త్వరలో జీవీఎంసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జిల్లా అధికారులు సర్వసన్నద్ధంగా ఉండాలని జిల్లా ఓటర్ల జాబితా సవరణ పరిశీలకుడు, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి ఆదేశించారు.
* ఓటర్ల నమోదుకు ఆధార్ తప్పనిసరి
* జనవరి 16న కొత్త ఓటర్ల జాబితా ప్రకటన
* జిల్లా ఓటర్ల జాబితా సవరణ పరిశీలకుడు డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి
సాక్షి, విశాఖపట్నం: త్వరలో జీవీఎంసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జిల్లా అధికారులు సర్వసన్నద్ధంగా ఉండాలని జిల్లా ఓటర్ల జాబితా సవరణ పరిశీలకుడు, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి ఆదేశించారు. ఆదివారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఉన్నతాధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఈఆర్‌వోలతో ఓటర్ల జాబితా సవరణపై చర్చించారు. ఆయన మాట్లాడుతూ జీవీఎంసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్ల జాబితా సిద్ధం చేసుకోవాలన్నారు. వచ్చే ఏడాది జనవరి 16న ఓటర్ల జాబితా ప్రకటించనున్నందున నగర పరిధిలో వచ్చే ఏడాది జనవరి ఒకటి నాటికి 18ఏళ్లు నిండిన యువతీ, యువకులు ఓటర్ల జాబితాలో ఉండేలా చూడాలన్నారు.
నకిలీ ఓటర్లు, డూప్లికేషన్ నివారించేందుకు ఆధార్‌తో అనుసంధానం తప్పనిసరి చేయాలంటూ పలు పార్టీల ప్రతినిధులు సూచించగా, ఈ విషయాన్ని భారత ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామన్నారు. వారి నిర్ణయం మేరకు తగు చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్ ఎన్.యువరాజ్ మాట్లాడుతూ నవంబర్ 13 నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు క్లైమ్‌లు, అభ్యంతరాలను తీసుకుంటున్నామన్నారు. నవంబర్ 16, 23, 30, డిసెంబర్ 7, 13,14 తేదీల్లో రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్ల సమన్వయంతో ప్రత్యేక క్యాంపైన్లు నిర్వహిస్తున్నామన్నారు.
ఈ నెల 28లోపు వీటిని పరిశీలించి జాబితాలో మార్పులు, చేర్పులు చేస్తామన్నారు. ఓటర్ల గుర్తింపు కార్డులో ఆధార్ సంఖ్యను నమోదు చేస్తున్నామన్నారు. ఇన్‌చార్జి కమిషనర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ జీవీఎంసీ పరిధిలో తగినన్ని పోలింగ్ స్టేషన్లను ఉన్నాయని, అవసరమైతే మరికొన్ని ఏర్పాటు చేస్తామన్నారు. టీడీపీ నాయకుడు సత్యనారాయణ మాట్లాడుతూ సుమారు 2.50 లక్షల నకిలీ కార్డులున్నట్టుగా ఆరోపణలున్నాయని, వాటి తొలగింపుపై ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.
వైఎస్సార్‌సీపీ నాయకుడు పక్కి దివాకర్ మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణలో ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించాలన్నారు. పోలింగ్ స్టేషన్ల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఎస్.సుధాకర్ సూచించారు. బీజేపీ, సీపీఐ, బీఎస్పీ నాయకులు బి.ఎస్.నాయుడు, డి.మార్కండేయులు, జార్జి బంగారి తదితరులు పలు సూచనలు చేశారు. ఏజేసీ డి.వి.రెడ్డి, డీఆర్‌వో కె.నాగేశ్వరరావు పాల్గొన్నారు.