
ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి మహర్ధశ
ప్రొద్దుటూరు టౌన్: రీఫార్మ్ ఫర్‌ఫార్మెన్స్ మేనేజ్‌మెంట్ సెల్ (సంస్కరణల పనితీరు నిర్వహణ విభాగం)కు జిల్లాలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ఎంపికైంది.
ప్రొద్దుటూరు టౌన్: రీఫార్మ్ ఫర్‌ఫార్మెన్స్ మేనేజ్‌మెంట్ సెల్ (సంస్కరణల పనితీరు నిర్వహణ విభాగం)కు జిల్లాలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ఎంపికైంది. రాష్ట్ర వ్యాప్తంగా 10 మున్సిపాలిటీలను ఈ సెల్‌కు ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇందులో కడప జిల్లాలో ప్రొద్దుటూరు, కర్నూలు జిల్లాలో ఆదోని, చిత్తూరు జిల్లాలో చిత్తూరు, అనంతపురం జిల్లాలో హిందూపురం, ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, కోస్తాలో వెస్ట్ గోదావరి, ఏలూరు, తెనాలి, ఒంగోలు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో రెండు కార్పొరేషన్లు చిత్తూరు, ఒంగోలు. ఒక్కో మున్సిపాలిటీకి ఆరుగురు స్పెషలిస్టులను ప్రభుత్వం ఈ సెల్‌కింద నియమించింది. వీరిలో టీం లీడర్, కెపాసిటీ బిల్డింగ్‌కు ఒకరు, మున్సిపల్ ఫైనాన్స్‌కు ఒకరు, పట్టణ మౌలిక సదుపాయాలకు ఒకరు, ఘన వ్యర్థపదార్థాల నిర్వహణకు ఒకరు, సామాజిక అభివృద్ధికి ఒకరు, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీకి ఒక స్పెషలిస్టును నియమించారు. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకంకు సంబంధించిన రూ.22.69 కోట్ల నిధులతో వీటి నిర్వహణ చేస్తున్నారు.
ఈ మొత్తం నిధులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వినియోగించనున్నారు. మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్‌మెంట్ ఈనిధులను విడుదల చేసింది. మున్సిపాలిటీల్లో అభివృద్ధి, సాంకేతిక మెరుగుదల, వనరుల సేకరణ, నిర్వహణ, సిస్టం డెవలప్‌మెంట్, మెరుగైన వసతులకు వీరు ఎన్నో విధాలా తోడ్పాటు అందించనున్నారు. ఎన్విరాన్‌మెంట్, ఇన్‌ఫర్మేషన్ కమ్యూనికేషన్ అభివృద్ధి ఈగవర్నర్స్ ద్వారా ఈ కార్యక్రమాలు ఉన్నాయి. ఐటీ ఆధారిత సేవల కేంద్రంగా మున్సిపాలిటీలను అభివృద్ధి చేయనున్నారు. 2016 మార్చి వరకు వీరు కొనసాగనున్నారు. వీరంతా మున్సిపల్ కమిషనర్ కంట్రోల్‌లో విధులు నిర్వహించనున్నారు. ఇప్పటికే ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి ఐటీ, సాలీడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్‌స్పెషలిస్టులు వచ్చి రిపోర్టు చేసుకున్నారు.
వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నాటికి కాగిత రహిత కారా్యాలయంగా...
ప్రొద్దుటూరు మున్సిపాలిటీని వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నాటికి పేపర్ రహిత కార్యాలయంగా తీర్చిదిద్దేందుకు మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ ప్రణాళిక రూపొందించారు. రాబోయే ఆరు నెలల్లో మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ స్థాయి సిబ్బంది నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు ప్రతి ఒక్కరు కంప్యూటర్‌పై పరిజ్ఞానం పెంపొందించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఆరు నెలలపాటు ప్రతి రోజు కార్యాలయ పనిగంటలు ముగిశాక గంట నుంచి రెండు గంటల పాటు మున్సిపల్ కార్యాలయంలో కంప్యూటర్ స్కిల్స్‌పై శిక్షణా తరగతులు ఏర్పాటు చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. నవంబర్ 1 నుంచి డిసెంబర్ 15 కల్లా మున్సిపాలిటీలో ఫైల్స్‌తో సంబంధం ఉన్న సిబ్బందికి శిక్షణ తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. శిక్షణ తీసుకోని సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.