
ఆర్వో ప్లాంట్ ఏర్పాటు టెండర్లలోనిబంధనలు గాలికి..
నాణ్యత ప్రమాణాల డిజైన్ ఊసులేదు.. కాలపరిమితీ లేదు..
బిడ్ తెరవాల్సిన తేదీ ముగిసి వారమైనా ఖరారుకాని కాంట్రాక్టర్లు
గిరిజన గురుకుల విద్యాసంస్థల్లో 398 ప్లాంట్ల ఏర్పాటుకు టెండర్లు
సాక్షి, హైదరాబాద్: గిరిజన గురుకుల విద్యాసంస్థల్లో ఆర్వో (రివర్స్ ఆస్మోసిస్) వాటర్ ప్లాంట్ల ఏర్పాటు టెండరు ప్రక్రియపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టెండరు నిబంధనల రూపకల్పన, దరఖాస్తుదారుల ఆర్థిక అంశాల ఎంపిక తికమకగా ఉన్నాయి. టెండర్‌లో పాల్గొనే వారు తయారీదారులై ఉండాలా? లేక పంపిణీ దారుడైతే సరిపోతుందా? అనే అంశంపై స్పష్టత లేకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ గిరిజన గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని గురుకుల పాఠశాలల్లో 398 ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు ఈనెల 7న గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగం టెండర్లు పిలిచింది. 2025–26 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికల్లా కాంట్రాక్టర్లను ఖరారు చేసి ఆర్వో ప్లాంట్లను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చేలా గిరిజన సంక్షేమ శాఖ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. టెండరు ప్రక్రియలో లోపాలున్నాయని, ప్రభుత్వం దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని దరఖాస్తుదారులు డిమాండ్ చేస్తున్నారు.
టెండరు ప్రక్రియ ఇలా...
రాష్ట్రంలో మూడు ఏజెన్సీ ప్రాంతాలున్నాయి. ఉట్నూరు, ఏటూరు నాగరం, భద్రాచలం ఐటీడీఏ పరిధిలో ఉన్న విద్యాసంస్థల్లో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు మూడు టెండర్లు పిలిచారు. అదేవిధంగా మన్ననూరు ప్రాజెక్టుకుతోపాటు హైదరాబాద్ కేంద్రంగా నిర్దేశించిన విద్యాసంస్థల కోసం మరో టెండరు పిలిచారు. మొత్తం నాలుగు టెండర్ల ద్వారా 398 ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలి.
ఇందులో 244 ప్లాంట్లు 500 లీటర్/అవర్, మిగతా 154 ప్లాంట్లు వెయ్యి లీటర్/అవర్ సామర్థ్యం గలవి. వీటికి రూ.25 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉంది. ఈనెల 7 నుంచి 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు టెండర్లకు గడువు విధించారు. ఈనెల 16న సాయంత్రం 5 గంటలకు బిడ్లు తెరిచి కాంట్రాక్టరును ఖరారు చేసేలా షెడ్యూల్‌లో ప్రకటించారు. అయితే బిడ్ తెరవాల్సిన తేదీ ముగిసి వారమైనా కాంట్రాక్టరును ఖరారు చేయకపోవడం గమనార్హం.
నిబంధనలపై అభ్యంతరాలివీ..
» టెండరు ప్రక్రియలో దరఖాస్తు గడువు కీలకం. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం టెండరు ప్రక్రియలో మూడు వారాలపాటు అవకాశం కల్పించాలి. అత్యవసర సందర్భంలో గడువు పది రోజులు ఇవ్వొచ్చు. కానీ ఇక్కడ వారం మాత్రమే ఇచ్చారు.
» టెండర్లలో పాల్గొనే వాళ్లు ప్లాంటు తయారీదారులై ఉండాలా? లేక నమోదైన పంపిణీదారుడై ఉండాలా? లేక చిన్నపాటి సరఫరాదారుడై ఉన్నా సరిపోతుందా? అనేదానిపై స్పష్టత లేదు.
» ఆర్వో ప్లాంటు ఏర్పాటుకు సంబంధించి నాణ్యత ప్రమాణాలతోపాటు టెక్నికల్ డ్రాయింగ్, డిజైన్ తప్పనిసరిగా ప్రకటించాలి. కానీ అలాంటిది లేదు.
» సాధారణంగా మిషనరీ, ఇతర పరికరాల కొనుగోలు విషయంలో తప్పనిసరిగా ఆర్థిక నిబంధనలు ప్రస్తావించాలి. టెండరు నిబంధనల్లో సాల్వెన్సీ సర్టిఫికెట్ అంశం లేకపోవడం గమనార్హం.
» ప్లాంటు ఏర్పాటుకు సంబంధించిన కాలపరిమితి, వారంటీ వివరాలపై స్పష్టత లేదు.
» బిడ్డర్‌కు వార్షిక టర్నోవర్ రూ.10 కోట్లు లేదా సగటున రూ.7 కోట్ల ఉంటే సరిపోతుందని పేర్కొన్నారు. కానీ కాంట్రాక్టు పరిమితి రూ.13.99 కోట్ల విలువ ఉండటంతో నిర్దేశించిన టర్నోవర్‌తో ఎలా సాధ్యమవుతుందనే సందేహం వ్యక్తమవుతోంది. ప్రాజెక్టు విలువకు కనీసం ఆరు రెట్లు అధికంగా టర్నోవర్ ఉండాలని నిబంధనలున్నాయి.