మా ఊరు.. నిరసనల హోరు | People Protests in Janmabhoomi Maa vooru Programme | Sakshi
Sakshi News home page

మా ఊరు.. నిరసనల హోరు

Jan 5 2019 1:33 PM | Updated on Jan 5 2019 1:33 PM

People Protests in Janmabhoomi Maa vooru Programme - Sakshi

ప్రొద్దుటూరులో జన్మభూమి సభలో మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిని నిలదీస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ మాజీ కౌన్సిలర్‌ గరిశపాటి లక్ష్మీదేవి

కడప అగ్రికల్చర్‌ : జిల్లాలో ఆరో విడత జన్మభూమి–మా ఊరు కార్యక్రమం మూడోరోజు అధికారులు నిర్వహించారు. గ్రామసభలకు వృద్ధులు, విద్యార్థులే దిక్కయ్యారు. వృద్ధులకు పింఛన్లు ఇస్తుండడంతో తప్పని పరిస్థితుల్లో వారు సభలకు వస్తున్నారు. పాఠశాలల ఆవరణలోనూ, సమీప గ్రామాల్లో సభలు ఉండడంతో వెలవెలపోకుండా విద్యార్థులను తీసుకొచ్చి కూర్చొబెడుతున్నారు. రైల్వేకోడూరు మండలంలోని చియ్యవరం పంచాయతీ ముత్తరాచుపల్లెలో పాఠశాల ప్రహారీకి కొందరు అడ్డుతగులుతున్నారని ఆరోపిస్తూ ఎంపీటీసీ రవి, పాఠశాల చైర్మన్‌ నేలపై బైఠాయించారు. దీంతో అధికారులు సర్దిచెప్పి ప్రహారీని తప్పకుండా నిర్మిస్తామని చెప్పారు. రాజంపేటలో కేవలం పింఛన్లు, చంద్రన్న కానుకలను పంపిణీ చేశారు. మైదుకూరు మండలం మిట్టమానుపల్లె గ్రామసభలో ప్రజలు రాక వెలవెలబోవడంతో అధికారులు ఆగమేఘాలపై బాలశివ జూనియర్‌ కళాశాల విద్యార్థులను పిలుచుకుని వచ్చి సభలో బలవంతంగా కూర్చొబెట్టారు.

ప్రొద్దుటూరులోని 10, 11 వార్డుల్లోని శ్రీరాములుపేటలో సభ నిర్వహించగా,  మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి సమయపాలన పాటించే తీరు తెలియదా? అని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సభలో మాజీ కౌన్సిలర్‌ గరికెపాటి లక్ష్మిదేవి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పేదలకు ఇదే వార్డులో ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇచ్చారని, అప్పుడు ఎమ్మెల్యేగా వరదరాజులరెడ్డి ఉన్నారన్నారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఇళ్ల పేరుతో పేదలను దోచుకోవడానికి సిద్ధమైందని ఆగ్రహం వ్యక్తం చేయగా, టీడీపీ నాయకులు అనవసర రాద్దాంతం చేశా>రు. జమ్మలమడుగులో రేషన్‌కార్డులు, పెన్షన్లు, ఇళ్ల స్థలాలు కావాలని అర్జీలు ఇచ్చారు. కడపలో నిర్వహించిన సభల్లో విద్యార్థులు, వృద్ధులే కనిపించారు. పులివెందుల నియోజకవర్గంలో నిర్వహించిన సభల్లో శ్వేతపత్రాలను అధికారులు చదివారు. పింఛన్లు, చంద్రన్న కానుకలను పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. బద్వేలులో నిర్వహించిన సభలో జేసీ కోటేశ్వరరావు పాల్గొన్నారు.గతంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలు కొండలు, గుట్టలమీద ఇచ్చారని, అవి ఎందుకూ పనికి రావని ప్రజలు అధికారులను నిలదీశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు పాల్గొని గతంలో ఇచ్చిన అర్జీలకే దిక్కులేదని ఆరోపించారు. కమలాపురం, రాయచోటి నియోజకవర్గాల్లో నిర్వహించిన సభల్లో పెన్షన్లు, కానుకల పంపిణీతో సరిపెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement