
మెట్టలో విస్తారంగా బొగ్గు నిక్షేపాలు
ఎట్టకేలకు రేచర్ల బ్లాక్‌కు టెండర్ల ప్రక్రియ
నేడు ప్రీబిడ్ సమావేశం
22 కిలోమీటర్ల పరిధిలో 2.225 మిలియన్ టన్నుల నిల్వలు
వచ్చేనెల 27 వరకు టెండర్ల దాఖలుకు గడువు
నవంబర్ నెలాఖరుకు ఈ–ఆక్షన్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు జిల్లా చింతలపూడికి మహర్దశ పట్టనుంది. సుమారు రెండు దశాబ్దాలుగా విస్తృతంగా చర్చల్లో ఉన్న బొగ్గు నిల్వల వ్యవహారం కొలిక్కి వచ్చింది. ఏయే ప్రాంతాల్లో ఏ మేర నిల్వలు ఉన్నాయనే గుర్తింపులు పూర్తి చేసి వేలం దశకు కేంద్రం తీసుకువచ్చింది. దీనిలో భాగంగా జిల్లాలో మొదటిగా చింతలపూడి మండలం రేచర్ల బొగ్గు బ్లాక్‌కు టెండర్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. సోమవారం ప్రీబిడ్ సమావేశం నిర్వహించి వచ్చే నెల 27 వరకు టెండర్లు తీసుకునేలా కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
గ్రేడ్–1 నిల్వలు
జిల్లాలోని మెట్ట ప్రాంతమైన చింతలపూడి నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో అపార బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. అది కూడా గ్రేడ్–1 నిల్వలు ఉన్నట్టు అధికారికంగా నిర్ధారించారు. 1964 నుంచి 2004 వరకు కేంద్ర ప్రభుత్వం నాలుగు దఫాలుగా రకరకాల సర్వేలు నిర్వహించింది. మళ్లీ 2006 నుంచి 2016 వరకు సర్వే ప్రక్రియ అత్యంత వేగంగా కొనసాగింది. ప్రధానంగా ఏలూరు, ఖమ్మం జిల్లాల సరిహద్దులో 2,500 చదరపు కిలోమీటర్ల పరిధిలో అపార నల్ల బంగారం నిక్షేపాలున్నట్టు గుర్తించింది.
గతంలో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ దీనిపై కేంద్రానికి కూడా నివేదిక పంపింది. ఈ పరిణామాల క్రమంలో చింతలపూడి, టి.నర్సాపురం, జంగారెడ్డిగూడెం మండలాల్లో కొన్ని గ్రామాల్లో గ్రేడ్–1 బొగ్గు భూగర్భంలో ఉన్నట్టు గుర్తించారు. గతంలో చింతలపూడి మండలంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ) నిపుణుల బృందం సర్వే నిర్వహించింది. లక్నోకు చెందిన బీర్బల్ సహాని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలియోబొటానీ అనే సంస్థ 2013లో ఉభయగోదావరి, కృష్ణా, ఖమ్మం జిల్లాల్లో సర్వే చేసింది.
ప్రధానంగా గోదావరి పరీవాహక ప్రాంతంలోని చింతలపూడి, ముసునూరు మండలాల్లో సర్వే నిర్వహించింది. గతేడాది కేంద్రానికి నివేదిక సమర్పించి బొగ్గు ఉన్న ప్రాంతాలను బ్లాక్‌లుగా విభజించి వేలం ప్రక్రియకు శ్రీకారం చుట్టేలా చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చిలో దేశవ్యాప్తంగా 80 గనుల వేలానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. చింతలపూడి బ్లాక్‌ను వేలం జాబితాలో ఉంచినా సింగరేణి సహా ప్రధాన కంపెనీలు పోటీకి రాకపోవడంతో వేలం వాయిదా పడింది.
ఈ నేపథ్యంలో గత వారంలో లాంఛనాలు పూర్తి చేసి టెండర్‌కు సన్నద్ధమయ్యారు. దీనిలో జిల్లాలోని చింతలపూడి మండలం రేచర్ల బొగ్గు బ్లాక్‌తో పాటు దేశవ్యాప్తంగా మరో 13 బ్లాక్‌లకు కలిపి టెండర్లకు ఆహ్వానించారు. 22.24 చదరపు కిలోమీటర్ల పరిధిలో రేచర్ల కేంద్రీకృతంగా యర్రగుంటపల్లి, సీతానగరం, మేడిశెట్టివారిపాలెం, లింగగూడెం, రాఘవాపురం తదితర గ్రామాల్లో బొగ్గు నిల్వలను నిర్ధారించారు.
2.225 మిలియన్ టన్నులే
ఆంధ్రా–తెలంగాణ సరిహద్దు సమీపంలో ఉన్న రేచర్ల బొగ్గు బ్లాక్ పరిధి 22.24 చదరపు కిలోమీటర్లు. ఇక్కడ జీ–13 గ్రేడ్ బొగ్గు లభిస్తుందని, 623 మీటర్ల లోతు నుంచి గరిష్టంగా 1,123 మీటర్ల లోతులో నిల్వలు ఉన్నాయని, 2,225.63 మిలియన్ టన్నుల నిల్వలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని అంచనా వేసి టెండర్లను ఆహ్వానించారు. సోమవారం ప్రీబిడ్ సమావేశం నిర్వహించి వచ్చే నెల 27 వరకు టెండర్ దాఖలుకు తుది గడువుగా ప్రకటించారు. 28న టెక్నికల్ బిడ్‌లు తెరిచి నవంబర్ చివరి వారంలో ఈ–వేలం ద్వారా బొగ్గు గనిని కేటాయించనున్నారు.