హమ్మయ్య...గండం గడిచింది

Peoples Protests in Janmabhoomi Maa vooru Programme - Sakshi

ఊపిరి పీల్చుకున్న అధికారులు

నిరసనల మధ్య ముగిసిన ఆరో విడత జన్మభూమి

గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజా వ్యతిరేకత

మంత్రి నారా లోకేష్‌కు చేదు అనుభవం

చాలీచాలని నిధులతో ఇబ్బంది పడిన క్షేత్రస్థాయి అధికారులు

చేతి చమురు వదిలించుకున్న దుస్థితి

సాక్షి ప్రతినిధి, కాకినాడ :  అధికారులకు గండం గడిచింది. ఆరో విడత జన్మభూమి ఎట్టకేలకు ముగిసింది. ఆద్యంతం నిరసనల మధ్య సాగింది. మొత్తానికి నెట్టుకొచ్చామని అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. మునుపెన్నడూలేని విధంగా జన్మభూమి గ్రామసభల్లో ప్రజలు పెద్ద ఎత్తున నిలదీశారు. పలుచోట్ల సభలను ఏకంగా బహిష్కరించారు. మరికొన్నిచోట్ల అధికారులను గ్రామాల్లోకి రాకుండా అడ్డుకున్నారు. గతంలో వచ్చిన అర్జీలకు సమాధానం చెప్పలేక అధికారులు ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వం నుంచి పరిష్కారం కాక, అర్జీదారులకు నచ్చచెప్పలేక నలిగిపోయారు. ఎంపీపీల దగ్గరి నుంచి ఎమ్మెల్యేలు, మంత్రుల వరకు నిలదీతకు గురయ్యారు.

చేతి చమురు వదిలించుకున్న అధికారులు
జన్మభూమి కార్యక్రమానికి అరకొర నిధులు విడుదల చేసి చేతులు దులుపుకొంది. అవి ఏమాత్రం సరిపోలేదు. అట్టహాసంగా నిర్వహించాలని, భారీగా జన సమీకరణ చేయాలని అధికారుల మెడపై కత్తి పెట్టింది. కానీ, ఆ స్థాయిలోనిధుల్లేక అధికారులు ప్రస్తుతానికి చేతి చమురు వదిలించుకున్నారు. మున్ముందు వాటి కోసం ఏ అడ్డదారులు తొక్కుతారో చూడాలి. ఒక్కో పంచాయతీకి రూ. 2 వేలు చొప్పున కేటాయించింది. అవి కూడా ఎంపీడీఓల ఖాతాల్లోనే ఉన్నాయి. క్షేత్రస్థాయికి చేరలేదు. వాస్తవానికైతే, ఒక్కో గ్రామసభ నిర్వహణకు రూ. 33వేలు ఖర్చయింది. మంత్రులు హాజరైతే దానికి రెట్టింపు ఖర్చయింది. దీనిబట్టి మిగతా సొమ్ము ఎవరు పెట్టుకున్నారన్నది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రస్తుతానికైతే ఆ భారమంతా క్షేత్రస్థాయి అధికారులపైనే పడింది. భవిష్యత్తులో వాటిని ఏ రకంగా  సమకూర్చుకుంటారో చూడాలి.

చివరి రోజూ తప్పని నిరసనలు
ఆరో విడత జన్మభూమి కార్యక్రమం చివరి రోజునా నిరసనలు తప్పలేదు. ఎంత వేగంగా ముగిసిపోతుందా అని అధికారులు ఆత్రుత కనబరిచారు. ఎక్కడికక్కడ నిలదీత, ప్రశ్నించడంతో ఉక్కిరిబిక్కిరయ్యారు.

మరుగుదొడ్ల అవినీతిపై నిలదీత
కిర్లంపూడి మండలం జగపతినగరంలో అధికారులను సమస్యలపై స్థానిక ప్రజలు నిలదీశారు. గ్రామ పంచాయతీలో నిర్మించిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో అవినీతి జరిగింది. దీనిపై విచారణ చేపట్టి మధ్యలో ఆపేశారు. దీనిలో తెలుగుదేశం పార్టీ నాయకుల పాత్ర ఉండడంవల్లే ఆపేశారా? అని స్థానికులు ప్రశ్నించారు. టీడీపీ నాయకుడు, కిర్లంపూడి ప్రభుత్వాస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు ఎడ్ల కృష్ణ ఎన్‌జీవో పేరుతో ఎటువంటి మరుగుదొడ్లు నిర్మించకుండానే ఎలా నిధులు మంజూరు చేశారని జెడ్పీటీసీ వీరంరెడ్డి కాశిబాబును నిలదీయడంతో చాలాసేపు జన్మభూమి సభ నిలిచిపోయింది. కొంత సమయం తరువాత జెడ్పీటీసీ మాట్లాడుతూ విచారణ చేయిస్తామని హామీ ఇవ్వడంతో జన్మభూమి సభ సజావుగా సాగింది.

కాకినాడ రూరల్‌లో చిన్నారులకు తిప్పలు
కాకినాడ రూరల్‌ మండలం రమణయ్యపేటలోని స్పందన ఫంక్షన్‌ హాలులో జన్మభూమి సభను నిర్వహించారు. ఈ సభలో పంచాయతీ కార్యదర్శులకు, అధికారులకు మెమెంటోలను పంపిణీ చేస్తుండగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రచార ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మిని, అధికారులను నిలదీశారు. ఇది ప్రభుత్వ కార్యక్రమమా? పార్టీ కార్యక్రమమా అని ప్రశ్నించారు. ఎంపీడీవో మాట్లాడుతూ ఇది ప్రభుత్వ కార్యక్రమం అని చెప్పారు. దీంతో రావూరి మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమమైతే ఈ మెమెంటోలు హడావుడి ఏమిటంటూ ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు రావూరి వెంకటేశ్వరరావును బయటకు గెంటుకుంటూ తీసుకుపోయారు. ఈ కార్యక్రమమంలో ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, పిల్లి సత్తిబాబుల మాస్క్‌లను స్కూల్‌  పిల్లలకు అలంకరించి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహింప చేయడం విమర్శలకు దారితీసింది.

మంత్రి లోకేష్‌కు చేదు అనుభవం
మంత్రి నారా లోకేష్‌ను ‘మంచినీటి సమస్యను పరిష్కరించరా?’ అంటూ జన్మభూమి గ్రామసభలో మహిళలు నిలదీశారు. పెద్దాపురం మండలం కట్టమూరులో నిర్వహించిన జన్మభూమి గ్రామసభకు హాజరైన మంత్రిలోకేష్‌ మాట్లాడుతూ అభివృద్ధి పనులను తెలియజేస్తుండగా, సభకు హాజరైన మహిళలు, స్థానికులు అడ్డుకున్నారు.  తమ ప్రాంతంలో ఏళ్లతరబడి తాగునీరు అందడంలేదని, గుక్కెడు నీటికోసం అష్టకష్టాలు పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.  ఏళ్ల తరబడి రోడ్లు ఛిద్రమై ఉన్నా పట్టించుకునేవారే లేరంటూ మంత్రి లోకేష్‌ను నిలదీశారు. అయినా మంత్రి లోకేష్‌ సర్దిచెప్పి మాట్లాడదామని చూసినప్పటికీ మహిళలు, స్థానిక యువకులు సమస్యలను ఏకరవుపెట్టడంతో మధ్యలో ప్రసంగాన్ని ఆపి కూర్చుండిపోయారు. దీంతో అధికారులు సమస్యలు పరిష్కరిస్తామంటూ సర్దిచెప్పినప్పటికీ మహిళలు వినకుండా సభ నుంచి వెనుతిరిగారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top