
అధికారులకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహిస్తున్న గ్రామస్తులు
ప్రకాశం, తర్లుపాడు: ‘మా సమస్యను పరిష్కరించాకే గ్రామానికి రండి. సమస్యను పరిష్కరించకుండా గ్రామసభ నిర్వహించి ఏం ఉపయోగం’ అని మండలంలోని మంగళకుంట గ్రామస్తులు అధికారులను అడ్డుకున్నారు. జన్మభూమి గ్రామసభలో భాగంగా అధికారులు మంగళవారం మంగళకుంటకు వచ్చారు. అయితే గ్రామసభ నిర్వహించకుండా గ్రామస్తులు అడ్డుకొని గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. టెంట్లు, కుర్చీలు ఏర్పాటు చేయకుండా అధికారుల ఎదుట నిరసన తెలియజేసి గ్రామసభను బహిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మంగళకుంట రెవెన్యూ ఇలాకాలో 208 సర్వే నంబర్‌లో 15 ఏళ్ల క్రితం మంగళకుంట, కొత్తూరు గ్రామాలకు 350 ఎకరాల పొలాన్ని ప్రతి ఇంటికి 5 ఎకరాలు చొప్పున పట్టాలు మంజూరు చేశారు.
అయితే ఇటీవల రెవెన్యూ అధికారులు కాసులకు కక్కుర్తిపడి అదే నంబర్‌లో సబ్ డివిజన్లు చేసి మండల, మండలేతరులకు, ధనికులకు ఆన్‌లైన్ చేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదు. దీంతో సహనం కోల్పోయిన గ్రామస్తులు మంగళవారం గ్రామసభను అడ్డుకున్నారు. గ్రామంలో గ్రామసభ నిర్వహించకుండా సహాయ నిరాకరణ చేశారు. గ్రామానికి వచ్చిన అధికారులకు కుర్చీలు ఇవ్వకుండా నిరసన తెలియజేశారు. అధికారులు బయట నుంచి కుర్చీలు తెప్పించుకున్నా వాటిని కూడా తీసేసి గ్రామం నుంచి వెళ్లిపోవాలని మండిపడ్డారు. సమస్యలను పరిష్కరించినప్పుడే మా ఊరికి రండని తేల్చి చెప్పారు. ఎన్నో ఏళ్లుగా గ్రామాన్ని కనిపెట్టుకుని ఉన్న గ్రామస్తులను కాదని రెవెన్యూ అధికారుల ఇష్టప్రకారం పొలాలు పంపిణీ చేసే హక్కు ఎక్కడుందని ప్రశ్నించారు. అక్రమంగా భూములను ఆన్‌లైన్ చేసిన అధికారులపై చర్యలు తీసుకుని పేదలకు పంపిణీ చేసిన తర్వాత గ్రామానికి రావాలని తెలిపారు. అధికారులు ఎంత ప్రాధేయపడినా గ్రామస్తులు జన్మభూమి సభకు హాజరుకాలేదు. దీంతో అధికారులు చేసేది లేక గ్రామం నుంచి తిరుగుముఖం పట్టారు.
వృద్ధులతో గ్రామసభ నిర్వహణ: సొమ్మసిల్లి పడిపోయిన వృద్ధుడు
కందుకూరు రూరల్: జన్మభూమి గ్రామ సభలకు ప్రజల స్పందన కరువైంది. సభలకు ప్రజలెవ్వరూ హాజరుకాకపోవడంతో వృద్ధులు, పాఠశాల విద్యార్థులను తీసుకువచ్చి సభను ముగిస్తున్నారు. మండలంలోని బలిజపాలెం, కమ్మవారిపాలెం గ్రామాల్లో మంగళవారం గ్రామసభలు నిర్వహించారు. బలిజపాలెంలో జరిగిన గ్రామసభకు ఎమ్మెల్యే పోతుల రామారావు హాజరయ్యారు. గ్రామసభలో ప్రజలను చూపించేందుకు నాయకులు, అధికారులు నానా ఇబ్బందులు పడ్డారు. వృద్ధులు, వితంతువులకు గ్రామసభ వద్దే పింఛన్లు ఇస్తామని చెప్పడంతో వారంతా గ్రామసభకు వచ్చారు. పింఛన్ తీసుకున్న వారంతా గ్రామ సభలోనే ఉండాలని అధికారులు చెప్పడంతో వారంతా గంటల తరబడి వేచి ఉన్నారు. దీంతో గ్రామసభ జరుగుతున్న సమయంలోనే జి.నరసింహం అనే వృద్ధుడు సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో అతన్ని వెంటనే ఇంటికి తీసుకెళ్లి వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. గ్రామసభలో బలవంతంగా వృద్ధులను కూర్చోబెట్టడం ఏంటని గ్రామస్తులు ప్రశ్నించారు.