సన్న బియ్యం ధర మరీ లావు !


 చింతలపూడి : మార్కెట్లో బియ్యం ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సాధారణంగా ఉత్పత్తి, డిమాండ్‌ల మధ్య ఉన్న వ్యత్యాసం ఆధారంగా ధరలు నిర్ణయిస్తారు. కాని ఎలాంటి లాజిక్కూ లేకుండా మార్కెట్లో బియ్యం ధరలు పెరిగిపోతున్నాయి. ఓవైపు పండించిన ధాన్యానికి మద్దతు ధర లేదని రైతులు గగ్గోలు పెడుతుంటే, మరోపక్క బియ్యం ధరలు మాత్రం పైపైకి ఎగబాకుతున్నాయి. సోనా మసూరి బియ్యం ధర 25 కిలోల బస్తా నాణ్యతను బట్టి రూ.1,000  నుంచి రూ.1,250కు అమ్ముతున్నారు. పీఎల్ రకం అయితే కిలో రూ.30 నుంచి రూ.35 వరకు పలుకుతోంది. కొద్ది సంవత్సరాలుగా ఒకపక్క ప్రకృతి వైపరీత్యాలు వ రి దిగుబడిని దెబ్బతీయడం, కృష్ణా డెల్టాలో సన్న బియ్యం పండించే రైతులు తగ్గిపోవడంతో ధరలు పెరిగాయి.

 

  అయితే బియ్యం వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించడంతో వీటి పెరుగుదలకు అడ్డూ అదుపూ ఉండడం లేదు. జిల్లాలో ఆకివీడు, పాలకొల్లు, భీమవరం ప్రాంతాల్లో బియ్యం ఎగుమతి చేసే మిల్లులు 300కు పైగా ఉన్నాయి. అయితే జిల్లాలోని ట్రేడింగ్ మిల్లుల పరిస్థితి కూడా దయనీయంగా ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో మిల్లర్ల నుంచి 75 శాతం ఎఫ్‌సీఐ కొనుగోలు చేసేదని, మిగిలిన 25 శాతం ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేవాళ్లమని స్థానిక వ్యాపారి తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం ఐకేపీ ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడంతో మార్కెట్లో ధాన్యం కొనే పరిస్థితి లేదు. దీంతో మెట్ట ప్రాంతంలో మిల్లులు మూతపడే పరిస్థితి వచ్చిందని మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

 మండపేట నుంచి దిగుమతి

 తూర్పుగోదావరి జిల్లా మండపేట నుంచి సన్న బియ్యం రకరకాల బ్రాండ్‌ల లో జిల్లాలోని స్థానిక బియ్యం వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. అక్కడి హోల్ సేల్ వ్యాపారులతో ఒప్పందం చేసుకుని బియ్యం ధరలు విపరీతంగా పెంచి మార్కెట్‌ను శాసిస్తున్నారు. మార్కెట్లో ఈరోజు ఉన్న ధర రేపు ఉండడం లేదు. కర్నూలు రకం సన్న బియ్యం, జీలకర్ర సోనా రకం అంటూ వినియోగదారులను మభ్యపెట్టి అమ్ముతున్నారు. కొన్ని ప్రాంతాల్లో రేషన్ బియ్యం రీ సైక్లింగ్ చేసి సోనా బియ్యంలో కలిపి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలొస్తున్నాయి. ఈ ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులే అంటున్నారు. వర్షాభావం వల్ల ఈ ఏడాది గుంటూరు, కృష్ణా డెల్టాలో రైతులు అనుకున్నంత విస్తీర్ణంలో పంట వేయలేదు. అదీ కాక మెట్ట ప్రాంతంలో రైతులు వరికి ప్రత్యామ్నాయంగా వా ణిజ్య పంటలను సాగు చేస్తుండటంతో ఈ ప్రాంత ప్రజలు బియ్యం కోసం ఇతర జిల్లాలపై ఆధారపడుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం చర్యలు చేపట్టి ధరలను అదుపులోకి తేవాలని మధ్యతరగతి, సామాన్య ప్రజలు కోరుతున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top