మడకశిరలో రెవెన్యూ అధికారుల ప్రతి చర్యను నిరసిస్తూ విద్యుత్ ఉద్యోగులు ఆదివారం ధర్నా చేశారు.
మడకశిర రూరల్, న్యూస్‌లైన్ : మడకశిరలో రెవెన్యూ అధికారుల ప్రతి చర్యను నిరసిస్తూ విద్యుత్ ఉద్యోగులు ఆదివారం ధర్నా చేశారు. బకాయిలు చెల్లించలేదని ట్రాన్‌సకో అధికారులు తహశీల్దార్ కార్యాలయానికి విద్యుత్ కనెక్షన్ తొలగించారు. దీనికి ప్రతి చర్యగా ట్రాన్‌సకో ఏడీఈ కార్యాలయం రెవెన్యూ స్థలంలో ఉందని, ఇందులోకి ఎవరూ ప్రవేశించరాదని రెవెన్యూ అధికారులు శనివారం రాత్రి నోటీసు అతికించి సీజ్ చేసిన విషయం విదితమే.
రెవెన్యూ అధికారుల తీరుకు నిరసనగా ట్రాన్‌సకో ఉద్యోగులు ఏడీఈ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. కార్యాలయ సీజ్ గురించి డీఈ నాగేంద్రకుమార్, ఏడీ నరహరి, ఏఈ రామాంజినేయులు ఎమ్మెల్యే సుధాకర్ దృష్టికి తీసుకెళ్లారు. కార్యాలయ తలుపులు తెరిచే వరకు ధర్నా మిరమించబోమని డీఈ హెచ్చరించారు. దీంతో రెవెన్యూ అధికారులు దిగివచ్చి కార్యాలయం తలుపులు తెరవడంతో ఉద్యోగులు విధులకు హాజరయ్యారు. అనంతరం స్థానిక విశ్రాంతి భవనానికి, తహశీల్దార్ కార్యాలయానికి ట్రాన్‌సకో అధికారులు విద్యుత్ సరఫరా చేశారు.