సర్దుబాటు అంటే సమరమే.. | Rayala Telangana not acceptable: Harish Rao | Sakshi
Sakshi News home page

సర్దుబాటు అంటే సమరమే..

Dec 3 2013 4:22 AM | Updated on Mar 18 2019 9:02 PM

ఆంక్షలు లేని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఓ వైపు ప్రజలు ఉద్యమాలు చేస్తుంటే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సర్దుబాటు చేసుకోవాలనడం ఎంతవరకు సమంజసమని టీఆర్‌ఎస్‌ఎల్‌పీ

జెడ్పీసెంటర్, న్యూస్‌లైన్: ఆంక్షలు లేని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఓ వైపు ప్రజలు ఉద్యమాలు చేస్తుంటే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సర్దుబాటు చేసుకోవాలనడం ఎంతవరకు సమంజసమని టీఆర్‌ఎస్‌ఎల్‌పీ ఉపనేత తన్నీరు హరీష్‌రావు అన్నారు. సర్దుబాటు చేసుకోవడం కాంగ్రెస్ నాయకులకు అలవాటని, తెలంగాణ ప్రజలు మి మ్మల్ని వచ్చే ఎన్నికల్లో సర్దిపెట్టడం ఖాయమని హెచ్చరించారు. ఆంక్షలు లేని హైదరాబాద్, భద్రాచలం, మునగాలతో పది జిల్లాల తెలంగాణ సాధించుకుంటామన్నారు. టీఆర్‌ఎసీవీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక జెడ్పీ మైదానంలో పాలమూర్ విద్యార్థి పోరుగర్జన బహిరంగ సభను నిర్వహించారు.
 
 ముఖ్యఅతిథిగా హాజ రైన హరీష్‌రావు మాట్లాడుతూ.. ఆర్డీఎస్ తూములను బాంబులతో బద్దలుకొట్టిన సీమ నాయకులను తెలంగాణలో ఎలా కలుపుకుంటామన్నారు. ప్రత్యేకరాష్ట్రం ఏర్పడితే నీటి దోపిడీకి తావుండదనే రాయల తెలంగాణ అంటున్నారని విమర్శించారు. ఈ మోసాలను పసిగట్టకుండా టి.కాంగ్రెస్ నాయకులు సర్దుకుపోవాలంటే విద్యార్థులు వారిపై పోరాటం చేస్తారని హెచ్చరించారు. రాయల తెలంగాణ అంటే వెనకబడిన పాలమూరు జిల్లా తీవ్రంగా నష్టపోతుందన్నారు. సీఎం కిరణ్ సొంత జిల్లా చిత్తూకు రూ.ఏడువేల కోట్లు దోచిపెడుతుంటే ఎందుకు ప్రశ్నించడం లేదని తెలంగాణ మంత్రులను హరీష్‌రావు ప్రశ్నించారు. సీఎంకు మద్దతు తెలిపితే తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు.   
 
 కేసీఆర్ దీక్ష ఫలితంగానే తెలంగాణ
 కేసీఆర్ ఆమరణదీక్ష ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని టి.హరీష్‌రావు చెప్పారు. 1200 మంది బలిదానాలు చేసింది 13 ఏళ్ల పోరాటం చేసింది ఆంక్షల తెలంగాణ కోసం కాదన్నారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలోని నాలుగు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే తెలంగాణ పది జిల్లాల్లో కేవలం రెండు కాలేజీలు ఉన్నాయన్నారు. తెలంగాణ సమాజం కలలు గన్న తెలంగాణ రాష్ట్రం రావాలంటే టీఆర్‌ఎస్‌ను బలపర్చాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తెలంగాణ పునర్‌నిర్మాణంపై టీఆర్‌ఎస్‌కు ఉన్న చిత్తశుద్ధి కాంగ్రెస్, టీడీపీలకు లేదన్నారు. ఈ ప్రాంతం దోపిడీకి గురికావడానికి వారే కారకులన్నారు. ఇక్కడి విద్యార్థులు, యువతకు ఉద్యోగాలు రావాలంటే తెలంగాణ రావాలన్నారు. 
 
 రాయల అంటే మరో యుద్ధమే..
 రాయల తెలంగాణ అంటే మరో యుద్ధం తప్పదని ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు, పొలిట్‌బ్యూరోసభ్యులు ఏపీ జితేందర్‌రెడ్డి, ఇబ్రహీం హెచ్చరించారు. సీమాంధ్రలో ఉద్యమాన్ని చూసి తట్టుకోలేకపోతున్నానని పలికిన చంద్రబాబుకు తెలంగాణలో 1200 మంది బలిదానాలపై ఎందుకు చలించలేదని ప్రశ్నించారు. చంద్రబాబు తెలంగాణను అడ్డుకుంటుంటే సిగ్గు, రోషం లేకుండా ఆ పార్టీలో ఎలా ఉంటారని టీటీపీపీ నాయకులు నిలదీశారు. టీఆర్‌ఎస్ ఎట్టి పరిస్థితిలోనూ కాంగ్రెస్‌లో కలువదన్నారు. కేంద్రంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు లోపాయికారిగా కుమ్మకైయ్యారని, ఆంక్షలతో కూడిన తెలంగాణ ప్రకటించే టి.కాంగ్రెస్ నాయకులను బట్టలూడదీసి తరిమికొడతామని టీఆర్‌ఎసీవీ రాష్ట్ర అధ్యక్షుడు బాల్క సుమన్  హెచ్చరించారు. ప్రాణాలు అర్పించింది.. వంద కేసులకు బెదరకుండా పోరాటం చేసింది ఆంక్షల తెలంగాణ కోసమేనా? అని ప్రశ్నిం చారు. టీ కాంగ్రెస్ నేతలు ఎటువైపు నిలబడతారో తేల్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శులు గౌతం శ్రీను, కిరణ్‌కుమార్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నరేష్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు బెక్కెం జనార్దన్, ఆల వెంకటేశ్వరెడ్డి, హర్షవర్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement