
టోక్యో: జపాన్ వ్యవసాయ శాఖ మంత్రి పొరపాటున చేసిన వ్యాఖ్యలు ఆయన రాజీనామాకు దారి తీశాయి. దేశంలో సాంప్రదాయ ఆహారమైన బియ్యం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. అధిక ధరలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలనుద్దేశించి మాట్లాడిన మంత్రి టాకు ఎటో... ఎవరో ఒకరు బియ్యం బహుమతిగా ఇస్తుండటంతో తాను ఇంతవరకూ బియ్యం కొనాల్సిన అవసరం రాలేదని వ్యాఖ్యానించారు.
మంత్రి వ్యాఖ్యలపై ప్రతిపక్షాలతో పాటు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలు బ్రౌన్ రైస్‌కు సంబంధించినవేనని, తాను తెల్లబియ్యం కొంటానని మంత్రి తన వ్యాఖ్యలను సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. అయినా దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. జూలైలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తన వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగిస్తాయని భావించిన మంత్రి బుధవారం రాజీనామా సమర్పించారు. బియ్యం ధరలతో జనం ఇబ్బంది పడుతుంటే అనుచితవ్యాఖ్యలు చేశానని రాజీనామా అనంతరం మంత్రి ఎటో మీడియాతో అన్నారు.