ఇక నుంచి రత్నగిరి, సత్యగిరులపై ఖాళీ ప్రదేశాల్లో వివాహాలు చేసుకునేందుకు అనుమతించరాదని అన్నవరం దేవస్థానం నిర్ణయించింది.
అన్నవరం : ఇక నుంచి రత్నగిరి, సత్యగిరులపై ఖాళీ ప్రదేశాల్లో వివాహాలు చేసుకునేందుకు అనుమతించరాదని అన్నవరం దేవస్థానం నిర్ణయించింది. కల్యాణ మండపాలు, రామాలయం ముందు ఆవరణ, మాడ వీధులు, వివిధ సత్రాల్లో ఉన్న వేదికల మీద మాత్రమే వివాహాలు చేసుకోవడానికి అనుమతిస్తారు. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్‌వీ ప్రసాద్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈవో కె.నాగేశ్వరరావు గురువారం ‘సాక్షి’కి తెలిపారు.
ఇప్పటివరకూ సత్యగిరిపై హరిహరసదన్ ఎదుట, ప్రకాష్ సదన్ సత్రానికి ఇరువైపులా ఉన్న ఖాళీ ప్రదేశాలు, అక్కడి పార్కింగ్ స్థలాలు, సీసీ సత్రాలవద్ద పెద్దపెద్ద సెట్టింగ్‌లతో ధనికులు ఆర్భాటంగా వివాహాలు నిర్వహించుకునేవారు. వీటికి అద్దె రూపంలో దేవస్థానానికి ఏటా రూ.10 లక్షల వరకూ ఆదాయం వచ్చేది. అయితే గత శనివారం అర్ధరాత్రి సత్యగిరిపై ఉన్న ఖాళీ ప్రదేశంలో జరిగిన వివాహ వేడుకలో అశ్లీల నృత్యాలకు తెగబడడంపై తీవ్ర దుమారం రేగిన విషయం విదితమే.
దీనిపై ఆరా తీసిన దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఇకపై రత్నగిరి, సత్యగిరులపై ఉన్న ఖాళీ ప్రదేశాల్లో వివాహాలకు అనుమతించరాదని ఆదేశించారు. దేవస్థానానికి ఆదాయంకన్నా ఆలయ పవిత్రత ప్రధానమని ఈ సందర్భంగా ఈఓ అన్నారు. సత్యగిరిపై వివాహాలు చేసుకోవడానికి 36 హాల్స్‌తో విష్ణుసదన్ నిర్మించామని తెలిపారు. అలాగే రామాలయం ముందు ఉన్న ఖాళీ ప్రదేశంలో వివాహాలు చేసుకునేందుకు ఎటువంటి రుసుమూ చెల్లించనవసరం లేదని ఈఓ పేర్కొన్నారు.