు పడటంతో ముందు కూర్చున్న శ్యాం మనోజ్ రెడ్డి(18నెలలు), అతని తండ్రి హరినారాయణరెడ్డి(32) అక్కడికక్కడే మృతి చెందారు. ఎడమ వైపు పడిన రాధ, తులసీలక్ష్మి స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
 
 ఎంత పని చేశావు రామచంద్రా..
 ఎంతపని చేశావు రామచంద్రా.. నీవిచ్చిన బిడ్డను నీచెంతకే తీసుకెళ్లిపోయావా తండ్రీ అంటూ ఆతల్లి రోదన చూపరులనూ కన్నీళ్లు పెట్టించింది. బిడ్డ కళ్ళేదుటే చనిపోవడంతో ఆతల్లి తల్లడిల్లిపోయింది. ఆడపిల్ల పుట్టిన తర్వాత మగ బిడ్డకోసం ఆమె భద్రాచలం నడిచివెళ్ళి శ్రీరామచంద్రుణ్ణి వేడుకున్న తర్వాత కలిగిన శ్యాంమనోజ్‌రెడ్డిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతోంది.  తన కళ్ళేదుటే  భర్త, కొడుకు అసువులు బాయడంతో మీరంతా పోయాక నాకు దిక్కెవరంటూ ఆమె చేస్తున్న రోదనలు మిన్నంటాయి. తల్లడిల్లుతున్న ఆతల్లిని ఓదార్చడం అక్కడివారెవరికీ సాధ్యం కాలేదు.
 
 ప్రమాదంతో ట్రాఫిక్ జాం
 బైక్‌ను ఢీకొట్టిన బస్సు ఎర్రకాలువ బ్రిడ్జిపై అడ్డుగా ఉండటంతో ఏలూరు-కొవ్వూరు(ఈజీకే రోడ్డు) రహదారిలో వెళ్లాల్సిన వాహనాలు ఇరువైపుల నిలిచి పోయాయి. సకాలంలో స్పందించిన గ్రామ యువకులు వాహనాలను  తాడిపూడి అక్విడెక్ట్, పాత రహదారిపై మళ్లించారు. అయినా సుమారు 40 నిమిషాల పాటు ట్రాఫిక్ స్తంభించింది. అనంతపల్లి ఎస్సై రాంబాబు ట్రాఫిక్‌ను నియంత్రించారు. కేసు దర్యాప్తు  చేస్తున్నారు.
 
 సాయన్నపాలెంలో విషాదచాయలు
 భీమడోలు : భీమడోలు మండలం సాయన్నపాలెంకు చెందిన హరినారాయణరెడ్డి(32), అతని కుమారుడు శ్యాంమనోజ్‌రెడ్డి మృతితో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. ప్రమాదవార్త తెలిసిన గ్రామస్తులు ఘటన స్థలమైన అనంతపల్లి వెళ్లారు.  అతని తల్లిదండ్రులు బాపిరెడ్డి, శ్రీలక్ష్మి ఇంటికి వెంటనే తరలి వెళ్లారు.  బాపిరెడ్డి, శ్రీలక్ష్మిల ముగ్గురు సంతానంతో  పెద్దవాడు హరినారాయణరెడ్డి. స్వగ్రామంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉండేవాడు.అతనికి ఐదేళ్ల క్రితం కృష్ణంపాలెంకు చెందిన రాధతో వివాహమైంది. తరువాత సాయంపాలెంలోనే ఉంటూ ఆటో నడిపేవాడు. అది కూడా కుటుంబ పోషణకు సరిపోక పొట్ట చేతపట్టుకుని రెండేళ్ల క్రితం పెంటపాడుకు మకాం మార్చి అక్కడ  జట్టుకూలిగా పని చేస్తున్నాడు. మంచి వ్యక్తిగా పేరుపడ్డ హరినారాయణరెడ్డిని గర్తు చేసుకుంటూ సాయంపాలెం గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యూరు. అతని తల్లిదండ్రుల ఆవేదనకు అంతులేకుండా పోయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement