హత్య పథకం భగ్నం

Police Arrest Murder Plan Gang In Guntur - Sakshi

రెక్కీ చేస్తున్న ఐదుగురి అరెస్ట్‌

సాక్షి, గుంటూరు: పాత కక్షల నేపథ్యంలో ఓ వ్యక్తిని హత్య చేసేందుకు రెక్కీ నిర్వహిస్తున్న ఐదుగురు నిందితులను లాలాపేట పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం ఈస్ట్‌ డీఎస్పీ కె.సుప్రజ, ఎస్‌హెచ్‌ఓ ఫిరోజ్‌ నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బసవల వాసు హత్య కేసులో నిందితుడైన చగోడి సతీష్‌ని హత్య చేసేందుకు బసవలవాసు అనుచరులు పథకం రచించారు. పథకం ప్రకారం సతీష్‌ కదలికలపై నిఘా పెట్టారు. మూడు సార్లు మూడు వేర్వేరు ప్రాంతాల్లో సతీష్‌ను  హత్య చేసేందుకు ప్రయత్నించారు. ప్రయత్నాలు విఫలం కావడంతో రెండు నెలల క్రితం రౌడీషీటర్‌ కుక్కల శివను నిందితులు సంప్రదించి సహాయం కోరారు. కుక్కల శివ అరెస్టు కావడంతో నిందితులు గుజ్జనగుండ్లకు చెందిన ఆరాధ్యుల సుధీర్, పాతగుంటూరు చెందిన పి. మోహన్‌సాయికృష్ణ, అరండల్‌పేటకు చెందిన గజ్జల శివరామకృష్ణ, పాతగుంటూరుకు చెందిన తొరటి సాగర్, షేక్‌లాజర్‌లు హత్య చేసేందుకు అవసరమైన డబ్బు సమకూర్చుకోవడానికి గంజాయి వ్యాపారం ప్రారంభించారు.

విశాఖపట్నం నుంచి గంజాయిని కొనుగోలు చేసి గుంటూరు తెప్పించారు. కొంత విక్రయించారు. మిగిలిన గంజాయి విక్రయించే క్రమంలో ఉండగా, లాలాపేట పోలీసులు బుధవారం నిందితులను ఏటుకూరు బైపాస్‌ సమీపంలో పొలాల్లో అరెస్టు చేశారు. హత్య చేసేందుకు సిద్ధం చేసుకున్న ఐదు వేటకొడవళ్ళు, నాలుగున్న కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. అయితే విచారణలో నిందితులు డబ్బు కోసం దారిదోపిడిలకు పాల్పడినట్లు నిర్ధారణ అయింది. డీఎస్పీ సుప్రజ మాట్లాడుతూ గంజాయి, మత్తు పదార్థాలకు బానిసలై అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే నిందితుల సమాచారం తమకు ఇవ్వాలని కోరారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top