కొత్తగూడెం మున్సిపల్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం రసాభాసగా మారింది.
కొత్తగూడెం, న్యూస్‌లైన్: కొత్తగూడెం మున్సిపల్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం రసాభాసగా మారింది. కాంగ్రెస్, సీపీఐ కార్యకర్తల మధ్య బాహాబాహీకి వేదికగా మారింది. మండల ప్రత్యేకాధికారి రత్నకుమార్ అధ్యక్షతన సభ ప్రారంభం కాగానే భద్రాచలాన్ని తెలంగాణలోనే ఉంచాలని, ఇటీవలి వరదలతో నష్టపోయిన పంటల సర్వే నిర్వహించాలని సీపీఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీనిపై తీర్మానం చేస్తామని రత్నకుమార్ హామీ ఇచ్చారు. అయితే వర్షం వచ్చి రెండు నెలలు కావస్తున్నా.. నేటికీ సర్వే చేయలేదని, ఇప్పుడు చేస్తే తడిసి మొలకెత్తిన మొక్కలు ఎలా కనిపిస్తాయని ఆందోళనకారులు ప్రశ్నిం చారు. దీంతో కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.
ఏజెన్సీలో కరెంట్ మీటర్లకు అనుమతి ఇవ్వాలని వైఎస్సార్ సీపీ నిరసన..
ఏజెన్సీలో ఇళ్లు కట్టుకున్న గిరిజనేతరులకు కరెంట్ మీటర్లు ఇవ్వడం లేదని, వెంటనే మీటర్లకు అనుమతి ఇవ్వాలని వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు తాండ్ర నాగబాబు, లీగల్‌సెల్ రా ష్ట్ర కమిటీ సభ్యులు సాదిక్‌పాషా ఆధ్వర్యంలో ప్లకార్డులు ప్రదర్శించారు. ఏజెన్సీలోని గిరిజనేతరులకు ఎలాంటి నిబంధనలు లేకుండా ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
భవనం పైనుంచి దూకిన టీఆర్‌ఎస్‌వీ కార్యకర్తలు...
భద్రాచలాన్ని తెలంగాణలోనే ఉంచాలని, సమైక్యవాది సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఫ్లెక్సీలను తొలగించాలని టీఆర్‌ఎస్‌వీ కార్యకర్తలు రాజశేఖర్, మరో ఇద్దరు మున్సిపల్ కార్యాలయ భవనం పెకైక్కి నినాదాలు చేశారు. సీపీఐ కార్యకర్తలు వారికి మద్దతుగా నిలవడంతో రచ్చబండ వేదిక మరోమారు ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో భవనం పెకైక్కిన రాజశేఖర్ అక్కడి నుంచి కిందకు దూకగా, పోలీసులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఫ్లెక్సీని తొలగించాలని సీపీఐ కార్యకర్తలు నినాదాలు చేయగా, అన్ని పార్టీల వారు దీనికి మద్దతు పలికారు. ఈ క్రమంలో నవతన్ అనే సీపీఐ కార్యకర్త బారికేడ్లను దోసుకుని వేదిక వద్దకు వెళ్లి సీఎం ఫ్లెక్సీని తొలగించాడు. దీంతో పోలీ సులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
రౌడీషీటర్‌ను దించాలని సీపీఎం ఆందోళన..
రచ్చబండ వేదికపై ఉన్న రచ్చబండ కమిటీ సభ్యుడు, కాంగ్రెస్ నాయకుడు అయిన బత్తుల వీరయ్య రౌడీషీటర్ అని, అతనిని వెంటనే కిందకు దించాలని సీపీఎం రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య ఆధ్వర్యంలో కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో వీరయ్య తనను రౌడీషీటర్ అంటున్నా ఎందుకు స్పందించడం లేదని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును ప్రశ్నించారు. దీనికి ఆగ్రహించిన ఎమ్మెల్యే ‘నన్ను ప్రశ్నించే వాడివా నువ్వు..’అంటూ వీరయ్యపై విరుచుకుపడ్డారు. ఆ తర్వాత సీపీఎం, సీపీఐ కార్యకర్తలు వీరయ్యను కిందకు దించాలని బారికేడ్లను విరగ్గొట్టి వేదిక వద్దకు దూసుకొచ్చేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని లోనికి రాకుండా అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన కార్యకర్తలు కుర్చీలను విసిరివేయడంతో సభా ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే వారించినా వారు వినకుండా సుమారు గంటపాటు కుర్చీలను విసిరేస్తూ ఆందోళన నిర్వహించారు. ఈ క్రమంలో ఓ కుర్చీ తగిలి టూటౌన్ ఎస్సై రవీందర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. బారికేడ్లు విరగ్గొట్టడంతో కొందరు పోలీసులకు, ఆందోళనకారులకు కూడా గాయాలయ్యాయి.
కాంగ్రెస్, సీపీఐ కార్యకర్తల వాగ్వాదం...
సభలో ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ రచ్చబండ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంగా మారిందని, కొంత మందితో కమిటీ వేసి వేదిక పైకి ఎక్కించడం దారుణమని అన్నారు. అయితే ఈ విషయం గురించి తర్వాత ఆలోచిద్దామని, ముందుగా ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఎమ్మెల్యే ప్రసంగం ముగియగానే సీపీఐ కార్యకర్తలు వీరయ్యపై మరోసారి సవాల్ విసరడంతో కాంగ్రెస్ నాయకులు ప్రతిసవాళ్లకు దిగారు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నడుమ రచ్చబండ కార్యక్రమాన్ని ముగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయినా ఇరువర్గాల వాగ్వాదం సద్గుమణగకపోవడంతో పోలీసులు ఎమ్మెల్యేను, ఇతర అధికారులను లోనికి పంపించి స్వల్పంగా లాఠీచార్జ్ చేశారు. అయినా కొద్దిసేపు ఇరువర్గాల వారు రెండువైపులా మోహరించడంతో పోలీసులు మున్సిపల్ కార్యాలయం ప్రధాన గేటును మూసివేసి వారిని అక్కడే నిలిపివేశారు.