నాణ్యత ‘నీటి’ మూట | Quality of the 'water' package | Sakshi
Sakshi News home page

నాణ్యత ‘నీటి’ మూట

Sep 20 2013 4:08 AM | Updated on Oct 20 2018 6:17 PM

పేరుకే మినరల్ వాటర్. ఆ పేరుతో జనాన్ని పచ్చి దగా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీనికి ప్రభుత్వ నిర్లక్ష్యం తోడైంది. నిత్యం శుద్ధజలం పేరుతో లక్షల లీటర్లు రవాణా చేస్తూ నిర్వాహకులు కోట్లాది రూపాయలు దండుకుంటున్నారు.

బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్‌లైన్:  పేరుకే మినరల్ వాటర్. ఆ పేరుతో జనాన్ని పచ్చి దగా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీనికి ప్రభుత్వ నిర్లక్ష్యం తోడైంది. నిత్యం శుద్ధజలం పేరుతో లక్షల లీటర్లు రవాణా చేస్తూ నిర్వాహకులు కోట్లాది రూపాయలు దండుకుంటున్నారు. జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా సాగుతున్న ప్యూరిఫైడ్ వ్యాపారంపై ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక కథనం..  ప్రజలకు రక్షిత నీరు అందిచండంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది.
 
 దీన్ని ఆసరాగా తీసుకుని కొందరు చేస్తున్న నీటి వ్యాపారం దినాదినాభివృద్ధి చెందుతోంది. జిల్లాకేంద్రం నెల్లూరుతో పాటు 46 మండలాల్లో దాదాపు 400కు పైగా ప్యూరిఫైడ్ వాటర్‌ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో కొన్ని ఐఎస్‌ఐ మార్కుతో పాటు ప్రమాణాలు పాటిస్తున్నా.. దాదాపు 300కు పైగా వాటర్‌ప్లాంట్లలో ప్రమాణాలకు తిలోదకాలు ఇస్తున్నారు. ఆయా వాటర్‌ప్లాంట్లలో నిత్యం లక్షల లీటర్ల నీరు ఉత్పత్తి అవుతోంది. అయితే పంచాయతీల్లో మలినాలతో కూడిన నీటితో వ్యాపార నిర్వాహకులు ప్రజలను మోసం చేస్తున్నారు. రోజుకు దాదాపు రూ.20 లక్షలు అర్జిస్తున్నట్టు అంచనా. అంటే నెలకు రూ.6కోట్లకు పైగా ధనాన్ని ప్రజలు వెచ్చిస్తున్నారు.
 
 అధికారుల పరిశీలన శూన్యం
 వాటర్‌ప్లాంట్ల నుంచి తయారవుతున్న నీటి నాణ్యతపై ప్రజారోగ్య విభాగం చర్యలు శూన్యం. ఈ నీళ్లు ఎంతవరకు సురక్షితమో గతంలో అధికారులు నిర్వహించిన దాడులే వెల్లడించాయి. పలుచోట్ల పంచాయతీ వాటర్ ట్యాప్‌ల నుంచి నీటిని నింపి అమ్ముతున్నట్టు ఆరోపణలున్నాయి. మార్కెట్లో విక్రయించే ముందు నీళ్లలోని జీవ, రసాయన కణాల ఉనికిని తెలుసుకోవడానికి మైక్రోబయాలజీ, బయోకెమికల్ పరీక్షలు నిర్వహించాలి. దీనికి ప్రతి ప్లాంట్‌లో తప్పనిసరిగా సొంత ప్రయోగశాల, నైపుణ్యం కలిగిన సిబ్బందిని నియమించాలి. దాదాపు 90 శాతం ప్లాంట్లలో ప్రయోగశాలల్లేవు. పరీక్షించకుండానే ప్రజలకు అంటగడుతున్నారు. చాపకింద నీరులా ఈ వ్యాపారం గ్రామాలకు విస్తరించింది. ఇకనైనా ప్రజారోగ్య విభాగం మామూళ్ల మత్తును వీడి నీటి నాణ్యత పాటించని వారిపై తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement