మోడీని ప్రజలు విశ్వసించడంలేదు | People not believe the narendra modi | Sakshi
Sakshi News home page

మోడీని ప్రజలు విశ్వసించడంలేదు

Apr 29 2014 12:18 AM | Updated on Mar 29 2019 9:24 PM

ఎన్నికల్లో ప్రజలు సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్‌కే ఓటు వేసి గెలిపించాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు.

జహీరాబాద్, న్యూస్‌లైన్: ఎన్నికల్లో ప్రజలు సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్‌కే ఓటు వేసి గెలిపించాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు. సోమవారం జహీరాబాద్‌లోని సుభాష్ గంజ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ  ప్రధాని కావాలని కలలు కంటున్న బీజేపీ నేత నరేంద్రమోడీని ప్రజలు ఏ మాత్రం విశ్వసించడం లేదన్నారు. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలేనన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలంతో దేశాన్ని ఏలాలని చూస్తున్న ఆయనను ప్రజలు ఏ మాత్రం సమర్థించరన్నారు. మత తత్వ పార్టీ అయిన బీజేపీని ప్రజలు దూరం పెట్టాలని కోరారు.

 తమ పార్టీ పేదల పక్షాన ఉంటే బీజేపీ పెట్టుబడీ దారులకు అండగా ఉంటోందన్నారు.  దేశంలో పేదరిక నిర్మూలన కోసం తమ పార్టీ ప్రధాన మంత్రులుగా పని చేసిన వారు ఎంతో పాటు పడ్డారన్నారు. పేదలు, రైతులు, రైతు కూలీలు, మహిళలు, యువకులు, వృద్ధులను దృష్టిలో పెట్టుకుని తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. దళితులు, బడుగు వర్గాల అభ్యున్నతి కోసం ప్రత్యేకంగా పాటు పడుతోందన్నారు.

 మోడీకి విశ్వసనీయత లేదు
 నరేంద్ర మోడీకి  ఏమాత్రం విశ్వసనీయలేదని  ఆజాద్ పేర్కొన్నారు. తన గురువు అద్వానీని అణగదొక్కారని, మురళీ మనోహర్ జోషీ ఎంపీ సీటును లాక్కున్నారని, జశ్వంత్‌సింగ్‌ను  పార్టీ నుంచే సాగనంపారన్నారు. చివరకు పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ను కూడా కట్టడి చే శారన్నారు.

 విభజనను అడ్డుకున్న కిరణ్
 ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఘనత తమ పార్టీ అధినేత సోనియా గాంధీకే దక్కిందన్నారు. రాష్ట్ర విభజనను మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అడ్డుకున్నా ఇచ్చి తీరామన్నారు.  రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన కిరణ్‌కుమార్‌రెడ్డి అడ్రస్సును ప్రస్తుతం వెతుక్కుంటున్నారన్నారు. ఆయన తనకు తాను బలవంతుడనుకొని భ్రమపడ్డారన్నారు. పార్టీ ముందు అంతా తక్కువేనన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదమన్నారు.

 టీఆర్‌ఎస్ కుటుంబ పార్టీ
 తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ఒక కుటుంబ పార్టీగా మారిందని గులాం నబీ అజాద్ విమర్శించారు. అధికారం వారి చేతికి వస్తే రాష్ట్రం దోపిడీకి గురవుతుందన్నారు.  ఆ పార్టీకి అధికారం ఇస్తే తెలంగాణ అభివృద్ధి కాదన్నారు.

 టీడీపీని నమ్మవద్దు
  బీజేపీతో జతకట్టి ఎన్నికల్లో పోటీకి దిగిన తెలుగుదేశం పార్టీని ఏమాత్రం నమ్మవద్దని ఆజాద్ పేర్కొన్నారు. ఆ పార్టీ గతంలో ఎన్‌డీఏ ప్రభుత్వానికి మద్దతిచ్చి సెక్యులరిజాన్ని తుంగలో తొక్కిందన్నారు. ఇప్పుడు తిరిగి అదే పార్టీతో జతకట్టినందున దూరం పెట్టాలన్నారు.  సమావేశంలో డీసీసీబీ చెర్మైన్ ఎం.జైపాల్‌రెడ్డి, ఆత్మ చెర్మైన్ శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ వసంత్, మంకాల్ సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

 మళ్లీ కాంగ్రెస్‌కే అధికారం
 సిద్దిపేట జోన్:  దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని  గులాంనబీ ఆజాద్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం మెదక్ జిల్లా సిద్దిపేటలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ  తెలంగాణ ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సోనియాగాంధీ జాతీయ పార్టీలను ఒప్పించి రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేశారన్నారు.  తెలంగాణలో కేసీఆర్ ప్రాబల్యం నామమాత్రమేనన్నారు. దేశంలో నరేంద్రమోడీ హవా కొనసాగుతున్నట్లు జరుగుతున్న ప్రచారం సోషల్ మీడియా సృష్టిగా ఆయన అభివర్ణించారు. మోడీ గాలి కేవలం అకాశంలోనే నడుస్తోంది తప్ప భూమిమీద కాదని చమత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement