రాజమండ్రి-కొవ్వూరుల మధ్య గోదావరి నదిపై ఉన్న మూడో రైలు వంతెన కాస్త కుంగిపోయింది.
రాజమండ్రి సిటీ/కొవ్వూరు: రాజమండ్రి-కొవ్వూరుల మధ్య గోదావరి నదిపై ఉన్న మూడో రైలు వంతెన కాస్త కుంగిపోయింది. ఈ విషయం గమనించిన రైల్వే అధికారులు ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం వంతెనను పరిశీలించింది. 19వ స్టాండ్ వద్ద యాంగ్యులర్ దెబ్బతినడంతో ఈ మార్గంలో రాకపోకల వేగాన్ని 20కిలోమీటర్లకు తగ్గించారు. ఫలితంగా ఈ మార్గంలో నడిచే అన్ని రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఈ సందర్భంగా విజయవాడ డీఆర్‌ఎమ్ అశోక్‌కుమార్ మాట్లాడుతూ రానున్న రెండు నెలల్లో రూ. కోటితో మరమ్మత్తులు చేస్తామన్నారు.
దీంతో మరమ్మత్తులు పూర్తయ్యే వరకు వంతెనపై రైళ్ల వేగాన్ని నియంత్రించనున్నట్లు తెలిపారు. మరో ఆరు నెలల్లో ఇదే వంతెనపై రెండో ట్రాక్‌ను నిర్మించనున్నామని తెలిపారు. రూ. 100కోట్ల అంచనా వ్యయంతో నాలుగేళ్లలో ఈ ట్రాక్ పనులు పూర్తి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. రిసెప్షన్ ఆర్‌డీఎస్‌వో సమారియా, రైల్వే బోర్డు సలహా మండలి సభ్యుడు ఎన్.కె సిన్హా, ఢిల్లీకి చెందిన రిసర్చ్ డిజైన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్‌కు చెందిన ప్రత్యేక బృందం వంతెనను పరిశీలించింది.