పులివెందుల ప్రాంతంలో గ్రామీణ విద్య అంతంత మాత్రమే ఉండగా.. ప్రభుత్వానికి సంబంధించిన కళాశాలలు పెద్దగా లేని పరిస్థితి. పైగా గతంలో ప్రభుత్వాలు వైఎస్‌ఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంపై వివక్ష చూపుతూ వచ్చాయి.
పులివెందుల, న్యూస్‌లైన్ : పులివెందుల ప్రాంతంలో గ్రామీణ విద్య అంతంత మాత్రమే ఉండగా.. ప్రభుత్వానికి సంబంధించిన కళాశాలలు పెద్దగా లేని పరిస్థితి. పైగా గతంలో ప్రభుత్వాలు వైఎస్‌ఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంపై వివక్ష చూపుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి బాధ్యతలు స్వీకరించాక పులివెందుల స్వరూపమే మారిపోయిందనే అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని సాంకేతిక విద్యను అందించాలన్న మహోన్నత లక్ష్యంతో 2006లో ఇంజినీరింగ్ కళాశాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
రూ.100కోట్లతో.. 185ఎకరాల్లో...
పులివెందుల పట్టణంలోని ముద్దనూరు రోడ్డులో దాదాపు 185ఎకరాల విస్తీర్ణంలో రూ.100కోట్ల వ్యయంతో 5 అకడమిక్ బ్లాక్‌లు, ఒక అడ్మినిస్ట్రేషన్, లైబ్రరీ, స్టాఫ్ క్వార్టర్స్, గెస్ట్‌హౌస్, బాల, బాలికల హాస్టళ్లను నిర్మించారు. కళాశాల ఏర్పడిన అనతి కాలంలోనే అనంతపురం జేఎన్‌టీయూ పరిధితోపాటు రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కళాశాలలో ప్రస్తుతం బీటెక్, ఎంటెక్‌లలో ట్రిపుల్‌ఈ, సీఎస్, మెకానికల్, సివిల్, బయో టెక్నాలజీ, ఈసీఈ కోర్సులలో దాదాపు 1650మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇటీవల కాలంలోనే కళాశాలకు స్వయంప్రతిపత్తిని జెఎన్‌టీయూ అనంతపురం అధికారులు ఇచ్చారు.
కళాశాలలో వసతులకు టెక్విప్ నిధులు :
జేఎన్‌టీయూ కళాశాలలో మౌలిక సదుపాయాల కోసం 2012-13లో టెక్విప్ కింద రూ.10కోట్ల నిధులు విడుదలయ్యాయి. కళాశాలలో ఇంటర్నెట్, సోలార్ లైట్లు, డిజిటల్ లైబ్రరీ, ఈ క్లాస్ తరగతులకు సంబంధించి పనులు చురుగ్గా సాగుతున్నాయి. దీంతోపాటు అధ్యాపకులకు ఎప్పటికప్పుడు తర్ఫీ దు ఇచ్చేలా ఐఐటీ ప్రొఫెసర్లచే ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అదేవిధంగా 2013 డిసెంబర్‌లో కేంద్రమానవ వనరుల మంత్రిత్వ శాఖ క్యూట్రిపుల్‌ఈ కింద కళాశాలను ఎంపిక చేశారు. దీంతో కళాశాలలో ఆన్‌లైన్ ద్వారా ఢిల్లీ, చెన్నైలకు చెందిన ఐఐటీ సీనియర్ ప్రొఫెసర్లచే విద్యా బోధన చేస్తున్నారు.
ఈ ఘనత వైఎస్‌ఆర్‌దే
పేదరికంలో మగ్గుతున్న విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని జేఎన్‌టీయూ కళాశాలను పులివెందులకు తీసుకొచ్చిన ఘనత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుంది. రాజకీయాల్లో ఉన్ననాళ్లూ ప్రజల కష్టసుఖాల గురించి తెలుసుకున్న వైఎస్‌ఆర్ పులివెందుల ప్రజల రుణం తీర్చుకోవడంలో భాగంగా జేఎన్‌టీయూ నెలకొల్పారు.
- దేవిరెడ్డి కృష్ణారెడ్డి (స్థానికుడు), పులివెందుల
సౌకర్యాలు భేష్
పులివెందులలోని జేఎన్‌టీయూ కళాశాలలో మౌలిక వసతులు అద్భుతంగా ఉన్నా యి. ఇక్కడ వాతావరణంతోపాటు విద్యార్థులు చదువుకోవడానికి అనువైన సౌకర్యాలు చాలా బాగున్నాయి. ఇప్పటికే వేలాది మంది విద్యార్థులు ఇక్కడ చదువుకొని ఉద్యోగాలు సాధించుకున్నారు.
- అనూష
(జేఎన్‌టీయూ
విద్యార్థిని), పులివెందుల