దేవుడి భూములతోనూ రాజకీయాలు

Politics also with Gods lands - Sakshi

ఓట్ల కోసం 30 వేల ఎకరాల దేవుడి భూమికి టీడీపీ సర్కార్‌ ఎసరు

ఆక్రమణలను క్రమబద్ధీకరిస్తామంటూ ఎన్నికల ముందు హడావుడిగా జీవోలు

దేవుడి భూమిని ఇష్టానుసారంగా కట్టబెట్టకూడదని హైకోర్టు ఆంక్షలు

అయినా లెక్కచేయని టీడీపీ ప్రభుత్వం 

సీఎం సన్నిహితుడు పోటీ చేయనున్న భీమిలి పరిధిలోని రూ.2,232 కోట్ల విలువైన దేవుడి భూమి క్రమబద్ధీకరణకు నిర్ణయం

సమస్య పరిష్కరించినందున ఓట్లన్నీ టీడీపీకే వేయాలంటూ ఆ పార్టీ నేతల హుకుం

హైకోర్టు ఆంక్షల నేపథ్యంలో ఈ జీవోలు చెల్లుబాటు కావంటున్న అధికారులు, నిపుణులు 

సాక్షి, అమరావతి: ఎన్నికలు దగ్గరపడేసరికి టీడీపీ ప్రభుత్వం దేవుడి భూములతోనూ రాజకీయం మొదలెట్టింది. ఓట్లకోసం ఏకంగా 30 వేల ఎకరాల దేవుడి భూములను ఎరగా వేస్తోంది. ఇందుకోసం హైకోర్టు ఆంక్షల్ని సైతం లెక్కచేయడం లేదు. ఆలయాల బాగోగుల కోసం ఎక్కడైనా తప్పనిసరి పరిస్థితిలో దేముడి భూములు అమ్మాల్సి వస్తే ప్రభుత్వం హైకోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అది కూడా బహిరంగవేలంలో మాత్రమే వాటిని అమ్మాలంటూ హైకోర్టు గతంలో ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాల వల్లే ఇంతకాలం వీటి క్రమబద్ధీకరణ జరగలేదు. అంతకుముందు ప్రభుత్వాలు క్రమబద్ధీకరణకు అంగీకారం తెలిపినా హైకోర్టు వాటిని పెండింగ్‌లో పెట్టేసింది.

ఇలా ఆమోదం తెలుపుకుంటూ పోతే రాష్ట్రంలో దేవుడి భూమి కింద ఒక్క ఎకరా కూడా మిగలదన్నది హైకోర్టు అభిప్రాయం. అయితే.. రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం వీటిని ఏమాత్రం లెక్కచేయకుండా ముందుకెళ్తోంది. ముఖ్యంగా విశాఖ జిల్లా భీమిలి పరిధిలోని సింహాచలం భూములను ఓటర్లకు ఎరగా వేస్తోంది. ఇక్కడి నుంచి సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి పోటీ చేస్తారంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే హైకోర్టు ఆంక్షల వల్ల ఈ నిర్ణయాలు చెల్లుబాటు కావని.. కేవలం ఓటర్లను మభ్యపెట్టేందుకే ప్రభుత్వం ఇలా చేస్తోందంటూ అధికారులు, న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

పుష్పగిరి పీఠం భూములూ వదల్లేదు..
కడపకు చెందిన పుష్పగిరి పీఠానికి నరసరావుపేట నియోజకవర్గం లింగంగుంట్లలోనూ, చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలంలోనూ రెండు వేల ఎకరాలున్నాయి. లింగంగుంట్లలోని పుష్పగిరి పీఠం భూముల్లో అనధికారికంగా ఇళ్లు నిర్మించుకున్న వారికి ఆ భూములను రిజిస్ట్రేషన్‌ చేయిస్తానని.. లబ్ధిపొందిన వారంతా 2019 ఎన్నికల్లో టీడీపీకే ఓటు వేయాలని కోడెల శివప్రసాదరావు అక్కడి స్థానిక పెద్దలతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించి కోడెల శివప్రసాదరావు గతంలో అప్పటి దేవదాయ శాఖ కమిషనర్‌ అనురాధతో సమావేశాలు నిర్వహించగా, ఆ భూముల రిజిస్ట్రేషన్‌కు నిబంధనలు అంగీకరించవని ఆమె తేల్చిచెప్పారు. ఎన్నికలు ముంచుకొచ్చేసరికి దేవదాయ శాఖ కమిషనర్‌ కార్యాలయంతో సంబంధం లేకుండా జీవో విడుదల చేయించారు. ఇప్పటికే సింహాచలం భూముల్లోని అనధికారిక కట్టడాల క్రమబద్ధీకరణ అంశం ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉండగా, ఇప్పుడు లింగంగుంట్ల భూములను హైకోర్టు అనుమతి తీసుకొని క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. అయితే ఇందుకు హైకోర్టు అనుమతిచ్చే అవకాశం లేదని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. 

సీఎం సన్నిహితుని కోసం 490 ఎకరాలు ఎర... 
చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిని విశాఖ జిల్లా భీమిలి నుంచి పోటీ చేయించాలని నిర్ణయించినందున.. ఎలాగైనా ఆయన్ను గెలిపించేందుకు టీడీపీ ప్రభుత్వం దేవుడి భూములను ఎర వేస్తోంది. భీమిలితోపాటు పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని రూ.2,232 కోట్ల విలువైన దాదాపు 490 ఎకరాల సింహాచలం భూముల క్రమబద్ధీకరణకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే విశాఖ జిల్లా సింహాచలం లక్ష్మీనృసింహస్వామి ఆలయ భూముల్లో 12,149 మంది ఇళ్లు నిర్మించుకోగా.. వాటిని క్రమబద్ధీకరించేందుకు 2008లో అప్పటి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ముందుకురాగా.. కోర్టు ఆంక్షల వల్ల అది ఆగిపోయింది. 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక మంత్రివర్గంలో దీనిపై నిర్ణయం తీసుకొని హైకోర్టు అనుమతి కోరగా.. న్యాయస్థానం ఇంకా నిర్ణయం ప్రకటించలేదు.

దేవుడి భూములను ఇతరులకు కట్టబెట్టే అధికారాన్ని ప్రభుత్వానికి కల్పిస్తూ రాష్ట్ర శాసనసభ 1987లో చేసిన చట్టం చెల్లదంటూ హైకోర్టు 2005లో స్పష్టం చేసింది. మళ్లీ ఇప్పుడు అదే అధికారాన్ని శాసనసభ ద్వారా ప్రభుత్వానికి కల్పించుకుంటూ సింహాచలం భూముల క్రమబద్ధీకరణకు టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే గత ఆదేశాల నేపథ్యంలో ఈ నిర్ణయం చెల్లుబాటు కాదని అధికారులు, న్యాయ నిపుణులు చెబుతున్నారు. క్రమబద్ధీకరణ పేరుతో ప్రభుత్వం ఆయా భూములు అనుభవిస్తున్న వారి నుంచి డబ్బులు వసూలు చేయాలని చూస్తోందని.. భవిష్యత్‌లో దీనిపై హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేస్తే వారంతా ఆర్థికంగా నష్టపోతారని వారు అభిప్రాయపడుతున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top