రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన విషయంలో తెలుగుదేశం పార్టీని విమర్శించే నైతిక హక్కు ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి లేదని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు.
అనంతపురం: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన విషయంలో తెలుగుదేశం పార్టీని విమర్శించే నైతిక హక్కు ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి లేదని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. గురువారం ఆయన అనంతపురంలోని మునిసిపాలిటీ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. ఐదు కోట్ల మంది ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా రాజకీయ లబ్ధి కోసం నియంతృత్వ ధోరణితో రాష్ట్రాన్ని ముక్కలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని విమర్శించారు.
అప్పట్లో గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్సే ఉన్నప్పటికీ ప్రత్యేక హోదా విషయం విభజన బిల్లులో ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. ప్రజలకు ద్రోహం చేసిన కారణంగానే కాంగ్రెస్ భూస్థాపితమైందన్నారు. పత్రికల్లో కనిపించేందుకు చౌకబారు ప్రకటనలు చేయడం మానుకోవాలని ఆయన ఈ సందర్భంగా రఘువీరాకు హితవు పలికారు.
వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు 18 జీఓ
రాష్ట్ర వ్యాప్తంగా వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు జీవో నంబరు 18ని విడుదల చేశామని మంత్రి పల్లె తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 వేల ఎకరాలకు గానూ 39 వేల ఎకరాలకు పైగా వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయని వెల్లడించారు. అనంతపురం జిల్లాలో 3,165.71 ఎకరాలకు గానూ 290.45 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు గుర్తించామని చెప్పారు. వీటిని అధికారులు పరిశీలించి తిరిగి వెనక్కు తీసుకుంటారన్నారు.
రూ.856.55 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల
కరువు జిల్లా అయిన అనంతకు 2014-15 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.856.55 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల చేసినట్లు మంత్రి పల్లె తెలిపారు. ఇందులో రూ.848.55 కోట్లు సంప్రదాయ పంటలకు, రూ.8 కోట్లు ఉద్యాన పంటలకు వర్తిస్తుందని వివరించారు. మొత్తం 5.81 లక్షల హెక్టార్లలో దెబ్బతిన్న సంప్రదాయ పంటలకు పరిహారం విడుదల చేయగా .. అందులో 4.95 లక్షల హెక్టార్లకు సంబంధించి వేరుశనగ ఉన్నట్లు తెలిపారు.