మాజీ రాష్ట్రపతికి నీళ్లు కరువాయే!

Port Officials Negligence Providing Facilities To Former President Pranab - Sakshi

ప్రణబ్‌కు అసౌకర్యాల నడుమ బస

పోర్టు అధికారుల నిర్లక్ష్యం 

బాధ్యులపై చర్యలకు పోర్టు డిప్యూటీ చైర్మన్‌ ఆదేశం

ఎస్‌బీ ఎస్‌ఐ శ్రీనివాస్‌ వ్యవహారశైలిపై విమర్శలు

అతను భారతరత్న.. మహోన్నతమైన వ్యక్తి.. నడుస్తున్న రాజకీయ చరిత్ర... మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందే. కానీ.. విశిష్ట వ్యక్తిగా.. రాజకీయ దిగ్గజంగా పేరొందిన ప్రణబ్‌కు ఎలాంటి మర్యాద దక్కిందో తెలుసా..? నీటి సౌకర్యం కూడా కరువైన పరిస్థితులు ఎదురయ్యాయి. బస్తీల్లో ట్యాంకర్‌ వస్తే.. నీటిని తీసుకెళ్లినట్లుగా.. ఆయన గదికి బకెట్లతో నీటిని సరఫరా చేశారంటే.. అధికారుల నిర్లక్ష్యం ఇట్టే బయటపడింది. ఏర్పాట్లను ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షించాల్సిన పోర్టు అధికారులు హడావుడి చేశారే తప్ప ప్రణబ్‌కు అందించాల్సిన సౌకర్యాల్ని మాత్రం గాలికొదిలేశారు.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖలోని ఓ ప్రైవేటు విశ్వవిద్యాలయం కార్యక్రమానికి హాజరయ్యేందుకు మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్‌ముఖర్జీ శనివారం మధ్యాహ్నం నగరానికి విచ్చేశారు. ఏపీ ప్రభుత్వ అధికారులు ప్రోటోకాల్‌ నిర్వహించగా.. పోర్టు గెస్ట్‌ హౌస్‌లో బస, వసతి ఏర్పాట్లను మాత్రం విశాఖపట్నం పోర్టు ట్రస్ట్‌ అధికారులు చేపట్టారు. దేశ ప్రథమ పౌరుడిగా వ్యవహరించిన మహోన్నత వ్యక్తికి బస, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసినప్పుడు.. ముందస్తుగా చెక్‌ చేసుకోవడం, ట్రయల్‌ నిర్వహించడం చేయాలి. కానీ.. అవేమీ చూడకుండా పోర్టు అధికారులు నిర్లక్ష్యంతో వ్యవహరించారు . ఆదివారం ఉదయం గెస్ట్‌ హౌస్‌లో చుక్కనీరు కూడా రాకపోవడం పెద్ద చర్చనీయాంశమైంది. ప్రణబ్‌ ఉన్న గదికి  పూర్తిగా నీటిసరఫరా నిలిచిపోయింది. ఆలస్యంగా విషయం తెలుసుకొని మేల్కొన్న అధికారులు తరువాత పరుగులు తీశారు.

అగ్నిమాపక శకటాన్ని ఆశ్రయించిన వైనం..
గెస్ట్‌ హౌస్‌లో నీటి సరఫరా బంద్‌ అవ్వడంతో ఏంచేయాలో పాలుపోని అధికారులు కాన్వాయ్‌లో ఉన్న అగ్నిమాపక శకటం నుంచి నీరు కావాలని అధికారులు కోరారు. అగ్నిమాపక శకటాల గొట్టాల ద్వారా గెస్టు హౌస్‌లోని వాటర్‌ ట్యాంక్‌లోకి నీటిని మళ్లించాలని భావించారు. అయితే ఈ నీటితో స్నానం చేయడం మంచిది కాదని కొంతమంది  సూచించడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. దీంతో కింద నుంచి నీటిని బక్కెట్లతో తెచ్చి స్నానానికి ఏర్పాట్లు చేశారు.

హడావుడి చేశారే తప్ప..
ఇంత జరిగినా.. అక్కడ ఉన్న పోర్టు అధికారులు ఎవరూ నీటి సమస్యని సీరియస్‌గా తీసుకోలేదు. వసతి సౌకర్యాల బాధ్యతలు చూస్తున్న పోర్టు అధికారి బాపిరాజు నీటి సరఫరా ఎలా పునరుద్ధరించాలన్న విషయాన్ని పక్కనపెట్టి.. వస్తున్న సందర్శకులపై విరుచుకుపడుతూ.. చిందులేశారు. ఇంత సీరియస్‌ సమస్య ఉన్నప్పటికీ.. పోర్టు ఉన్నతాధికారులకు కనీసం సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

మోటర్‌ కాలింది.. జనరేటర్‌ ఆగిపోయింది...
నీటిని గెస్ట్‌ హౌస్‌ ట్యాంకుల్లో నింపేందుకు ఉపయోగించే మోటరు కాలిపోయింది. అయినా దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చెయ్యలేదు. జనరేటర్‌ ద్వారా చేద్దామని కొందరు సలహా ఇచ్చారు. అయితే ఆ జనరేటర్‌ కూడా పనిచెయ్యడం లేదని అప్పుడు గుర్తించడంతో ఒక రకమైన టెన్షన్‌ వాతావరణం ఏర్పడింది.

డిప్యూటీ చైర్మన్‌ ఆగ్రహం..
ప్రొటోకాల్‌లో భాగంగా గెస్ట్‌ హౌస్‌కి వచ్చిన పోర్టు డిప్యూటీ చైర్మన్‌ పీఎల్‌ హరనాథ్‌ ఈ విషయం తెలుసుకొని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి సమస్య తలెత్తినప్పుడు తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదంటూ అసహనం వ్యక్తం చేశారు. భారతరత్నకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ సిబ్బందిపై మండిపడ్డారు. బాధ్యులైన సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిప్యూటీ చైర్మన్‌ హరనాథ్‌ ఆదేశించారు.

ఎస్‌బీ ఎస్‌ఐ ఓవరాక్షన్‌..
పోర్టు గెస్టు హౌస్‌ బయట,లోపల పోలీస్‌ ఉన్నతాధికారులంతా హుందాగా విధులు నిర్వర్తిస్తుండగా అక్కడ ఉన్న సంబంధం లేని స్పెషల్‌ బ్రాంచ్‌ ఎస్‌ఐ శ్రీనివాస్‌ మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించారు. అరుపులు, కేకలతో వీరంగం చేశారు. వాస్తవానికి మాజీ రాష్ట్రపతిని కలిసేందుకు ఎవరెవరు వచ్చారనే వివరాల్ని సేకరించడమే ఆయన విధి. కానీ దాన్ని పక్కనపెట్టి వచ్చిన సందర్శకులపై విరుచుకుపడ్డారు. గెస్టు హౌస్‌ లోపల ఫొటోగ్రాఫర్‌ బ్యాగ్‌ ఎందుకంత బరువుందంటూ సంబంధంలేని ప్రశ్నలతో సందర్శకుల్ని ఇబ్బందులకు గురిచేశారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top