అమ్మ జాతర ఆరంభం

Pydithalli Jatara Started In Vizianagaram - Sakshi

వేడుకగా చదురుగుడి, వనంగుడిల వద్ద పందిరిరాట మహోత్సవం

భక్తిశ్రద్ధలతో మండల దీక్షలు చేపట్టిన భక్తులు

పైడితల్లి సిరిమాను గంట్యాడ రామవరంలో సాక్షాత్కారం

సిరిమాను తిరిగే ప్రాంతాన్ని స్వీయపర్యవేక్షణ చేసిన ఎస్పీ

సాక్షి, విజయనగరం టౌన్‌:  ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి  జాతరకు శనివారం అంకురార్పణ చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛరణాల మధ్య  వేకువజాము నుంచి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు జరిపారు. ముందుగా అమ్మవారి మండల దీక్షలను  శాస్త్రోక్తంగా చేపట్టారు. అనంతరం ఉదయం 9.30 గంటలకు అమ్మవారి చదురుగుడి వద్ద పందిరిరాట వేశారు. 10.30 గంటలకు  రైల్వేస్టేషన్‌ వద్ద ఉన్న వనంగుడి వద్ద పందిరిరాట వేసి జాతర మహోత్సవాలను ప్రారంభించారు. పైడితల్లి అమ్మవారి సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు  ప్రత్యేకపూజలు చేసి, ఉత్సవానికి నాం దిపలికారు.  సుమారు 200 మంది దీక్షాపరులు మాలధారణ చేశారు.

రామవరంలో సాక్షాత్కరించిన సిరిమాను..
గంట్యాడ మండలం రామవరం గ్రామంలోని భవిరి వారి కల్లాల్లో పైడితల్లి అమ్మవారి సిరిమాను సాక్షాత్కరించింది.  ఈ మేరకు  పైడితల్లి అమ్మవారి దేవస్థానం అధికారులు, సిరిమా ను పూజారితో కలిసి ఆ ప్రదేశానికి వెళ్లారు.  సిరిమాను, ఇరుసుమానుకు ప్రత్యేక పూజలు జరిపారు.  ఈ సందర్భంగా సిరిమాను పూజారి వెంకటరావు మాట్లాడుతూ రామవరం గ్రామంలో భవిరి అప్పారావు, ముత్యాలు, శ్రీనివాసరావు కలాల్లో తల్లి సాక్షాత్కరించిందన్నారు. తమ గ్రామంలో సిరిమానును తల్లికోరుకుందని తెలుసుకున్న గ్రామస్తులు ఆ ప్రాంతానికి చేరుకునిచేరుకుని  సిరిమాను, ఇరుసుమాను (చింతచెట్టు)లకు పూజలు చేశారు. పసుపు, కుంకుమలను సమర్పించారు. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

తొలిరోజే ఎస్పీ రాజకుమారి స్వీయపర్యవేక్షణ..
గతంలో ఎన్నడూలేని విధంగా ఎస్పీ బి.రాజకుమారి  శనివారం రాత్రి సిరిమాను తిరిగే  హు కుం పేట నుంచి  కోట జంక్షన్‌ వరకు తమ సిబ్బందితో కలిసి  దాదాపు మూడు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ  స్వీయ పర్యవేక్షణ చేశారు. సిరిమాను తిరిగే ప్రదేశాల్లో ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉంటాయో, వాటిని ఎలా అధిగమించాలో  సంబంధిత అధికారులతోనడుస్తూనే సమీక్షించారు. ఈ సందర్భం గా ఆమె కోట జంక్షన్‌ వద్ద మాట్లాడుతూ అమ్మపండగను  అందరూ ఎంతో ప్రశాం తమైన వాతావరణంలో నిర్వహించుకో వాలని, అందుకు జిల్లా పోలీస్‌శాఖ తొలి రోజు నుంచే కసరత్తు ప్రారంభించిందన్నారు.  కొత్తగా జిల్లాకు వచ్చిన అధికా రులందరికీ అవగాహన  కోసం ప్రతీ స్పాట్‌ను క్షుణ్ణంగా పరిశీలించామని, పూజారి వెంకటరావుని, ఆలయ అధికారులను అడిగి వివరాలు సేకరించామన్నారు. ఆమె వెంట అదనపు ఎస్పీ ఎన్‌.శ్రీదేవీరావు, ఓఎస్‌డీ రామ్మోహనరావు,  డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు పాల్గొన్నారు. 

అమ్మ సాక్షాత్కారం మా అదృష్టం..
పైడితల్లి మా కల్లాల్లో సాక్షాత్కరించడం మా గ్రామ అదృష్టంగా భావిస్తున్నాం.  ఏటా క్రమం తప్పకుండా అమ్మను కుటుంబ సమేతంగా దర్శించుకుంటాం. పసుపు, కుంకుమలు సమర్పిస్తాం. గ్రామస్తులందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. పెద్దఎత్తున మా గ్రామంలో పండగ చేసుకుంటాం.
– బవిరి అప్పారావు,  తోట యజమాని

18 ఏళ్ల తర్వాత మరలా మాకు అదృష్టం.. 
పైడితల్లి అమ్మవారు 18 ఏళ్ల తర్వాత మరలా మా గ్రామంలో ఉన్న సిరిమానును కోరుకోవడం మా అదృష్టం. అప్పట్లో  సరికోలు వారి కలాల్లో అమ్మ కోరుకుంది. మరలా ఇప్పుడు మా ఇంటికి పక్కనే బవిరి వారి కల్లాల్లో వెలిసిన మానును అమ్మ కోరుకుంది. మాకు ఇక రోజూ పండగే. ఈ ఏడాది అంగరంగ వైభవంగా తల్లి పండగను నిర్వహించుకుంటాం.
– రొంగలి, సత్యవతి, ఈశ్వరమ్మ, గ్రామస్తులు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top