ఎమ్మెల్యేల క్లబ్‌గా రిట్జ్ హోటల్! | RITZ hotel now ready to as MLA's club! | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేల క్లబ్‌గా రిట్జ్ హోటల్!

Feb 15 2014 12:42 AM | Updated on Oct 30 2018 5:17 PM

ఎమ్మెల్యేల క్లబ్‌గా రిట్జ్ హోటల్! - Sakshi

ఎమ్మెల్యేల క్లబ్‌గా రిట్జ్ హోటల్!

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇక రాజభోగమే. వారి విలాసాల కోసం ప్రత్యేకంగా క్లబ్ నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టనుంది.

సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇక రాజభోగమే. వారి విలాసాల కోసం ప్రత్యేకంగా క్లబ్ నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టనుంది. అదెక్కడో హైదరాబాద్ శివారులో కాదు... ఇటు సచివాలయం, అటు శాసనసభకు కూతవేటు దూరంలోనే. నగరం నడిబొడ్డున సుమారు రూ. 200 కోట్ల విలువైన స్థలంలో ఉన్న రిట్జ్ హోటల్ ఇక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్లబ్‌గా మారనుంది. ఒకపక్క విభజన బిల్లు నేపథ్యంలో రాష్ట్రమంతా ఆందోళనకర పరిస్థితుల్లో ఉండగా, మరోపక్క ప్రజాప్రతినిధులు, మంత్రులు మాత్రం తాము ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపేందుకు ప్రత్యేకంగా క్లబ్‌ను ఏర్పాటు చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. రాష్ట్ర విభజన పూర్తయ్యేలోగా రిట్జ్ హోటల్ స్థలాన్ని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్లబ్‌కు కేటాయించేలా ప్రజాప్రతినిధుల సౌకర్యాలకు సంబంధించిన అసెంబ్లీ కమిటీ ద్వారా ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెచ్చారు.
 
 ఢిల్లీ తరహాలోనే ఇక్కడా ప్రజాప్రతినిధులకు ప్రత్యేకంగా క్లబ్ ఉండాలని ఆ కమిటీ ద్వారా సిఫారసు చేయించినట్లు తెలిసింది. అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా గురువారం సభ్యులు గ్రూపు ఫొటో దిగుతున్న సమయంలో పలువురు ఎమ్మెల్యేలు క్లబ్ సంగతి ఏమి చేశారంటూ మంత్రులను ప్రశ్నించారు. రాష్ట్ర విభజన జరిగేలోపే రిట్జ్ హోటల్ స్థలాన్ని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్లబ్ నిర్మాణానికి కేటాయించాలంటూ ప్రస్తావించారు. దీంతో ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా స్పందించినట్లు సీనియర్ ఎమ్మెల్యే ఒకరు చెప్పారు.
 త్వరలోనే ఉత్తర్వులు: రిట్జ్ హోటల్ ప్రస్తుతం ఐదెకరాల విస్తీర్ణంలో ఉంది. గతంలో ఇది నిజాం నవాబు మొజం ఝూ అధికార నివాసంగా ఉండేది. అనంతరం సిటీ డెవలప్‌మెంట్ బోర్డు కార్యాలయంగా మారింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రిట్జ్ హోటల్ స్థలాన్ని ప్రైవేట్ పరం చేయాలని ప్రయత్నించారు. అయితే తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి దాన్ని పర్యాటక శాఖకు అప్పగించారు. ఇప్పుడు అది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్లబ్‌గా మారనుంది. దీని స్థలం విలువ దాదాపు 200 కోట్ల రూపాయలకు పైమాటేనని ఓ ఎమ్మెల్యే అంచనావేసి చెప్పారు. దీన్ని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్లబ్ నిర్మాణం కోసం కేటాయిస్తూ త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుందని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement