మండుతున్న ఎండలకు తోడు ఆదివారం నుంచి విద్యుత్ కోతలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. విజయవాడ నగరం మినహా జిల్లా అంతటా విద్యుత్ కోతలు విధించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : మండుతున్న ఎండలకు తోడు ఆదివారం నుంచి విద్యుత్ కోతలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. విజయవాడ నగరం మినహా జిల్లా అంతటా విద్యుత్ కోతలు విధించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. జిలా ్లకేంద్రమైన మచిలీపట్నంలో రోజుకు రెండు గంటలు కోత విధిస్తారు. మున్సిపాలిటీలు, మండల కేంద్రాలలో మూడు గంటలు, గ్రామాల్లో ఆరు గంటలు విద్యుత్ కోత విధించాలని ఏపీఎస్‌పీడీసీఎల్ నుంచి కింది స్థాయి అధికారులకు ఆదేశాలు అందాయి.
మండల కేంద్రాలు, మున్సిపాలిటీలలో ఉదయం 6 నుంచి 7.30 వరకు, మధ్యాహ్నం 12 నుంచి 1.30 వరకు రెండు విడతలుగా కోత విధిస్తారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఉదయం 6 గంటల నుంచి 7 వరకు, మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట వరకు విద్యుత్ కోత అమలు చేస్తారు. గ్రామాల్లో రెండు విడతలుగా ఆరు గంటల కోత విధిస్తారు. విజయవాడ నగరంలో విద్యుత్ కోత విధించకుండా సడలించారు.
మండుతున్న ఎండలు.. విద్యుత్ కోతలు
ఇప్పటికే ఎండలతో అల్లాడుతున్న ప్రజలు విద్యుత్ కోతలతో బెంబేలెత్తుతున్నారు. అధికారులు ఆదివారం నుంచి కోత విధిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ శనివారం నుంచే కోతలు మొదలయ్యాయి. ఇప్పటికే కొద్ది రోజులుగా విజయవాడ నగరంలో రాత్రింబవళ్లు అప్రకటిత విద్యుత్ కోత అమలు చేస్తున్నారు. రానున్న కొద్దిరోజుల్లో విజయవాడ నగరంలో కూడా కోత విధిస్తారని భావిస్తున్నారు.