అడిఆశలు చేశారు! | Problems Of Asha Workers | Sakshi
Sakshi News home page

అడిఆశలు చేశారు!

May 20 2019 9:30 AM | Updated on May 20 2019 9:34 AM

Problems Of Asha Workers - Sakshi

వేతనాల కోసం ఆందోళన చేస్తున్న ఆశ కార్యకర్తలు(ఫైల్‌)

మండపేట: గ్రామీణ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కీలక భూమిక పోషిస్తున్న ఆశ వర్కర్లు ఐదు నెలలుగా జీతాలు అందక అవస్థలు పడుతున్నారు. కుటుంబ పోషణ భారమై అర్ధాకలితో అలమటిస్తున్నారు. జీతాల పెంపు హామీని తుంగలోకి తొక్కిన చంద్రబాబు సర్కారు, జీతాలు విడుదలను కూడా నిలిపివేసిందని ఆశ వర్కర్లు మండిపడుతున్నారు. జిల్లాలోని ఆశ వర్కర్లకు ఐదు నెలలకుగాను రూ.19.35 కోట్ల మేర వేతన బకాయిలు పేరుకుపోయాయి. కనీస వేతనానికి నోచుకోని ఆశ వర్కర్లను వెబ్‌సైట్‌లో ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంతో ప్రభుత్వ పథకాల లబ్ధికి దూరం చేసిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  
గ్రామీణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి ఆరోగ్య పరిరక్షణకు ఆశ వర్కర్లు పాటుపడుతున్నారు.

కుష్ఠు, టీబీ, తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని గుర్తించి వారికి వైద్య సహాయం అందించడంతో పాటు 104 శిబిరాల నిర్వహణలో వీరు సేవలందిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 4,500 మంది ఆశ వర్కర్లు ఉన్నారు. గతంలో ఆశ వర్కర్లు ఒక్కొక్కరికి గౌరవ వేతనం రూ.3 వేలు, పారితోషికం రూ.2 వేలు చెల్లించేవారు. గత ఎన్నికల్లో ఆశ వర్కర్ల వేతనాలు పెంచుతామని చంద్రబాబు ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. సార్వత్రిక ఎన్నికల ముందు నవంబర్‌లో చంద్రబాబు నిర్వహించిన ప్రజాదర్భారులో పారితోషికం రూ.5,600, గౌరవ వేతనం రూ.3 వేలు చొప్పున అందజేస్తామని ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చలేదు. తమకు ఇచ్చే వేతనాలు, పారితోషికం పెంచకపోగా జనవరి నుంచి మొత్తం చెల్లింపులు నిలిపివేశారని ఆశ వర్కర్లు మండిపడుతున్నారు. 


ఒక్కొక్కరికి నెలకు రూ.8,600గాను జిల్లాలోని ఆశ వర్కర్లకు నెలకు రూ.3.87 కోట్లు చొప్పున ఐదు నెలలకు రూ.19.35 కోట్లు చెల్లించాల్సి ఉంది. తమతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్న ప్రభుత్వం పనికి తగిన వేతనం ఇవ్వకపోగా జీతాలు నిలిపివేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూనిఫాం అలవెన్సులు ఇవ్వడం లేదని, 104 సంచార వైద్యసేవలకు సంబంధించి బిల్లులు చెల్లించడం లేదని వారంటున్నారు. పెంచిన జీతాలు, బిల్లు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.


వెబ్‌సైట్‌లో ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదు 
ఆశ వర్కర్లు అందరూ పేద వర్గాలకు చెందిన వారే.  చంద్రబాబు సర్కారు వీరిని వెబ్‌సైట్‌లో ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదు చేయడంతో ప్రభుత్వ పథకాల లబ్ధికి వీరిని దూరం చేసింది. కనీస వేతనాలకు నోచుకోని తమను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ తమ పిల్లలకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగభృతి తదితర ఏ పథకాలకు ఎంపిక చేయడం లేదని వాపోతున్నారు. జీతాలు పెంచుతామని, వెబ్‌సైట్‌ నుంచి పేర్లు తొలగిస్తామని హామీ ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం తమ ఆశలను అడియాశలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement