ఉయ్యూరు జన్మభూమి సభలో ఉద్రిక్తత | People Protest in Janmabhoomi Maa vooru Programme Krishna | Sakshi
Sakshi News home page

ఉయ్యూరు జన్మభూమి సభలో ఉద్రిక్తత

Jan 11 2019 12:27 PM | Updated on Jan 11 2019 12:27 PM

People Protest in Janmabhoomi Maa vooru Programme Krishna - Sakshi

ఉయ్యూరు జన్మభూమి సభలో మాజీ మంత్రి పార్థసారథితో ఎమ్మెల్యే బోడె, ఎమ్మెల్సీ వైవీబీల వాదులాట

కృష్ణాజిల్లా, ఉయ్యూరు(పెనమలూరు): ఉయ్యూరులో జన్మభూమి సభ రసాభాస అయ్యింది. ప్రజల సమస్యలపై వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేని ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌లు రగడ సృష్టించారు. ఈ క్రమంలో వైఎస్సార్‌ సీపీ, టీడీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే అసభ్యపదజాలంతో నోరుపారేయడంతో వైఎస్సార్‌ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజులపాటి రామచంద్రరావుతోపాటు పార్టీ శ్రేణులు ప్రతిఘటించడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది.

జవాబు చెప్పలేక.. గొడవ సృష్టించి..
పట్టణంలోని 15, 16,17 వార్డులకు సంబంధించి కాటూరు రోడ్డులోని ఓ పాఠశాల క్రీడా మైదానంలో గురువారం జన్మభూమి సభ నిర్వహించారు. మాజీ మంత్రి కొలుసు పార్థసారథి సభా ప్రాంగణానికి చేరుకున్నారు. తాను కేవలం ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చి వెళ్లిపోతానని, ఎలాంటి వివాదం ఉండదని అధికారులతోపాటు సీఐ కాశీవిశ్వనాథంతో పేర్కొన్నారు. అధికారులు, చైర్మన్‌లు పార్థసారథిని వేదికపైకి ఆహ్వానించి మాట్లాడాలని కోరారు. ఆయన జనం మధ్య నుంచే టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు, డ్వాక్రా రుణ మాఫీ, పంట నష్టం, అంశాలపై ప్రశ్నలు సంధించారు.

సహనం కోల్పోయిన ఎమ్మెల్యే
ఎమ్మెల్యే సహనం కోల్పోయి రామచంద్రరావుతోపాటు పార్టీ శ్రేణులను ఉద్దేశించి తీవ్రస్థాయిలో అసభ్యపదజాలంతో దూషించారు.  రాయడానికి వీలులేని పదజాలంతో ధూషించారు. మాజీ మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ఎమ్మెల్యేగా మంచి పద్ధతి కాదంటూ సూచిస్తున్నా పట్టించుకోకుండా దాడి చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో కుర్చీలు పైకిలేచాయి. పోలీసులు ఇరువర్గాలను నెట్టి పార్థసారథితోపాటు వైఎస్సార్‌ సీపీ శ్రేణులను సభా ప్రాంగణం నుంచి బయటకు పంపారు.

ఎమ్మెల్యే రాకతో రగడ
ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ వేదికపైకి రావడంతోనే మైక్‌ తీసుకుని పార్థసారథిని ఉద్దేశిస్తూ ఎద్దేవాగా మాట్లాడారు. అయినా సంయమనం పాటించి పార్థసారథి జీ+3 నిర్మాణాలపై ప్రజల్లో ఉన్న అనుమానాలను, అవినీతిని ప్రశ్నించారు. ఎమ్మెల్యే జోక్యం చేసుకోవడంతో వాదన మొదలైంది. ఈస్ట్‌ ఏసీపీ విజయభాస్కర్‌తోపాటు పోలీసులు వైఎస్సార్‌ సీపీ శ్రేణులను వేదికకు దూరంగా నెట్టివేస్తూ ప్రసంగానికి అడ్డుతగిలారు. పార్థసారథి పోలీసులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. టీడీపీ నాయకులు వేదికపైకి ఎక్కి నినాదాలు చేస్తూ కవ్వింపు చర్యలకు దిగారు. వైఎస్సార్‌ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజులపాటి రామచంద్రరావు మంచి పద్ధతి కాదంటూ హెచ్చరించారు. టీడీపీ శ్రేణులను కూడా వేదిక దింపి దూరంగా పంపాలని రామచంద్రరావు సూచించడంతో ఎమ్మెల్యే ఎద్దేవాగా వ్యాఖ్యానించడంతో వాదులాట చోటుచేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement