ధర వెలవెల! రైతు విలవిల

Reduced Prices For Banana Cultivation - Sakshi

పతనమైన అరటి ధరలు

గత నెలలో టన్ను రూ.17 వేలు

ప్రస్తుతం టన్ను రూ.9 వేల నుంచి రూ.12వేలే

రవాణా చార్జీలు కూడా రాకపోవడంతో దిగాలు

ధరలేక యార్డులోనే గెలలు వదిలివెళ్తున్న వైనం

ఉత్తరాదిలో చలి తీవ్రతతో ఎగుమతులు తగ్గుముఖం

సాక్షి, అమరావతి: పేదోడి పండుగా పిలిచే అరటికి ఇప్పుడు గడ్డురోజులు వచ్చాయి. గిట్టుబాటు ధరలేక దానిని సాగు చేస్తున్న రైతులు విలవిల్లాడుతున్నారు. నెల కిందట రూ.17 వేలు పలికిన టన్ను కాయలు ప్రస్తుతం రూ.12 వేలకు పడిపోవడమే కారణం. కొన్ని ప్రాంతాలలో గెలకు రూ.50 కూడా రాకపోవడంతో మార్కెట్‌ యార్డుల్లోనే వాటిని వదిలేస్తున్న దుస్థితి నెలకొంది. గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతంలో అయితే కాయ కోయడం కూడా వృధా అని రైతులు వదిలేస్తున్నారు. శుభకార్యాలు లేకపోవడం, వాతావరణంలో వచ్చిన మార్పులు, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లోనూ అరటిసాగు పెరగడం, బెంగాల్‌ నుంచి ఒడిశాకు అధిక మొత్తంలో దిగుమతులు పెరగడం ధరలు పడిపోవడానికి కారణంగా చెబుతున్నారు.

అరటి సాగులో ఏపీది 4వ స్థానం
దేశంలో అధికంగా అరటి సాగుచేసే రాష్ట్రాల్లో ఏపీది నాలుగో స్థానం. ఇక్కడ సుమారు 1,12,995 హెక్టార్లలో సాగవుతోంది. అరటి సాగుచేసే జిల్లాల్లో 35,620 హెక్టార్లతో వైఎస్సార్‌ కడప అగ్రస్థానంలో ఉంది. ఇక రాష్ట్రం నుంచి ఏటా 63,84,730 టన్నుల అరటి దిగుబడి వస్తుందని అంచనా. కాగా, మన రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్లయిన రావులపాలెం, రాజంపేట, పులివెందుల, అనంతపురం, తెనాలి వంటి కేంద్రాల నుంచి బెంగళూరు, చెన్నై, కోల్‌కత, ఢిల్లీ, ఉత్తరాది రాష్ట్రాల మార్కెట్లకు అరటి ఎగుమతి అవుతుంది.

 మార్కెట్లలో పరిస్థితి ఎలా ఉందంటే..
అనంతపురం జిల్లాలో ప్రస్తుతం 16,400 హెక్టార్లలో అరటి సాగవుతోంది. హెక్టార్‌కు 62 టన్నులకు పైగా దిగుబడి వస్తోంది. నెల కిందట మేలి రకం అరటి టన్ను రూ.17వేలు పలికింది. ఇప్పుడది రూ.13 వేలకు, రూ.12 వేలు పలికిన రెండో రకం ఇప్పుడు రూ.9 వేలకు పడిపోయింది. పులివెందులలో టన్ను ధర రూ.11, రూ.12 వేల మధ్య ఉంది. ఎగుమతులు తగ్గడానికి చలి తీవ్రతే  కారణంగా చెబుతున్నారు. ఇక.. తెనాలి మార్కెట్‌లో పెద్ద గెల (పది అత్తాలు) రూ.50 నుంచి రూ.60 మధ్య ఉంది. చిన్న గెలయితే కేవలం రూ.25, మరీ చిన్నదైతే రూ.15లకు అమ్ముడవుతున్నాయి. కానీ, విడిగా అయితే డజను కాయలు సైజును బట్టి మార్కెట్లో రూ.30, రూ.50 పలుకుతున్నాయి.

రావులపాలెం మార్కెట్‌లో ఇలా..
ఇదిలా ఉంటే.. ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో సుమారు 32,418 హెక్టార్లలో అరటి సాగవుతోంది. ఇక్కడి రావులపాలెం అరటి మార్కెట్‌ యార్డులో కూడా అరటి ధరలు దారుణంగా పతనమయ్యాయి. ముహూర్తాలు, శుభకార్యాలు లేకపోవడం, కర్పూర రకం అధికంగా సాగు చేయడంతో ధరలు తగ్గాయి. దీనికి తోడు విజయనగరం జిల్లా సాలూరు, పార్వతీపురం తదితర ప్రాంతాల్లో ప్రస్తుతం అరటి పంట అందివచ్చింది. సీజన్‌లో ఈ యార్డుకు రోజుకు 35–40 వేల గెలలు వచ్చేవి. తమిళనాడు, ఒడిశా, బీహార్, తదితర రాష్ట్రాలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సుమారు 40 లారీల సరుకు రవాణా అయ్యేది. కానీ, ప్రస్తుతం అది 20–25 లారీలకు పడిపోయింది. దీంతో కొనుగోళ్లు లేక రైతులు తాము తెచ్చిన గెలలను యార్డులోనే వదిలి వెళ్లాల్సిన దయనీయ స్థితి నెలకొంది. రూ.150 కూలీ చెల్లించి తీసుకువచ్చిన ఆరు గెలలకు (లోడు) రూ. 200 కూడా ధర పలకక రైతులు తీరని నష్టాలు ఎదుర్కొంటున్నారని అరటి వ్యాపారి కోనాల చంద్రశేఖరరెడ్డి అంటున్నారు.

ప్రభుత్వం ఆదుకోవాలి
మాది అనంతపురం జిల్లా పుట్లూరు మండలం ఎల్లుట్ల. నాలుగు ఎకరాల్లో అరటి సాగు చేస్తున్నా. కాయ బాగా వచ్చిన తర్వాత ధర లేదు. టన్నుకు కనీసం రూ.15 వేలు అయినా ఉంటే తప్ప గిట్టుబాటు కాదు. కానీ, రూ.13 వేలు కూడా రావడంలేదు. పోయిన నెలలో రూ.17 వేలకు అమ్మాం. ధరల స్థిరీకరణ నిధితో ప్రభుత్వం ఆదుకుంటే బాగుంటుంది.
– టి. నారాయణస్వామి,అరటి రైతు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top