ఆగ్రో కంపెనీని మూయించాల్సిందే | Sakshi
Sakshi News home page

ఆగ్రో కంపెనీని మూయించాల్సిందే

Published Tue, May 14 2019 12:58 PM

Pandrangi Villagers Demand on Ban Agro Company - Sakshi

పద్మనాభం(భీమిలి):  పాండ్రంగిలో ఉన్న లైఫ్‌లైన్‌ ఆగ్రో ప్రొడక్టు కంపెనీని మూయించాలని గ్రామస్తులు చేపట్టిన ఆందోళన తీవ్ర స్థాయికి చేరింది. ఇప్పటికే పలు రూపాల్లో నిరసన తెలిపిన గ్రామస్తులు సోమవారం కంపెనీ ఎదుట బైటాయించారు.తమకు తాగునీరు లేకుండా చేస్తున్న కంపెనీని మూయించాల్సిందేనని పట్టుబట్టారు. యాజమాన్యానికి కొమ్ముకాయకుండా ప్రజల ఇబ్బందులను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.ఈ సమయంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. గ్రామస్తులు కంపెనీలోకి దూసుకు పోవడానికి ప్రయత్నించడంతో పోలీసులు నిలువరించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ పోలీసులు తమ గొంతు నొక్కాలని చూస్తున్నారని  ఆరోపించారు. ఆరోపించారు. మహిళలు అని చూడకుండా బలవంతంగా నెట్టేశారని అముజూరి ఆదిలక్ష్మి ఆరోపించారు.

ఉన్నతాధికారుల దృష్టికి సమస్య
ఆందోళన వద్దకు చేరుకున్న మధురవాడ ఏసీపీ ఎ.వి.ఎల్‌.ప్రసన్న కుమార్‌ మాట్లాడుతూ సమస్య ఉంటే శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించ కూడదన్నారు.  చట్టాన్ని చేతుల్లోకి తీసుకంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఏసీపీ ప్రజల అభిప్రాయాలు  తెలుసుకున్నారు. కంపెనీ పరిమితికి మించి భూగర్బ జలాలను తోడేయడంతో తమకు తాగు, సాగు నీటి కొరత ఏర్పడినందున కంపెనీని మూయించాలని ప్రజలు స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీఐ జి.శ్రీనివాసరావు, వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యదర్శి అముజూరి అప్పారావు, పాండ్రంగి మాజీ సర్పంచ్‌ పల్లి మహేష్‌ పాల్గొన్నారు.

కలెక్టర్‌కు వినతి
పాండ్రంగిలోని లైఫ్‌ లైన్‌ ఆగ్రో ప్రొడెక్టు కంపెనీని మూసివేయడానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ పాండ్రంగి ప్రజలు సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌కు వినతి పత్రం ఇచ్చారు. వైఎస్సార్‌ సీసీ జిల్లా కార్యదర్శి అముజూరి అప్పారావు, మాజీ సర్పంచ్‌ పల్లి మహేష్, మహంతి అప్పలనాయుడు  వినతి పత్రం ఇచ్చిన వారిలో ఉన్నారు.

ప్రజలను కొట్టలేదు
 మహిళలను  ఈడ్చుకు వెళ్లి  కొట్టామనడంలో వాస్తవం లేదు. గొడవను అడ్డుకోవడానికి రోప్‌ తేవడానికి వెళుతున్న పీఎంపాలెం ఎస్‌ఐ నిహార్, పద్మనాభం ఎస్‌ఐ రామమూర్తి, ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు,, ఒక మగ కానిస్టేబుల్‌పై ప్రజలే రాళ్లు విసిరారు. వీరిలో పద్మనాభం ఎస్‌ఐ రామమూర్తికి రాయి తగిలింది. –ఎ.వి.ఎల్‌.ప్రసన్నకుమార్, ఏసీపీ

Advertisement
Advertisement