పదో వేతన సవరణ సంఘం(పీఆర్సీ) గడువును మరో 3 నెలలు పొడిగించాలన్న ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదముద్ర వేసినట్టు తెలిసింది.
ఒకటి..రెండు రోజుల్లో ఆదేశాలు వెలువడే అవకాశం
సాక్షి, హైదరాబాద్: పదో వేతన సవరణ సంఘం(పీఆర్సీ) గడువును మరో 3 నెలలు పొడిగించాలన్న ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదముద్ర వేసినట్టు తెలిసింది. ఒకట్రెండు రోజుల్లో ఆదేశాలు వెలువడతాయని అధికారవర్గాల సమాచారం. పి.కె.అగర్వాల్ నేతృత్వంలోని పదో పీఆర్సీకి ఇచ్చిన గడువు శుక్రవారంతో ముగిసింది. కమిషన్‌కు సకాలంలో సిబ్బందిని ఇవ్వకపోవడం, రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె చేయడం ఫలితంగా గడువులోగా నివేదికను పూర్తి చేయలేకపోయింది. ‘‘ఉద్యోగుల సమ్మె వల్ల 2 నెలలు పని సాగలేదు. కమిషన్‌కు దాదాపు 1200 వినతులు, ప్రతి పాదనలు అందాయి. పూర్తి స్థాయి కసరత్తు డిసెంబర్ రెండోవారంలోనే మొదలైంది. ఉద్యోగ సంఘాలతో 800కుపైగా సమావేశాలు నిర్వహించాం. నివేదిక రూపకల్పనలో భాగంగా సుదీర్ఘ కసరత్తు చేయాల్సి వచ్చింది. గడువు పొడిగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. గడువు పొడిగింపు ఫైలు గవర్నర్ నుంచి ఇంకా కమిషన్‌కు చేరలేదు’’ అని పీఆర్సీ చైర్మన్ అగర్వాల్ ‘సాక్షి’కి చెప్పారు.