ముగిసిన రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌

Rajya Sabha Election Polling Start In AP Assembly - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న పోలింగ్‌ ముగిసింది. అసెంబ్లీ కమిటీ హాల్‌లో శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. మొత్తం 175  ఓట్లకు గాను ఇప్పటి వరకు 170 ఓట్లు పోలైయ్యాయి. వీరిలో 151 వైఎస్సార్‌సీపీ సభ్యులు ఉన్నారు. టీడీపీ నుంచి ఇప్పటి వరకు 18 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు పార్టీ ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఓటింగి ముగిసన అనంతరం కౌంటింగ్‌ ప్రక్రియ మొదలైంది. సాయంత్రం 6 గంటలకు ఫలితాలను వెల్లడించనున్నారు. 

శాసనసభలోని మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటే ఒక్కో అభ్యర్థి రాజ్యసభకు ఎన్నికయ్యేందుకు 36 తొలి ప్రాధాన్యత ఓట్లు అవసరమవుతాయి. పోలింగ్‌లో పాల్గొనే సభ్యుల సంఖ్య తగ్గితే ఆ మేరకు గెలిచేందుకు అవసరమయ్యే ఓట్లు కూడా తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతమున్న సంఖ్యాబలాన్ని బట్టీ మొత్తం నాలుగు స్థానాలను అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సునాయాసంగా గెలుచుకునే అవకాశం ఉంది.

వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల తరపున రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ తరపున మాజీ మంత్రి అలపాటి రాజేంద్రప్రసాద్‌ పార్టీ ప్రతినిధులుగా పోలింగ్‌ బూత్‌లో కూర్చున్నారు. ఎన్నికల బరిలో అధికార పార్టీ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానిలు బరిలో ఉన్నారు. ఇక సభలో సరైన సంఖ్యా బలం లేకున్నా టీడీపీ నుంచి వర్ల రామయ్య పోటీలో నిలిచారు. (ఉండేది ఎవరో, వీడేది ఎవరో? 19న..)

దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. ఆయా రాష్ట్రాల్లోని మొత్తం 19 రాజ్యసభ స్థానాలతో పాటు గతంలో వాయిదా పడ్డ ఆరు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గుజ‌రాత్‌, ఆంధ్రప్రదేశ్‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లో నాలుగు సీట్లకు, మ‌ధ్యప్రదేశ్, రాజ‌స్తాన్ రాష్ట్రాల్లో మూడు సీట్లకు, జార్ఖండ్ నుంచి రెండు సీట్లకు ఎన్నిక‌లు జ‌ర‌గుతున్నాయి. ఇక ఈశాన్య రాష్ట్రాలైన మేఘాల‌యా, మ‌ణిపూర్‌, అరుణాచ‌ల్ ప్రదేశ్‌, మిజోరం రాష్ట్రాల్లో ఒక్కొక్క సీటుకు ఎన్నికలు జరగుతున్నాయి. రాజ‌స్తాన్‌, గుజ‌రాత్‌, మ‌ధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక్కొక్క సీటులో బీజేపీ-కాంగ్రెస్‌ మధ్య చాలా గ‌ట్టి పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. (కాంగ్రెస్‌ గ్రీన్‌ సిగ్నల్: బరిలో మాజీ ప్రధాని‌)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top