సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం

Quick Dharshan at Srivari Temple for common devotees - Sakshi

అందుకోసమే ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3 దర్శనాలు రద్దు 

ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్చించాం      

టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

తిరుమల /కాంచీపురం: సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శన భాగ్యం కలిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మంగళవారం పేర్కొన్నారు. కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం అనంతరం శ్రీవారి ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎల్‌ 1, ఎల్‌ 2, ఎల్‌ 3 వీఐపీ బ్రేక్‌ దర్శనం విధానాన్ని రద్దుచేసేందుకు ఈఓ, జేఈఓలతో కూడా చర్చించినట్లు ఆయన తెలిపారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సిద్ధం చేసి వీలైతే వెంటనే వీఐపీ బ్రేక్‌లను రద్దుచేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. మరో రెండు మూడు రోజుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తిచేసి పూర్తిస్థాయిలో బ్రేక్‌ దర్శనాలను రద్దు చేస్తామన్నారు. సామాన్య భక్తులకు దివ్యదర్శనం త్వరగా అందేలా ప్రొటోకాల్‌ దర్శనం, వీఐపీ దర్శనాలు అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అర్చన అనంతరం దర్శనం (ఏఏడీ) మళ్లీ అమలు చేయడానికి సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలించాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. ఉమ్మడి ఏపీగా ఉన్నపుడు హైదరాబాద్‌ రాజధాని కాబట్టి అప్పట్లో టీటీడీకి సంబంధించిన కార్యాలయం ఉందన్నారు. ఇప్పుడు ఏపీ రాజధాని అమరావతి కాబట్టిæ అక్కడ నూతన కార్యాలయం ఏర్పాటు చేస్తే ఏవైనా సమస్యలు ఉంటే అక్కడ ఉన్న అధికారుల దృష్టికి, చైర్మన్‌ దృష్టికి సులభంగా తీసుకురావొచ్చన్నారు. తిరుమలలో శాశ్వత ప్రాతిపదికన చైర్మన్‌ కార్యాలయం నిర్మాణంపై చర్చిస్తామన్నారు.

అత్తివరదర్‌ సేవలో టీటీడీ చైర్మన్‌
టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులతో మంగళవారం కాంచీపురంలోని అత్తివరదర్‌ను దర్శించుకున్నారు. టీటీడీ ఆలయం తరఫున తీసుకొచ్చిన సారెను అత్తివరదర్‌కు అలంకరించి పూజలు చేశారు. అర్చకులు చైర్మన్‌కు ప్రసాదాలను అందజేశారు. తర్వాత ఆయన కామాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆయన వెంట టీటీడీ స్థానిక సలహా మండలి మాజీ సభ్యులు ‘ప్రభాకార్స్‌’ ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు.

బ్రేక్‌ దర్శనం వివరాలు
ఎల్‌–1 :  భక్తులకు మూలమూర్తి దగ్గర హారతి, తీర్థం, శఠారి ఇస్తారు
ఎల్‌–2 :  స్వామివారిని దగ్గరగా దర్శించుకోవచ్చు. అయితే హారతి, తీర్థం, శఠారి ఉండవు
ఎల్‌–3 : కాస్త దూరం నుంచి స్వామిని దర్శించుకోవచ్చు. హారతి, తీర్థం, శఠారి ఉండవు.
టికెట్‌ ధర : అన్నింటికి రూ.500లు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top