అయ్యో.. గిట్లాయెను!

అయ్యో.. గిట్లాయెను! - Sakshi

  • పొన్నాల, సారయ్య ఇక మాజీలే..

  •  రాష్ట్రపతి పాలనతో పోనున్న మంత్రి పదవులు

  •  సాదాసీదాగానే.. సాధారణ ఎన్నికలకు

  •  సాక్షిప్రతినిధి, వరంగల్ : తెలంగాణ రాష్ట్రం కల నెరవేరింది.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో అధికార పార్టీ నేతలు, శ్రేణుల్లో హుషారు పెరుగుతోంది. ఇదే సమయంలో జిల్లా మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్యకు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారమైందనే ఆనందం వెన్నంటే... వారి మంత్రి పదవులు పోతున్నాయి. ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడకుండా రాష్ట్రపతి పాలన వస్తోంది. దీంతో జిల్లా మంత్రులిద్దరూ మాజీ మంత్రులవుతున్నారు. ఎన్నికలు దగ్గరపడిన నేపథ్యంలో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటయ్యే పరిస్థితి లేదు. దీంతో వీరిద్దరూ ఎమ్మెల్యేలుగానే ఎన్నికల పోరుకు వెళ్లాల్సి వస్తోంది. శాసనసభ రద్దయితే మాజీ ఎమ్మెల్యేలుగా ఉండాల్సి వస్తుంది.

     

    పొన్నాల లక్ష్మయ్య 1985లో మొదటిసారి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. 1989లో మళ్లీ పోటీచేసి గెలిచారు. 1991లో నేదురుమల్లి జనార్దనరెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పని చేశారు. 1994లో ఓడిపోరుు.. 2004, 2009 ఎన్నికల్లో గెలిచారు. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కింది. తర్వాత కె.రోశయ్య, ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాల్లోనూ మంత్రి పదవి వరించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో పొన్నాలకు కీలకమైన పదవి వస్తుందని ఆయన సన్నిహితులు చెబుతుండగా.. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ చివరి అంకంలోనే పొన్నాల మంత్రి పదవికి దూరమవుతున్నారు.



    కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక.. పొన్నాలకు పదవి వస్తుందో రాదో అని అప్పట్లో బాగా చర్చ జరిగింది. చివరి నిమిషంలో బెర్త్ దక్కింది. వరుసగా పదేళ్లు పదవీకాలం పూర్తి కాకుండానే పొన్నాల ఇప్పుడు మాజీ మంత్రి అవుతున్నారు. ఇక.. మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న బస్వరాజు సారయ్యకు కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే తొలిసారిగా మంత్రి పదవి వచ్చింది. 1999 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్న సారయ్య కూడా ఇప్పుడు ‘మాజీ’ అవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు... ఎన్నికల తరుణంలో ఇలా మంత్రి పదవి దూరమవడం ఇబ్బందిగానే ఉంటుందని ఆయన వర్గీయులు చెబుతున్నారు.

     

    గండ్ర పదవిపై అస్పష్టత



    తెలంగాణ ఏర్పాటుతో మారిన రాష్ట్ర రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్యలు మా జీ మంత్రులవుతున్నారు. మంత్రి హోదాలో ఉండే ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి పదవికి మాత్రం ఢోకా లేదు. రాష్ట్రపతి పాలన విధించినా... శాసనభ రద్దు కాకుంటే చీఫ్ విప్ పదవి ఉంటుంది. శాసనసభను రద్దు చేస్తే మాత్రం గండ్ర పదవి కూడా పోతుంది. రాష్ట్రపతి పాలనపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలతోనే దీనిపై స్పష్టత రానుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top