స్థానిక అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ క్రీడా మైదానంలో గురువారం నిర్వహించిన ‘ప్రొద్దుటూరు పొలికేక’ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి ఈ సభను నిర్వహించారు.
ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: స్థానిక అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ క్రీడా మైదానంలో గురువారం నిర్వహించిన ‘ప్రొద్దుటూరు పొలికేక’ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి ఈ సభను నిర్వహించారు.
సభకు సమన్వయకర్తలుగా వ్యవహరించిన మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ, తహశీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ ఉషారాణి, ఎంఈఓ రాజగోపాల్‌రెడ్డి, ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డిలు సభ నిర్వహణలో కీలకపాత్ర పోషించారు. నాలుగు రోజుల ముందు ఇందు కోసం ప్రత్యేకంగా పొలిటికల్, నాన్ పొలిటికల్, ఉపాధ్యాయ జేఏసీలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే నియోజకవర్గం అంతా విస్తృత ప్రచారం చేయడంతో సభకు లక్ష మందికిపై జనం హాజరయ్యారు. విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు, ప్రజాప్రతినిధులతోపాటు మహిళలు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతోపాటు ఉద్యోగుల వేషధారణ ప్రత్యక ఆకర్షణగా నిలిచాయి. మరికొంత మంది విద్యార్థులు, ఉద్యోగులు దేశభక్తి గేయాలు ఆలపించారు. యూకేజీ విద్యార్థి జేసుతోపాటు టీచర్ వెంకటేశ్వరరెడ్డిలు అల్లూరి సీతారామరాజు, వీఆర్‌ఓ రాజశేఖరరెడ్డి శ్రీకృష్ణదేవరాయులు వేషధారణలు, వంగపండు ఉష సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.