జిల్లాలోని కొందరు రాజకీయ నేతలు ‘రాయల తెలంగాణ’ ప్రతిపాదన తీసుకురావడం ఓ మూర్ఖపు ఆలోచన అని సమైక్యాంధ్ర సంయుక్త జేఏసీ జిల్లా కన్వీనర్ కొత్త విశ్వనాథరెడ్డి మండిపడ్డారు.
అనంతపురం రూరల్, న్యూస్‌లైన్ : జిల్లాలోని కొందరు రాజకీయ నేతలు ‘రాయల తెలంగాణ’ ప్రతిపాదన తీసుకురావడం ఓ మూర్ఖపు ఆలోచన అని సమైక్యాంధ్ర సంయుక్త జేఏసీ జిల్లా కన్వీనర్ కొత్త విశ్వనాథరెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన నగర ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. జిల్లా ప్రజలందరూ సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటుంటే ‘రాయల తెలంగాణ’ను ఎందుకు కోరుతున్నారో జేసీ దివాకర్‌రెడ్డితోపాటు డీసీసీ అధ్యక్షుడు కొట్రికె మధుసూదన్‌గుప్తా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గతంలో జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీ, స్పిన్నింగ్ మిల్, ఆల్విన్ వాచ్ కంపెనీ తదితర ఎన్నో ఫ్యాక్టరీలు మూత పడినప్పుడు మీరేం చేస్తున్నారో చెప్పాలన్నారు. శాసనసభకు తెలంగాణ బిల్లుకు వచ్చినప్పుడు ఎటువైపు మొగ్గుచూపుతారో ప్రజలకు తెలియజేయాలన్నారు. న్యాయవాదుల జేఏసీ నాయకులు రాంప్రసాద్ మాట్లాడుతూ జిల్లాకు 32 టీఎంసీలు నికర జలాలు రావాల్సి ఉండగా కనీసం 14 టీఎంసీలను కూడా అందుబాటులోకి తీసుకురాకపోవడంలో పాలకులు పూర్తిగా విఫలమౌతున్నారన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం విడిపోతే మరింత నష్టపోతామన్నారు. విద్యుత్ జేఏసీ జిల్లా నాయకులు రామకృష్ణ మాట్లాడుతూ భౌగోళిక పరిస్థితులను పరిశీలిస్తే శ్రీశైలంతో పాటు పీఏబీఆర్, సుంకేసుల ప్రాజెక్ట్‌లలో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తే అంది తెలంగాణకు అనుకూలంగా ఉంటుందన్నారు. రాయల తెలంగాణ అంశం కేవలం తెలంగాణవారికే ఎక్కువ లాభం చేకూరుతుందన్నారు. రాయల తెలంగాణ అంశాన్ని రాజకీయ నాయకులు వారి పదవుల కోసం, ఆస్తుల కోసమే అడుగుతున్నారని, ఇందులో ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. కార్యక్రమంలో రెవెన్యూ జేఏసీ నాయకులు జయరామప్ప, వాణిజ్యపన్నులశాఖ జేఏసీ నాయకులు సుభాష్, యూత్ జేఏసీ నాయకులు మల్లిరెడ్డి పాల్గొన్నారు.