సుశీలకు కొప్పరపు జాతీయ పురస్కారం

P Susheela Get Kopparapu National Award - Sakshi

డాక్టర్‌ ఆశావాది ప్రకాశరావుకు అవధాన పురస్కారం

కుర్తాళం పీఠాధిపతి శ్రీసిద్ధేశ్వరానంద భారతీ స్వామికి గురుపూజోత్సవం

నేడు ప్రదానోత్సవం

విశాఖపట్నం ,మద్దిలపాలెం :  గానకోకిల, సినీ నేపధ్యగాయని పి.సుశీల ప్రతిష్టాత్మకమైన కొప్పరపు కవులు 2019 జాతీయ ప్రతిభ పురస్కారానికి ఎంపికయ్యారు. నగరంలోని మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో సోమవారం జరిగే కొప్పరపు కవుల కళాపీఠం 17వ వార్షికోత్సవంలో అతిరథ మహారథుల చేతుల మీదుగా ప్రదానం చేయనున్నారు. అలాగే సంప్రదాయ ప్రకారం అవధాన విద్యలో సాహితీవేత్తలకు ఇచ్చే‘ అవధానాచార్య’ పురస్కారానికి  డాక్టర్‌ అశావాది ప్రకాశరావును ఎంపిక చేశారు.  కుర్తాళం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి (పూర్వాశ్రమంలో) ప్రసాదరాయ కులపతికి‘గురుపూజోత్సవం ’నిర్వహించనున్నారు. కొప్పరపు కవులు కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు, సీనియర్‌ జర్నలిస్టు మాచవరం వేంకట చెంచురామ మారుతీ సుబ్బరాయ శర్మ (మా శర్మ) ఆధ్వర్యంలో   కార్యక్రమ నిర్వహణకు సన్నాహాలు పూర్తి చేశారు.

ముఖ్య అతిథులుగా మంత్రి ముత్తంశెట్టి, సీఎస్‌ ఎల్వీ
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి ముత్తంశెట్టి  శ్రీనివాస్, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధరరావు,  సినీగేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

పురస్కారాలు అందుకున్న ఉద్దండులు
కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి( 1885–1932), కొప్పరపు వేంకటరమణ(1887–1942) జంటకవుల పేరిట నెలకొల్పిన ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్న ఉద్దండుల్లోపండిట్‌ శివకుమార్‌శర్మ, పండిట్‌ జస్రాత్, పద్మవిభూషణ్‌ పండిట్‌ హరిప్రసాద్‌ చౌరాసియా, డాక్టర్‌ మాడుగుల నాగఫణి శర్మ, వేటూరి సుందరరామూర్తి, బేతవోలు రామబ్రహ్మం, మేడసాని మోహన్, మల్లాది చంద్రశేఖర్‌శాస్త్రి, డాక్టర్‌ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కోట సచ్చిదానంద శాస్త్రి, గరికిపాటి నరసింహారావు కళాతపస్వి కె. విశ్వనా«థ్, డాక్టర్‌ నేదునూరి కృష్ణమూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి వంటి దిగ్గజాలున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top