నడిరోడ్డుపై గర్భిణి నరకయాతన

Pregnant Women Bleeding During The Sixth Month On Road - Sakshi

ఆరో నెల సమయంలో రక్తస్రావం 

ఇంధనం లేదని బాధితురాలిని రోడ్డుపైనే వదిలేసిన 108 సిబ్బంది

గర్భిణిని ఆస్పత్రికి తాను తరలిస్తానని ముందుకొచ్చిన ఆటోడ్రైవర్‌

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఘటన 

పొదలకూరు: శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నెలలు నిండకుండానే ఓ గర్భిణికి రక్తస్రావం అయ్యింది. సకాలంలో గమ్యస్థానానికి చేర్చి వైద్యం అందించాల్సిన 108 వాహనానికి ఇంధనం లేకపోవడంతో ఆయిల్‌ పట్టుకుని వస్తామని చెప్పి సిబ్బంది గర్భిణిని నడిరోడ్డుపై వదిలి వెళ్లారు. దీంతో ఆ మహిళ నడిరోడ్డుపై నరకయాతన అనుభవించింది. బస్టాండ్‌లో ఉన్న ఓ ఆటో డ్రైవర్‌ 108 వచ్చేలోగా తాను గర్భవతిని నెల్లూరుకు తరలిస్తానని ముందుకు వచ్చి మానవత్వం చాటుకున్నాడు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగులవెల్లటూరు గ్రామానికి చెందిన ఆరో నెల గర్భిణికి రక్తస్రావం అవుతుండటంతో 108 అంబులెన్స్‌లో బంధువులు పొదలకూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ప్రతినెలా ఇదే ఆస్పత్రిలో పరీక్షలు చేయిస్తున్నారు. గర్భిణి పరిస్థితి విషమించడంతో వైద్యురాలు మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్‌లో నెల్లూరుకు తరలించాల్సిందిగా సూచించారు.

ఈలోగా 108 సిబ్బంది వాహనంలో ఇంధనం లేదని దాన్ని నింపుకుని వస్తామని గర్భిణిని రోడ్డుపై వదిలేసి వెళ్లారు. అంబులెన్స్‌ రావడం ఆలస్యం కావడంతో రక్తస్రావం అవుతున్న గర్భిణి నరకయాతన అనుభవించింది. ఆమె ఆర్తనాదాలకు స్థానికులు చుట్టుముట్టారు. బంధువులకు ఏమి చేయాలో పాలుపోక అయోమయంలో ఉండగా గర్భిణిని తాను నెల్లూరుకు తీసుకెళతానని ఓ ఆటోడ్రైవర్‌ ముందుకొచ్చారు. అయితే ఇంధనం వేయించుకుని 108 వాహనం అక్కడికి రావడంతో గర్భిణిని అందులోనే నెల్లూరుకు తరలించారు.  ఈ ఘటనపై అంబులెన్స్‌ సిబ్బంది మాట్లాడుతూ..తాము ముందుగానే నెల్లూరుకు తరలిస్తామని చెప్పినా గర్భిణి పొదలకూరు ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకు వెళ్లాల్సిందిగా తమకు చెప్పిందని తెలిపారు. 108 సిబ్బంది చెప్పినట్లు వారు నేరుగా నెల్లూరుకు వెళ్లినా మధ్యలో ఇంధన సమస్య వచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని బంధువులు అంటున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top