అంతా ఆయనే చేశారు! | Sakshi
Sakshi News home page

అంతా ఆయనే చేశారు!

Published Fri, Sep 29 2017 8:48 AM

PDCCB directors series on edara mohan babu

ఒంగోలు : పీడీసీసీ బ్యాంకు చైర్మన్‌ ఈదర మోహన్‌బాబుపై బ్యాంక్‌ డైరెక్టర్లు తాజాగా 27 అంశాలకు సంబంధించి విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. ఈ మేరకు గురువారం మీడియా కార్యాలయాలకు ఓ ప్రకటన విడుదల చేశారు. వైస్‌ చైర్మన్‌ కండే శ్రీనివాసరావు, డైరెక్టర్లు ఆర్‌.వెంకట్రావు, చిడిపోతు మస్తానయ్య, గండికోట చినవీరయ్య, జాగర్లమూడి యలమందరావు, కె.మురహరి, మేణావత్‌ హనుమాన్‌నాయక్‌ సంతకాలతో ఈ ప్రకటన జారీ అయింది.  

ఆరోపణల్లో ముఖ్యమైనవి..
తన ఇష్టానికి అనుకూలంగా వ్యవహరించడం లేదంటూ 8 మంది బ్యాంకు సీఈఓలను మార్చారు.
బ్యాంకులో లాకర్లు, సేఫ్‌ డోర్లు నాణ్యమైనవి కొనుగోలు చేయాల్సి ఉండగా నాసిరకంవి కొని నాణ్యమైన వాటి ధరకన్నా అధిక మొత్తం చెల్లించారు.
బ్యాంకు స్టాండింగ్‌ కౌన్సిల్‌లో సొంత మనిషిని నియమించుకుని వారి ద్వారా.. సిరి ఇన్‌ఫ్రా అనే డొల్ల కంపెనీ స్థాపించి బ్యాంకులో అన్ని రకాల కొనుగోళ్లు, లోన్లకు సంబంధించి లీగల్‌ ఒపీనియన్‌ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.
బ్యాంకు స్టాండింగ్‌ లాయర్‌ లీగల్‌ ఒపీనియన్‌కు నిర్ణయించిన ధర కంటే అధిక మొత్తం చార్జీల కింద వసూలు చేశారు.
సంఘంలో అవుట్‌ స్టాండింగ్‌కు తగ్గ షేరు ధనం మాత్రమే బ్యాంకు వారు వసూలు చేయాల్సి ఉండగా అందుకు భిన్నంగా సంఘ పరిస్థి«తులను బట్టి 2017 మార్చిలో రూ.5 నుంచి రూ.10 లక్షల షేరు ధనం వసూలు చేశారు.
బంగారు వేలం నోటీసులు ఓ పత్రికకు ఎక్కువ మొత్తంలో ఇచ్చి, అదే పత్రికకు సంవత్సర చందాలు కట్టాలని సొసైటీలపై ఒత్తిడి చేశారు.
బ్యాంకు ఉద్యోగులకు అరియర్స్, జీతాలు ఇచ్చే విషయంలోనూ, స్వల్పకాలిక రుణాల మంజూరు విషయంలో, బ్యాంకు ఉద్యోగులకు వయోపరిమితి సడలించే విషయంలో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుంది.
నగదు కౌంటింగ్‌ మెషీన్లను రిపేరు చేయించకుండా కొత్తవి కొనుగోలు చేయడంలోనూ రూ.60 లక్షలు చేతులు మారింది.
బ్యాంకులో సిబ్బంది ఉన్నప్పటికీ వారిని కాదని రిటైరైన ఉద్యోగులను నియమించడం ద్వారా లక్షలాది రూపాయలు దుర్వినియోగమయ్యాయి.  
2016 ఏప్రిల్‌లో సంఘాల ద్వారా బ్యాంకులో చేర్చుకున్న సిబ్బంది నియమ నిబంధనలు లేకున్నా వారికి తప్పుడు ధ్రువీకరణలతో అవకాశం కల్పించారు.
బ్యాంకు పాలన నాబార్డు, ఆర్‌బీఐ, ఆర్‌సీఎస్‌ వారి సూచనలకు లోబడి, బ్యాంకు బైలాలకు లోబడి నడపాల్సి ఉండగా ఇష్టానుసారంగా వ్యవహరించారు. అందువల్ల బ్యాంకులో జరిగిన చట్టవ్యతిరేక పనులను పాలకవర్గం ఆమోదించలేదు. ఆ విషయాలకు తాము బాధ్యులం కాదు.
ఇందిరాదేవి సెక్షన్‌ 52 కింద జరిపిన గోల్డ్‌లోన్‌ విచారణ నివేదిక లోపభూయిష్టంగా ఉంది. ఇంతవరకు గోల్డు లోన్‌ ద్వారా జరిగిన నష్టం వసూలు చేయలేదు.  
ఒంగోలు డీసీఎంఎస్‌ వారు బ్యాంకుకు చెల్లించాల్సిన రుణం వేలానికి వచ్చి పెండింగ్‌లో ఉండగా ఐసీడీపీ ద్వారా రూ.25 లక్షలు మంజూరు చేయించారు.
తారకరామ డెయిరీ నుంచి ఎన్‌పీఏ మొత్తం వసూలు చేయకుండా ఒన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌కు అవకాశం కల్పించి వాయిదా వేశారు.
స్టడీ టూర్ల పేర్లతో లక్షలాది రూపాయల దుర్వినియోగం జరిగింది. ఒక్క స్టడీ టూరు కూడా బ్యాంకుకు మేలు చేయలేదు. అన్ని విహార యాత్రలుగానే మిగిలాయి.
గుంటూరు పాలకవర్గ సమావేశంలో పాలకవర్గ ధన దుర్వినియోగాలపై జరిగిన విచారణ నివేదిక ద్వారా పాలకవర్గ సభ్యులను బాధ్యులను చేయడం వల్ల.. తాము కూడా అలా బాధ్యులం కాగలమని భావించి మోసపూరిత అంశాలను కనుగొన్నాం. బ్యాంక్‌ చైర్మన్‌పై తమ నమ్మకం వమ్ము అయింది.

Advertisement
 
Advertisement