పెద్దాసుపత్రిని ప్రైవేట్‌కు కట్టబెట్టారు

BY Ramaiah Visit Government hospital - Sakshi

సీఎంకు పేదల ఆరోగ్యం పట్టడం లేదు

పెద్దాసుపత్రిని దోచేస్తున్న ప్రైవేటు ఏజెన్సీలు

వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య

కర్నూలు(హాస్పిటల్‌): ప్రభుత్వ ఆసుపత్రిలోని సేవలన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రైవేటుపరం చేశారని..దీంతో పేదలకు సరిగ్గా  వైద్యం అందడం లేదని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కర్నూలు   పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను సందర్శించారు. పలు వార్డుల్లో రోగులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్నారు. కిడ్నీ బాధితులకు డయాలసిస్‌ సేవలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. రెండు రోజుల నుంచి రేషన్‌కార్డు/ఎన్‌టీఆర్‌ వైద్యసేవ కార్డు ఉంటేనే డయాలసిస్‌ చేస్తామంటున్నారని  పలువురు రోగులు ఆయనకు విన్నవించారు. దివంగత వైఎస్‌ఆర్‌ హయాంలో ఇలా నిబంధనలు ఉండేవి కావని..అందరికీ వైద్యం అందేదన్నారు.

తర్వాత  కార్డియాలజిలో రోగులకు యాంజియోగ్రామ్‌ పరీక్షలు చేయడం లేదని తెలియడంతో బీవై రామయ్య అక్కడికి వెళ్లారు. పదిరోజులుగా కేథలాబ్‌ మిషన్‌ పనిచేయడం లేదని, ఈ విషయాన్ని యంత్రాలు మరమ్మతులు చేసే టీబీఎస్‌ కంపెనీకి చెప్పినా ఇప్పటి వరకు రాలేదని వైద్యులు చెప్పారు. అనంతరం బీవై రామయ్య మాట్లాడుతూ  వైద్యసేవలను ప్రభుత్వం ప్రైవేట్‌ ఏజెన్సీలకు అప్పగించడంతోనే ఆ సంస్థలు ప్రజా ధనాన్ని దోచుకుంటున్నాయి తప్ప సేవలు చేయడం లేదని మండిపడ్డారు. చంద్రబాబు తీరుతోనే   పదేళ్లు ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో మనం వైద్యసేవలు అందుకోలేకపోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశా రు. వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే పేదలందరికీ కార్పొరేట్‌ వైద్యం అందించడమే కాక డయాలసిస్‌ చేసుకునే వారికి నెలకు రూ.10వేలు పింఛన్, బస్‌పాస్‌ ఇస్తారని భరోసా ఇచ్చారు.

జూడాల సమ్మెకు మద్దతు
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో జూనియర్‌ డాక్టర్లు చేస్తున్న సమ్మెకు వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా శిబిరం వద్ద కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు బీవై రామయ్య మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం జూడాలు 9 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదన్నారు. ఆయన వెంట కర్నూలు పార్లమెంట్‌  ప్రధాన కార్యదర్శి కరుణాకర్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్‌ సురేంద్రరెడ్డి, నగర అధ్యక్షుడు రాజా విష్ణువర్దన్‌రెడ్డి, ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్‌ మద్దయ్య తదితరులు ఉన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top