స్నేహితురాలిని కాపాడబోయి యువతి మృతి

To rescue the friend..she died - Sakshi

పట్టిసీమ వద్ద గోదావరిలో ఘటన

పోలవరం: గోదావరిలో ప్రమాదవశాత్తు పడి మునిగిపోతున్న స్నేహితురాలిని కాపాడబోయి ఓ యువతి మరణించింది. కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామానికి చెందిన ర్యాలి సాయిరమ్య(18) గూటాల పంచాయతీ కొత్తపట్టిసీమ గ్రామం వద్ద ఆదివారం గోదావరిలో మునిగిపోయి మరణించింది. కొవ్వూరులోని ఏబీఎన్‌పీఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న రమ్య స్నేహితులతో కలసి కొత్తపట్టిసీమలోని మరో స్నేహితురాలైన వలవల శ్రీవల్లి ఇంటికి శనివారం సాయంత్రం వచ్చింది. పోలవరం ప్రాజెక్టు చూడాలని రాత్రి వారంతా అక్కడే ఉన్నారు. ఆదివారం ఉదయం స్నేహితులైన శ్రీవల్లి, ఊనగట్లకు చెందిన గూడపాటి సాయిభవాని, కొవ్వూరుకు చెందిన ప్రత్యూషలతో కలిసి గోదావరినదికి స్నానానికి వెళ్లింది.

నది ఒడ్డున నిలబడి సెల్ఫీలు తీసుకుంటుండగా, సాయిభవాని తలపై నీళ్లు చల్లుకునేందుకు నదిలోకి వంగింది. ఆమె నిలబడిన రాళ్లు నాచుపట్టి ఉండటంతో నదిలోకి జారిపడింది. ఆమెను కాపాడేందుకు సాయిరమ్య ప్రయత్నించగా, ఇద్దరూ నదిలో మునిగిపోయారు. కేకలు వేయటంతో దగ్గరలో ఉన్న యువకులు వచ్చి సాయిభవానీని కాపాడారు. ఈమె పోలవరం వైద్యశాలలో చికిత్స పొందుతూ కోలుకుంది. సాయిరమ్య మృతి చెందింది. పోలవరం ఎస్సై కె.శ్రీహరిరావు స్బిబందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
దొమ్మేరులో విషాదఛాయలు

కొవ్వూరులో విషాదఛాయలు
 సాయిరమ్య మృతితో ఆమె స్వగ్రామం దొమ్మేరులో విషాదఛాయలు అలముకున్నాయి. ర్యాలి శ్రీనివాసరావు ప్రథమ కుమార్తె ఆమె. అపురూపంగా చూసుకునే రమ్య మృతితో కుటుంబ సభ్యుల వేదన వర్ణనాతీతంగా ఉంది. సర్పంచ్‌ ముదునూరి జ్ఞానేశ్వరి, వైఎస్సార్‌సీపీ నాయకుడు ముదునూరి నాగరాజు సాయిరమ్య కుటుంబ సభ్యులను ఓదార్చారు.   ఎంతో భవిష్యత్తు ఉన్న సాయిరమ్య మృతి ఆ కుటుంబానికి తీరని లోటని నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top