మారిన పోలీస్ వ్యూహం! | Police turned the strategy! | Sakshi
Sakshi News home page

మారిన పోలీస్ వ్యూహం!

Jun 2 2016 1:51 AM | Updated on Oct 9 2018 2:47 PM

మావోయిస్టులను దెబ్బతీయడంలో పోలీసులు తమ వ్యూహాన్ని మార్చారు. కూంబింగ్ ద్వారా నేరుగా అన్నలను ఎదుర్కోవడం కంటే ....

మావోయిస్టు ఉద్యమాన్ని దెబ్బతీసే ప్రయత్నం
నేరుగా ఎదుర్కోవడం  కంటే నైతికంగా కుంగ దీయడంపైనే దృష్టి
దళ సభ్యులనే పావులుగా వాడుకుంటున్న ఖాకీలు

 

మావోయిస్టులను దెబ్బతీయడంలో పోలీసులు తమ వ్యూహాన్ని మార్చారు. కూంబింగ్ ద్వారా నేరుగా అన్నలను ఎదుర్కోవడం కంటే ఉద్యమాన్ని నైతికంగా దెబ్బతీసే ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీంట్లో భాగంగా ఇప్పటికే ముఖ్యనేతలు లొంగిపోయేలా చేయడంతో పాటు మిగిలి ఉన్న నాయకులపై దళ సభ్యుల్లో  వ్యతిరేకత వచ్చేలా ప్రచారం  చేస్తున్నారు. దీని కోసం  లొంగిపోతున్న దళ సభ్యులనే పావులుగా వాడుకుంటున్నారు.

 

విశాఖపట్నం:     ఇటీవల మావోయిస్టు అగ్ర నేతలు అనారోగ్యం, ఎన్‌కౌంటర్ల వల్ల  వరుసగా కన్నుమూశారు. ఆజాద్, కుడుముల రవి వంటి అత్యంత ముఖ్య నాయకత్వాన్ని దళం కోల్పోయింది. దీంతో ఏవోబీలో మావోయిస్టు ఉద్యమానికి నాయకత్వ లోపం ఏర్పడింది. దీనిని తమకు అనులంగా మార్చుకోవాలనుకున్న పోలీసులు వేగంగా పావులు కదిపారు. కొత్త ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ రాగానే మన్యంలో రహస్యంగా పర్యటించారు. మావోయిస్టు ఏరియా కమిటీ మెంబర్ వంతల వసంతను ఈ నెల 23న పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా మావోయిస్టు మహిళ కంపెనీ తొలి కమాండర్ సరితతో పాటు కోరుకొండ ఏరియా కమిటీ కమాండర్ బోనంగి రాములమ్మ, దళ సభ్యురాలు విజయలను లొంగిపోయేలా చేశారు. గత నెల 19నే దళం నుంచి తమకు తాముగా బయటకు వచ్చామని  సరిత, రాములమ్మ  చెబుతున్నారు. కాని వారి కుటుంబ సభ్యుల సహకారంతో పోలీసులే బయటకు తీసుకువచ్చినట్లు సమాచారం. వీరిని తమ అదుపులో ఉంచి ఉద్యమానికి సంబంధించి కీలక సమాచారం తెలుసుకున్నారు.  వీరి ద్వారా కేడర్‌లో కొందరిని సంప్రదించి, వారూ లొంగిపోయేలా ప్రభావితం చేశారు. త్వరలోనే మరి కొందరు తమకు లొంగిపోయేలా సన్నాహాలు పూర్తిచేశారు. ఉద్యమాన్ని పునఃనిర్మించాలని కేంద్ర నాయకత్వం భావిస్తున్న తరుణంలో అసలు ఉద్యమమే అనవసం అనే సంకేతాలను దళంలో బలంగా చొప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దానిలో భాగంగానే తమకు లొంగిపోయిన మావోయిస్టుల చేతే చలపతిపై ఆరోపణలు చేయిస్తున్నారని తెలిసింది. అదీ మహిళల చేత చెప్పించడం ద్వారా ఉద్యమంలోకి కొత్తగా వెళ్లాలనుకునే వారికి హెచ్చరికలు జారీ చేసినట్లయింది. దీంతో కేడర్‌ను పెంచుకోవాలనుకుంటున్న కేంద్ర కమిటీకి దెబ్బకొట్టినట్లయింది. 

 

చలపతి పద్ధతి బాగోలేదు
మావోయిస్టు నేతలు కుడుముల రవి, గణేష్ వంటి వారు మా సమస్యలను అర్థం చేసుకునేవారు. ఇప్పుడున్న చలపతి కేడర్‌తో మంచిగా ఉండటం లేదు. ఏమీ పట్టించుకోవడం లేదు. ఏదైనా అతను చెప్పే విధానం సరిగ్గా ఉండదు. కేంద్ర కమిటీకి కూడా అతనిపై చాలా సార్లు ఫిర్యాదు చేశాం.  ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆజాద్ చనిపోయిన తర్వాత  నాయకత్వ లోపం కనిపించింది. నాలాగే చాలా మంది చలపతితో విభేదించి లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే మావోయిస్టులు కిశోర్, నాగేశ్వరావు ఉద్యమం నుంచి బయటకు వచ్చి తమ ఇళ్లల్లో ఉంటున్నారు.  - కుడబాల లక్ష్మి ఎలియాస్ సరిత, మావోయిస్టు డిప్యూటీ కమాండర్

 

సరైన నాయకత్వం లేదు
మావోయిస్టు ఉద్యమానికి సరైన నాయకత్వం లేదు. కనీసం దళ సభ్యుల బాగోగులు చూసేవారు లేరు.అనారోగ్యం వస్తే వైద్యం కూడా చేయించడం లేదు. ప్రజలు కూడా వారికి సహకరించడం లేదు. పోరాటం చేయడానికి బాక్సైట్ తప్ప మరో సమస్య వారికి కనిపించడం లేదు. అంతేకాకుండా ఉన్న నాయకుల నుంచి ఆదరణ కరువైంది. నిర్బంధం ఎక్కువైంది. మా నుంచి కూడా వారికి ప్రమాదం పొంచి ఉంటోంది. ఈ నేపధ్యంలో లొంగిపోవడం తప్ప దళంలో ఉన్నవారికి మరో మార్గం కనిపించడం లేదు. అందుకే మా సిబ్బంది సహకారంతో లొంగిపోతున్నారు.   - రాహుల్‌దేవ్ శర్మ, జిల్లా ఎస్పీ

 

Advertisement
 
Advertisement
Advertisement